పుస్తకం;-- యామిజాల జగదీశ్

పుస్తకం
చేతులలో లేని సాయంత్రాలు 
చేతులు లేని మనిషికి 
దొరికిన వీణలాంటిది
వృధాగా క్షణాలను
గడుపుతుంది!!

అక్షరాలను 
అలక్ష్యం చేస్తే 
అంత కన్నా దారుణం
మరొకటి ఉండదు

నన్ను నేనే కోల్పోవడానికి
ప్రయత్నించేటప్పుడు
నేను నా ఆచూకీ కోసం
వెతుక్కుంటున్నప్పుడు
పుస్తకాలు మాత్రమే
కళ్ళముందుకొస్తాయి

మాటలకు మనసిచ్చి
పేజీలతో ప్రయాణిస్తున్నప్పుడు
కథలతోనో
కవితలతోనో
కరిగిపోతున్నప్పుడు కలిగే
అనుభూతిని చెప్పడానికి
మాటలు చాలవు

పుస్తకాలు లేని అరలు
గాలిని కట్టి బంధించేసిన 
సమాధులే
లేకుంటే
రెక్కలను నరికేసిన 
పక్షులే

పుస్తకాలు లేకుంటే
నేను శ్వాసించలేనని
ఆలోచించిన కాలాలున్నాయి

ఓ పుస్తకం కొనుక్కొచ్చుకునో
లేక తెచ్చుకునో
దాని వంక చూడనప్పుడు 
అవి కోపగించుకోవడం
కసురుకోవడం 
చెవులకు వినిపిస్తాయి
ఏదో నలుగురూ చూడాలనుకుని 
ఇంట్లో పుస్తకాలను 
అలంకరణ వస్తువులుగా 
మార్చేసేవా అని తిడతాయి

పుస్తకాన్ని 
తీసుకుని చదవడానికి ముందర
అందులోని వాసనను
ఆఘ్రాణించాలి
పుస్తకం చదివే అలవాటున్నవారికి
ఆ వాసన పరిచయమవుతుంది
ఆ వాసనకున్న మహత్తు 
ఎలా చెప్పాలి
అనంతరం పుస్తకానికి
కళ్ళప్పగించాలి
పుస్తకమూ
ప్రేమా ఒక్కటే
రెండింటికీ 
కళ్ళు ప్రధానం

పుస్తకం
ధ్యాసవాలి
శ్వాసవాలి
లేకుంటే శూన్యం
ఆవరించి మనసు
అంధకారంలో పడి
అవస్థలపాలై అస్తమిస్తుంది

అనుకున్న
పుస్తకం కనిపించకపోతే
నా హృదయం
తల్లిని పోగొట్టుకున్న పిల్లాడిలా
తల్లడిల్లుతుందీ

అందుకే పుస్తకంతో 
ఎప్పుడెలా ఏర్పడిందో తెలీదు కానీ
అదొక్కటే ఇప్పటికీ నన్ను వీడక
తనతో నడిపిస్తోంది

ఈ జీవితప్రయాణంలో 
ఎందరో వ్యక్తులు పరిచయమై 
కనిపించకుండా పోయినా 
పుస్తకప్రపంచం మాత్రం
నన్ను తన చేయిపట్టుకుని
తీసుకుపోతోంది

పుస్తకం 
ఓ ధైర్యం
ఓ భరోసా
ఓ ఓదార్పు
దగా చేయని శక్తి
జీవితానికో ముక్తి
అందుకే పుస్తకంమీద 
అంతులేని భక్తి!!


కామెంట్‌లు