పొగరు (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
 ఆ అడవికి రాజైన సింహం చక్కని పరిపాలనతో అడవి జీవులను అన్నింటినీ ఆకట్టుకుంది. వేట చాలా పరిమితంగా అవసరం అయితేనే జరగాలి. తప్పు చేసే జీవులకు కఠినమైన శిక్షలు అమలు అయ్యేవి. వాటికి విద్య, నైతిక విలువలు నేర్పడానికి మేథావి ఏనుగును నియమించింది. అయితే సింహం కుమారుడు అయిన యువ సింహం తాను రాజు కుమారుణ్ణి అనే పొగరుతో అడవి జీవుల పట్ల అనుచితంగా ప్రవర్తించేది.
       ఒకరోజు ఆ యువ సింహానికి గుర్రం ఎదురైంది. "నువ్వు పరుగుల రాణివట. ఏదీ ఈ మైదానం చుట్టూ పరుగెత్తు. నేను ఆపమనేదాకా పరుగెత్తుతూనే ఉండాలి. నాకు వినోదం చూడాలని ఉంది. లేకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తాను." అన్నది. ఆ గుర్రం పరుగెత్తీ పరుగెత్తీ సొమ్మసిల్లి పడిపోయింది. మరోసారి నెమలిని కలిసి "నీ అందమైన నాట్యంలో నాకు కనువిందు చేయాలి. నేను ఆపమవే దాకా చేయాలి." అంది. మరోసారి ఒక కోడి వద్దకు వెళ్ళి "నువ్వు చాలా ఎత్తుకు ఆ మర్రిచెట్టు కొన దాకా ఎగిరి కూర్చోవాలి. మళ్ళీ కిందికి దూకాలి. కోడి ఎత్తుకు ఎగురుతుంటే చూడాలని ఉంది." అన్నది. ఇలా హింసించేది.
         సింహం అందరినీ క్రమశిక్షణలో పెట్టి తన కుమారుని మాత్రం ఎందుకు ఇంత గారాబం చేస్తుందో ఏ జీవికీ అంతు పట్టడం లేదు. క్రమంగా ఆ అడవిలో ఉండలేక జీవులన్నీ వేరే అడవుల్లోకి వెళ్ళిపోతున్నాయి. యువ సింహం ఆగడాలు వనరాజుకు చెప్పే సాహసం ఎవరూ చేయలేక పోతున్నారు. అడవిలోని జీవులన్నీ తగ్గిపోవడం సింహం దృష్టికి వచ్చింది. సింహం ఎంతో కలవర పడింది. అప్పుడు కోతి ఇలా సలహా ఇచ్చింది. "వనరాజా! మీ పరిపాలన అద్భుతంగా ఉంది. కానీ మీరు ఒక్కచోటే ఉంటే సమస్యలు ఏం తెలుస్తాయి? అడవి అంతా కలియ తిరగండి. జంతువుల, పక్షుల సమస్యలు తెలుస్తాయి." అన్నది. 
       సింహం అడవిలో తిరుగుతున్న క్రమంలో దానికి ఒక దృశ్యం కంట పడింది. చాటుగా గమనించింది. తన కుమారుడు దారిన పోతున్న జింక, కుందేలును పిలిచి వాటిని కొట్టుకోమని ఆదేశించింది. "మేము ప్రాణ స్నేహితులం యువరాజా!" అన్నాయి ‌‌అయితే ఇంకేం. బీభత్సంగా కొట్టుకోవాలి. ఆ తర్వాత కూడా మీ స్నేహం కొనసాగితే మీరు ప్రాణ స్నేహితులు అని నమ్ముతాను." అంది. సింహం తన కొడుకును మందలించింది. అడవి జీవులను అన్నింటినీ సమావేశపరచి తన కుమారుని వల్ల అవి పడుతున్న బాధలను తెలుసుకుంది. తన దృష్టికి ఎందుకు తేలేదని మందలించింది. మేథావి ఏనుగుకు తన కుమారుణ్ణి అప్పజెప్పి నైతిక విలువలను నేర్పమని వేడుకుంది. వినకపోతే చెప్పమని, తన కుమారుణ్ణి అడవి నుంచి బహిష్కరిస్తానని చెప్పింది. 

కామెంట్‌లు