గౌరవం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

 అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. మంత్రిగా గుంటనక్క ఉండేది. ఆ నక్కకు అడవిలో ఏ జీవికీ సాయం చేసే గుణం లేదు. పైగా తాను మంత్రిననే అహంకారంతో చాలా జీవులతో సేవలు చేయించుకునేది‌. ఆ సేవలు చేసినందుకు నక్క వాటికి ఏ ప్రతిఫలమూ ఇచ్చేది కాదు. కృతజ్ఞతలు చెప్పడం దానికి అస్సలూ ఇష్టం లేదు. అయితే అడవిలోని చిన్నా పెద్దా జీవులు అన్నీ నక్కను గౌరవించాలి. నమస్కరించాలి. అలా చేయని వాటిపై లేనిపోని నిందలు మోపి సింహం చేత శిక్షింపజేసేది. అందుచేత భయంతో ప్రతి ఒక్క జీవీ నక్కను గౌరవించేవి.

       ఒకరోజు ఒక జింక నక్కను చూసి, పట్టించుకోకుండా వెళ్ళింది. అప్పుడు ఆ నక్క జింక వెంబడి పడి, దానిని ఆపి, "నీకు ఎంత పొగరు. ఈ అడవికి మంత్రిని అయిన నన్ను గౌరవించవా? చూడు నిన్ను ఏం చేస్తానో!" అంటూ సింహం వద్దకు వెళ్ళి, జింక మీద చాడీలు చెప్పింది నక్క. జింక ఎంత మంచిదో సింహానికి తెలుసు. అందుకే జింకను పిలిపించలేదు. నక్క జింకపై కోపం పెంచుకుంది. ఒకరోజు జింక తనకు ఎదురు పడిన ఎలుకకు నమస్కరించి, గౌరవంతో మాట్లాడింది. నక్కకు అరి కాలి మంట నెత్తికి ఎక్కింది. "సాక్షాత్తూ ఈ అడవికి మంత్రినైన నన్ను పట్టించుకోక ఈ అల్పజీవిని గౌరవిస్తావా? ఎంత పొగరే నీకు?" అంది. "ఎలుకను ఎంత గౌరవించినా తక్కువే. అది ఈ అడవిలోని ఎన్నో జీవులు వేటగాని వలలో చిక్కుకుంటే వలతాళ్ళు కొరికి వాటి ప్రాణాలను రక్షించింది. నువ్వు గౌరవించదగిన పనులను ఏమీ చేయలేదు. అడవి జీవులకు ఆవగింజంత సహాయం కూడా చేయలేదు. స్వార్థజీవికి గౌరవానికి అర్హత లేదు." అన్నది జింక. "ఎంత తల పొగరే నీకు? మృగరాజు చేత నీకు బుద్ధి చెప్పిస్తా చూడు." అంటూ ఆవేశంగా సింహం దగ్గరకు వెళ్ళింది.

         "మహారాజా! ఆ జిత్తులమారి జింక మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నదో తెలుసా! మీరు గౌరవించదగిన వారు కాదట. మీరు స్వార్థ జీవులట. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదట. ఇంకా అనరాని మాటలు అన్నీ అనేసింది." అన్నది నక్క. "వెంటనే జింకను పిలిపించండి." అని ఆజ్ఞాపించింది నక్క. జింకను పిలిపించారు. "చూడు జింక మిత్రమా! నువ్వు ఈ అడవి జీవులకు ఎంతో సహాయం చేస్తున్నట్లు నాకు తెలిసింది. పైగా వైద్యం నేర్చుకొని అడవి జీవులకు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేస్తున్నట్లు తెలిసింది. కానీ నాకు క్షణం తీరిక లేనందు వల్ల నిన్ను కలిసే అవకాశం రాలేదు. ఈరోజు ఈ నక్క పుణ్యమా అని నిన్ను కలిసే అదృష్టం కలిగింది. నీకు కృతజ్ఞతలు మరియు అభినందనలు. నీ సేవలకు గుర్తింపుగా నిన్ను ఈ అడవికి మంత్రిగా నియమిస్తున్నాను. ఈ జిత్తులమారి నక్కతో ఎవరికీ ప్రమాదం రాకుండా ఈ అడవి నుంచి బహిష్కరిస్తున్నాను." అన్నది సింహం. నక్కకు తగినశాస్తి జరిగింది. గౌరవం అనేది మన హోదాను బట్టి రాదు. మనం చేసే పనులను బట్టి వస్తుంది. ‌
 

కామెంట్‌లు