గెలుపు కోసం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
 
       అడవికి రాజైన సింహం తన వృద్ధాప్యం, అనారోగ్యాల వల్ల రాజు పదవి నుంచి తప్పుకోవాలని, అడవికి కొత్త రాజును నియమించాలని అడిగింది. ఎవరినీ నియమిద్దామని మంత్రి ఏనుగును అడిగింది. అక్కడే ఉన్న కోతి "ఓ మృగరాజా! మానవులు ఎక్కువ మంది కోరిక ప్రకారం పాలకులను ఎంచుకుంటారు. మనమూ అలాగే చేద్దాం." అన్నది. పెద్దపులి, నక్క, ఎలుగుబంటిలు పోటీకి వచ్చాయి. పది రోజుల్లో అడవి జీవులతో సమావేశమై వాటి అభిప్రాయం ప్రకారం కొత్త రాజును నియమిస్తానన్నది. 
       నక్క అడవి అంతా కలియ తిరుగుతూ పెద్దపులి, ఎలుగుబంటిల గురించి చెడుగా ప్రచారం చేయడం మొదలు పెట్టింది. వాటి చరిత్ర గురించి లేనివి కల్పించి యధేచ్ఛగా వాటి గురించి అనరాని, వినలేని పదజాలాలతో చెడుగా చెప్పింది. అవి గెలిస్తే అడవికి రాబోయే కష్టాలను గురించి చెప్పింది. ఎలుగుబంటి కూడా నక్క బాటలోనే పులి గురించి, ఎలుగుబంటి గురించి చెడుగా ప్రచారం చేసింది. పెద్దపులి మాత్రం ప్రశాంతంగా ఉంటూ అడవి అంతా కలియ తిరుగుతూ సమస్యల్ని పరిశీలించింది. ఎన్నికలు అయ్యాయి. అడవిలోని జీవులన్నీ పెద్దపులినే రాజుగా ఎన్నుకున్నాయి. నక్క, ఎలుగుబంటి ఒకదాని గురించి మరొకటి చెడుగా ప్రచారం చేయడం వల్ల, ఈ చరిత్ర హీనులను పాలకుడిగా ఎన్నుకుంటే కష్టాలు తప్పవని భావించాయి. అందుకే ఒకరిపై మరొకరు అనవసరంగా నిందలు వేసుకునే కంటే జనానికి ఉపయోగపడే పనులు చేస్తే మంచిది. అడవి జీవులు మేథావులు కాబట్టి మంచి రాజును ఎన్నుకోవడంలో తెలివిగా ప్రవర్తించాయి.

కామెంట్‌లు