రాణి మహామాయ...అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రాచీన కాలంనుండి  మన భారత దేశం  రాజపుత్రవీరుల ధైర్య సాహసాలకి దేశభక్తికి పుట్టిల్లు.అలాగే  రాజపుత్రస్త్రీలు కూడా ధైర్యం శాంతం త్యాగానికి ప్రతీకలు. ఉత్తర భారత దేశం అంతా నేటి కీ వారికధలతో మారుమోగుతుంది.మేవాడ్ రాణా రాజసింహుని దగ్గరకు  మార్వాడ్ మహారాణి  జస్వంతసింహుని భార్య  మహామాయ వచ్చి  శరణు వెడుతుంది."రాణా!నా కొడుకుని మీవద్ద ఉంచుకొని కాపాడండి. ఔరంగజేబు మమ్మల్ని  తుదముట్టించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. "
రాణా ఇలా అన్నాడు "అమ్మా!నీవు ఇంతగా ప్రాధేయపడిచెప్పాల్సిన పని లేదు. నీకొడుకు భారం నాది.సరేనా?" "రాణా!నాకుమార్తె దారిలోనే చనిపోయింది. నాచిన్నారి పుత్రుని  నీ అండలో వదిలి ఆ ఔరంగజేబు అంతు చూస్తాను."
"అమ్మా!రక్తపుటేరులు పారించటం మన రాజపుత్రుల ధర్మం కాదు. "మహామాయ క్రోధంతో రగిలిపోతోంది.
 "రాణా!ప్రతీకారం తీర్చుకోవాలనే ఆరోజు నేను జోహార్ అంటే అగ్నిప్రవేశం చేయలేదు. నాకు రెండు కళ్ళు  రెండు చేతులుగా  దుర్గాదాసు  కాశిం ఉన్నారు. నాభర్త పాలించిన మార్వాడ్ కెళ్ళి  వాడి అంతు తేలుస్తాను." పట్టుదల  సాహసం గల మహామాయ అన్నంతపని చేసింది. దుర్గాదాసు మొగల్స్ ని  మేవాడ్ నించి తరిమేసి  గుల్నార్ బేగంని పట్టి తెచ్చాడు.
రాణా రాజసింహ్ సేనానిని అడిగాడు "కాశ్మీరీబేగం గుల్నార్ ని ఎందుకు బంధించి తెచ్చావు?ఆమెను వెంటనే విడిచి పెట్టు."  "రాణాజీ!నేను కేవలం సేనాపతిని మాత్రమే!శత్రువుని బంధించే అధికారం నాకు ఉంది కానీ విడిచి పెట్టే హక్కు అధికారం మహారాణిదే!"అక్కడే ఉన్న మహా మాయ అంది"రాణా! బేగంని విడిచి పెట్టే ప్రశ్నేలేదు. నా పగ ప్రతీకారం తీర్చుకుంటాను.ఈ బేగం నాభర్తను చంపించింది.అడవిలో నివసించే అమాయకపు జంతువులపై క్రూరమృగం దాడి చేసినట్లు  ఈమె వల్ల మాకుటుంబం చెల్లాచెదురైనది.
 ఒక స్త్రీ కి శిక్ష విధించే అధికారం ఇంకో మహిళకు మాత్రమే ఉంటుంది. నేరస్తుల పై జాలిచూపితే దుర్మార్గులు పెచ్చుపెరిగి రెచ్చిపోతారు."  "లేదమ్మా! ఆదేవుడు  తప్పక దుర్మార్గులను  శిక్షించితీరుతాడు.అధర్మం తప్పక పతనమై తీరుతుంది. " "అన్నా! ఆవిషయం నాకు వదిలేయండి."అని బేగం గుల్నార్ ని తన ఎదుటికి తీసుకుని రమ్మని  దుర్గాదాసు ని ఆజ్ఞాపించింది."ఏం గుల్నార్!నీకెలాంటి శిక్ష విధించమంటావు?"  "అమ్మా!మహారాణీ!నేను ఇప్పుడు బందీని.మీ ఇష్టం." "ఓబేగం!నేను  ఒక తల్లి గా అక్కగా సకల మర్యాదలు లాంఛనాలతో నీభర్త దగ్గరకు పంపుతాను.దుర్గాదాసు!ఆమెను  స్వయంగా తీసుకుని వెళ్లి ఆమె భర్తకి  అప్పగించి రా!బేగం!ఇదే నేను  నీకు విధించే దండన!"మహామాయ  ఓ అపూర్వ దేవతగా కనపడుతున్న ది.గుల్నార్ ఆమెను  ఆరాధనగా చూస్తూ కన్నీరు  కార్చసాగింది.ఇదీ భారతీయ నారి ఔన్నత్యం!
కామెంట్‌లు