మనోరమ ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 పలు వేదికలపై జయలలితను హత్తుకుని ముద్దిచ్చే చనువు ఒక్క మనోరమకే ఉండేది.
ఒక్క జయలలితే కాదు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, నటులు రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక, శివకుమర్ ఇలా ఎందరో ప్రముఖులు మనోరమ ప్రేమాభిమానులు పొందినవారే.
ఏడాదా రెండేళ్ళా... 1958 నుంచి తుదిశ్వాస వరకూ మనోరమ నటిస్తూనే ఉన్నారు.
నాటకాలో సినిమానో ఆకాశవాణో లేదా బుల్లితెర సీరియల్సో ఏదో ఒక రూపంలో మనోరమ నటిస్తూనే ఉన్నారు.
"మనోరమ ఓ మహిళా శివాజీ" అని ఆమె నటనను ప్రశంసించారు నటుడు, రచయిత అయిన చో రామస్వామి.
యాభై ఏళ్ళకుపైగా నటనను శ్వాసిస్తూ జీవించిన మనోరమ మరణించినప్పుడు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిందన్నది మామూలు మాటవుతుంది.
ఇంతకూ ఈ మనోరమ ఎవరు? అయిదుగురు ముఖ్యమంత్రులతో సినిమాలలో నటించిన ఘనత మనోరమది.
తమిళ చలనచిత్ర పరిశ్రమ ఆ రాష్ట్రానికి అందించిన ముఖ్యమంత్రులు అరింజ్ఞర్ అన్నాదురై, కలైంజ్ఞర్ కరుణానిధి, పురట్చి తలైవర్ ఎంజీఆర్, సెల్వి జయలలితలతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండిన ఎన్టీ రామారావుతో నటించిన ఖ్యాతి గడించిన ఆవిడే ప్రముఖ హాస్య నటి మనోరమ.
తమిళ సినిమాలో ఆవిడ సాధన ఆశ్చర్యకరమైనది. దాదాపు అయిదు వేలకుపైగా నాటకాలలోనూ, 1200లకు పైగా సినిమాలలోనూ నటించి ఎనలేని పేరుప్రతిష్టలు గడించి గిన్నిస్ రికార్డు పుస్తకానికెక్కిన మనోరమ మహానటి.
 
భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ‌, తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి ఇలా ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన మనోరమ అసలు పేరు గోపీశాంత. ఆవిడ గురించి కొన్ని సంగతులు చూద్దాం...
1943 మే 26వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని మన్నార్గుడిలో జన్మించిన మనోరమ తండ్రి కాశి. తల్లి రామృతమ్మాళ్.
 
పేదరికంతోపాటు కుటుంబ పరిస్థితుల కారణంగా మనోరమ తన తల్లితో పాటు రామనాథపురం జిల్లా కారైక్కుడికి దగ్గర్లోని పళ్ళత్తూర్ అనే ప్రాంతానికి వచ్చేసారు.
 
తన ప్రాథమిక విద్యను పళ్ళత్తూరులోని ఓ స్కూల్లో మొదలుపెట్టిన మనోరమకు చిన్నప్పటి నుంచే పాటలు పాడటమంటే మహా ఇష్టం.
తల్లి అనారోగ్యంతో తన చదువుసంధ్యలను సగంలోనే మానుకుని ఓ ధనికుడి ఇంట పిల్లను చూసుకునే పనిలో కుదిరారు.
 
ఓరోజు మనోరమ ఉంటున్న ఊళ్ళో ఆందమాన్ కాదలీ అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో స్త్రీ పాత్ర పోషించిన ఆమెకు సరిగ్గా పాడటం రాలేదని గ్రహించి మనోరమను ఆ పాత్రలో నటింపచేశారు. ఆ నాటకంలో మనోరమ పాట, మధురస్వరం, నాట్యాన్ని చూసిన వారందరూ ఎంతగానో ప్రశంసించారు.
 
అంతేకాదు, ఆ నాటకానికి దర్శకుడిగా వ్యవహరించిన సుబ్రమణ్యం సహాయకుడు తిరువేంగడం, హార్మోనియం వాయించిన త్యాగరాజన్ కలిసి కూడబలుక్కుని మనోరమ అని పేరు మార్చారు. అనంతరం పలు నాటకాలలో నటించే అవకాశం ఆమెకు దక్కింది. నాటక ప్రపంచ రాణిగా కీర్తింపబడ్డారు మనోరమ.
ఆవిడ వైరం నాటక సభవారి నాటకాలలో నటిస్తుండగా చెన్నైలో కొన్ని నాటకాలలి నటించే అవకాశమొచ్చింది. అప్పుడు జానకిరామన్ ఈమెను వెతుక్కుంటూ వచ్చి తాను "ఇన్బ వాయ్వు" అనే సినిమా తీయబోతున్నట్టు, అందులో నటించేందుకు మీతో అగ్రిమెంట్ చేయించుకోవడానికి వచ్చానని మనోరమతో అన్నారు. 
 
కానీ ఆ సినిమా సగంలోనే ఆగిపోయింది.
 అయితే ఆ తర్వాత కవి కణ్ణదాసన్ ఆవిడకు తమ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరు ఊమయిన్ కోట్టయ్. కానీ ఆ సినిమాకూడా ఆదిలోనే ఆగిపోవడంతో మనోరమ ఎంతో బాధ పడ్డారు.
అయితే కవి కణ్ణదాసన్ 1958లో తాను తీసిన మాలయిట్ట మంగై సినిమాలో హాస్య నటిగా పరిచయం చేశారు. దీంతోనే మనోరమ సినిమా జీవితానికి శ్రీకారం చుట్టినట్లయింది.
 
మనోరమది ప్రేమవివాహం. ఓ నాటక సంస్థలో ముఖ్య బాధ్యతలో ఉన్న ఎస్. ఎం. రామనాథన్ ఆవిడను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు పుట్టాడు. అతని పేరు భూపతి.
తమిళ సినీ పరిశ్రమవాళ్ళు, అభిమానులు ఆమెను ఆచ్చి అనే పిలిచేవారు. 
ఆమె కథానాయికగా నటించిన తొలి సినిమా "కొంజుం కుమరి". మోడర్న్ థియేటర్స్ అధినేత టి. ఆర్. సుందరం ఈ సినిమాను నిర్మించి 1963లో విడుదల చేశారు.
అభిమానుల హృదయాల్లో గూడుకట్టుకున్న మనోరమ పోషించిన పాత్రలు లెక్కలేనన్ని.
1960 దశకమైనా కావచ్చు లేక 2000 తర్వాతైనా కావచ్చు మనోరమ నటించిన కథాపాత్రలన్నీ అభిమానుల మదిలో స్థిరమైన ముద్ర వేసుకున్నాయనడం అతిశయోక్తికాదు. ప్రత్యేకించి తిల్లానామోగనాంబాళ్ చిత్రంలో శివాజీ, పద్మినీలతో పోటీగా నటించిన మనోరమ పొందిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాలో మనోరమ జిల్ జిల్ రమామణి హాస్యపాత్రలో అద్భుతంగా నటించారు.
హాస్యనటిగా తమిళ సినీచరిత్రలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న మనోరమ ఓ ఇంటర్వ్యూలో "చివరి వరకూ నటిస్తూ ఉండాలన్నదే నా ఆశ. సినిమా లేదంటే నాటకం అదీ లేదంటే తెరిక్కూత్తులోనైనా నటించడం మొదలుపెడతాను. ఇది నా ఆశ" అన్నారు.
అందుకే కాబోలు అనారోగ్యంతో చివరి రెండేళ్ళలో పెద్దగా నటించడమో వేడుకలలో పాల్గొనలేకపోయిన మనోరమ 2015 అక్టోబరులో తనువు చాలించారు.

కామెంట్‌లు