అరిపిరాల : రామ్మోహన్ రావు తుమ్మూరి

 1
ఈనాటి కరీంనగరము
ఏనాటిదొ అరిపిరాల ఇట నెప్పటిదో
కానబడు శాసనమ్మున
ఈ నామము గానవచ్చు నిది యిటులుండన్
2
వేయేండ్ల చరిత గలిగిన
మా యెలగందుల ఖిలాకు మరి తూర్పు దిశన్ 
డాయుచు మానేరెడమన్
స్థేయంబై యొప్పు పల్లె చెలగెను నాడే 
3
వెల్లకి గంగాధరకవి
తల్లజుడీ సీమకెల్ల తగు ప్రతినిధియై
కొల్లగ దేవాలయములు
ఎల్లెడ నిర్మింపజేసె ఎంతయొ భక్తిన్
4
నగరూరు రాజధానిగ
నిగిడించెను సబ్బినాడు నిండుగ నతడే
నగరూరే నగనూరుగ
మిగిలెను ఆనాటి విభవ మేర్పడ జెప్పన్
5.
నగనూరుకు ఆగ్నేయపు
దిగువనగల పల్లె యొండు దినదిన మెసగెన్ 
ఎగువకు నదియే పురియై
నగరయ్యెను పిదప కరిము నగరంబయ్యెన్
కామెంట్‌లు