"సినిమా రాణి" టి.పి. రాజలక్ష్మి;- జగదీశ్ యామిజాల
 తమిళంలో తొలిసారిగా 1931లో విడుదలైన టాకీ సినిమా కాళిదాస్. ఈ సినిమాలో కథానాయిక టి.పి. రాజలక్ష్మి.
తమిళ సినీ ప్రపంచంలో 
ఆమె నటిగానే కాక కథారచయిత్రిగానూ, మాటల రచయిత్రిగానూ, నిర్మాతగానూ, దర్శకురాలిగానూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
1911 నవంబర్ 11వ తేదీన తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యారులో పంచాపకేశన్, మీనాక్షి దంపతులకు జన్మించిన రాజలక్ష్మి 1931 మొదలుకుని 1943 వరకు మొత్తం పద్నాలుగు సినిమాలలో నటించారు.
రాజలక్ష్మికి ఎనిమిదో ఏటికల్లా ముత్తుమణితో పెళ్ళయింది.  అభం శుభం తెలియని వయస్సులో జరిగిన ఈ వైవాహిక బంధం ఏడాదిలోపే ముగిసిపోయింది. మెట్టినింట వరకట్న వేధింపుల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చేశారు.
ఆమె తండ్రి మరణించిన తర్వాత పేదరికాన్ని అనుభవించారు.  తల్లితో కలిసి తిరుచ్చికి చేరారు.
తిరుచ్చీలో స్వామి శంకరదాస్ పరిచయమవడంతో సామన్నా నాటకసంస్థలో చేరిన రాజలక్ష్మికి నటించే అవకాశం లభించింది. 
పదకొండో ఏట ఆమె నటించడం మొదలుపెట్టారు. ఆమె నటించిన తొలి నాటకం - పవళక్కొడి. 
ఆ తర్వాత మరొక నాటక సంస్థలో చేరి ఓ నాటకంలో కథానాయికగా నటించారు. ఈ సంస్థ నటీనటులతో కలిసి బర్మా, శ్రీలంక తదితర దేశాలకు వెళ్ళి నాటకప్రదర్శనలిచ్చారు.
 అనంతరం ఎస్జీ కిట్టప్ప, త్యాగరాజ భాగవతార్, వి.ఎ. చెల్లప్పా వంటి అగ్రశ్రేణి నటులతో కలిసి నటించిన రాజలక్ష్మికి దేశభక్తిపాటలంటే ప్రాణం. 
నటరాజ ముదలియార్ దర్శకత్వం వహించి నిర్మించిన కీచకవధం, కోవలన్ వంటి మూకీ సినిమాలలో నటించిన రాజలక్ష్మి టాకీ సినిమా కాళిదాస్ లో నటించడమేకాక పాటలు పాడి సెహబాష్ అనిపించుకున్నారు. దేశభక్తి పాటలు పాటలు పాడటంతో ఆమెను ఆంగ్లేయులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
కాళిదాస్ సినిమా తర్వాత రామాయణం అనే సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. సీత, శూర్పణఖ పాత్రలు పోషించి ప్రశంసలందుకున్నారు. దీంతోనే ఆమెకు "సినిమా రాణి" అనే బిరుదు లభించింది.
హరిశ్చంద్రన్, సత్యవాన్ సావిత్రి, ఉషా సుందరి, రాజేశ్వరి, మదురై వీరన్ వంటి చిత్రాలలో నటించిన రాజలక్ష్మి 1933లో నటించి విడుదలైన "వల్లి తిరుమణం" చిత్రం సూపర్ హిట్టయింది. ఆ సమయంలోనే తనతో కలిసి నటించిన టి.వి. సుందరంను పెళ్ళాడిన రాజలక్ష్మి కలకత్తాలో నివసించారు. అక్కడుంటూనే ద్రౌపది, హరిశ్చంద్ర, గులేబకావళి తదితర చిత్రాలలో నటించారు.
కలకత్తా నుంచి చెన్నై చేరుకున్న రాజలక్ష్మి మిస్ కమల అనే పేరిట తానే కథ, మాటలు రాసి ఓ సినిమాను నిర్మించి దర్శకత్వమూ వహించారు. అయితే ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు.
 ఆ తర్వాత మదురై వీరన్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆమె సోదరుడు టి.పి. రాజగోపాల్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. మరొక సోదరుడు టి.పి. రాజశేఖరన్ సినిమా నిర్వాకాన్ని చూసుకున్నారు.
కమలవల్లి (డాక్టర్ చంద్రశేఖర్), విమల, సుందరి, వాసంతికా, ఉరయిన్ వాల్ తదితల నవలలు రాసిన రాజలక్ష్మి కన్నకూతురు పేరు కమలామణి. అలాగే మల్లిక అనే అమ్మాయిని పెంచుకున్నారు. 
తమిళనాడులో నాటకాలలో నటించడానికి స్త్రీలు ముందుకొచ్చేవారు కాదు. అటువంటి రోజుల్లో ఆమె నాటకాలలోనూ సినిమాలలోనూ నటించి ఎందరికో ఆదర్శనటిగా నిలిచారు.
రాజలక్ష్మి ఎంజీఆర్ కన్నా ఆరేళ్ళు, శివాజీకన్నా 17 ఏళ్ళు పెద్ద. వీరిద్దరూ సినిమాకు రాకముందే ఆమె 1929లో రఘుపతి పర్యవేక్షణలో వచ్చిన మదురైవీరన్ సినిమాలో కథానాయికగా నటించారు. అప్పటిదాకా నాటకాలలోనూ సినిమాలలోనూ పురుషులే స్త్రీల పాత్రలను పోషించేవారు. కానీ రాజలక్ష్మి ప్రవేశంతో ఆ స్థితి మారింది.
పదేళ్ళపాటు తమిళ, తెలుగు చిత్రాలలో నటించిన రాజలక్ష్మి చెన్నై కీల్పాక్కులోని రాజరత్నం వీధిలో ఒకటో నెంబర్ భవంతిని ఓ తెలుగు జమిందారు నుంచి కొనుగోలు చేయడమే ఆమె తొలి స్థిరాస్తి. ఆ తర్వాత అదే వీధిలో మరికొన్ని ఇళ్ళనుకూడా కొన్న రాజలక్ష్మి ప్రొఫెసర్ సుబ్రమణ్యం వీధిలోనూ, వాసు వీధిలోనూ ఇళ్ళు కొనుగోలుచేశారు. ఆమె నివసించిన బంగళాలోనే రాజలక్ష్మి సోదరుల కుటుంబాలూ ఉండేవి. 
ఆమె నటజీవితంలో ఏ స్థాయిలో ఉన్నారనడానికి రాజలక్ష్మి దర్శకత్వం వహించి నటించిన వల్లి తిరుమణం ప్రకటనే చెప్పక చెప్తుంది.... పి.వి. రావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం 1933 జనవరిలో విడుదలైంది.
ఆ ప్రకటన దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రితంనాటిది.
"వేదిక అలంకృత, గానలోల, గానామృత, సినిమా రాణి టి.పి. రాజలక్ష్మి అని ఆమెను సంబోధిస్తూ పయనీర్ కంపెనీ వారి "వల్లి తిరుమణం" సినిమాను చూడండి!!
రామాయణం, సావిత్రి తదితర చిత్రాలలో నటించిన యావత్ దక్షిణ భారతావనిలో తన నటనతో ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన కథానాయిక రాజలక్ష్మి!!  
సినీ అభిమానులకు శుభవార్త !! 
భారీ ఖర్చుతో ప్రథమశ్రేణి నటీనటులతో రూపొందించిన చిత్రం - వల్లి కళ్యాణం!! చూడండి!! ఆనందించండి!!
ఇది సంపూర్ణ టాకీ చిత్రం!! 48 పాటలున్న చిత్రం !!
ఒయ్యారమైన వస్త్రధారణతో నటీమణులు నటించిన సన్నివేశాలకోసం ఈ సినిమాను తిలకించండి !!
ఆమె నటించిన సినిమాలకు ప్రకటనలు ఇంతలా వెలువడుతుండేవి. ఆ ప్రకటనలలో కథానాయకుడికన్నా ఆమెను ప్రముఖంగా హైలైట్ చేసేవారు.
1964లో రాజలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు.

కామెంట్‌లు