ఇరుకు : -మంగారి రాజేందర్ జింబో

 (4 June 2016)
నగరాల్లో స్వంత ఇల్లు అనేది ఓ కలగా మిగిలిపోయింది. నగరం మధ్య స్వంత ఇల్లు దుర్లభం. స్వంతంగా వున్న ఇళ్లు అన్నీ అపార్ట్‌మెంట్లుగా మారిపోతున్నాయి. నగరానికి ఆమడ దూరంలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి.
నగరం దగ్గర్లో వున్న గ్రామాలని నగరం మింగేసి ఎకరాలు ఎకరాలని గేటెడ్ విల్లాలుగా మారుస్తున్న పరిస్థితి. రోడ్డు పడిందంటే చాలు. దాని చుట్టూ గృహాలు వస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు మెరుస్తున్నాయి. అది రింగ్ రోడ్ కావొచ్చు. మామూలు రోడ్డు కావొచ్చు. దేశంలో రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారం మరేదీ కన్పించడంలేదు.
ఊర్లో వున్న ఎకరమో, రెండెకరాలో అమ్మేసుకొని ఏ అయిదవ అంతస్తులోనో ఆరో అంతస్తులోనో బతుకును వెలిగిస్తున్న మధ్యతరగతి జీవితాలు. నేను కూడా అదే విధంగా నగరం మధ్యలో మూడవ అంతస్తులో చేరిపోయాను. చుట్టపు చూపుగా కన్పించే సూర్య చంద్రులని చూస్తూ జీవితం కొనసాగిస్తున్నాను. నేనే కాదు చాలామంది నగరాల్లో ఇలాంటి జీవితమే కొనసాగిస్తున్నారు.
ఓ రోజు మా ఊరి నుంచి ఓ మిత్రుడు వచ్చాడు. మా ఫ్లాట్‌ని నిశితంగా చూస్తూ ఇలా అన్నాడు - ‘రెండు బెడ్‌రూంలా మూడా? మూడు బెడ్‌రూంలు అయినా మీకు సరిపోవు ఇరుకే’ అని సందేహం వెలిబుచ్చాడు.
పది గదులు వున్న ఊరిని వదిలిపెట్టి నగరానికి వస్తే ఇంతకు మించి పెద్ద ఫ్లాట్ దొరకదు. చాలా పెద్ద కుటుంబం వున్న వ్యక్తులకి మూడు గదుల ఇల్లు ఇరుగ్గానే ఉంటుంది. సరిపోవడం కష్టంగానే ఉంటుంది. కానీ సరిపుచ్చుకోక తప్పదు. 
మా మిత్రుడి సందేహానికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. కానీ మనస్సులో ఎన్నో ఆలోచనలు. పిల్లలు పెద్దవాళ్లై ఎగిరి ఏ మంచు ప్రాంతంలో నివసిస్తారో తెలియదు. ఏ నగరంలో వుంటారో తెలియదు. ఏ దేశం కాని దేశంలో జీవనం కొనసాగిస్తారో తెలియదు. ఏ డాలర్ ఒడిలో సేదతీరతారో అంతకన్నా తెలియదు. ఏం చెప్పగలం?
ఇవన్నీ మనస్సులో గిర్రున తిరిగి మా మిత్రుడికి ఈ విధంగా జవాబు చెప్పాను.
‘ఇప్పుడేమో ఇరుకు
రేపు విశాలం.
ఇప్పుడే విశాలమైతే
ఆ తరువాత
మరీ విశాలమై
హృదయాన్ని
ఇంకా భారం చేస్తుంది.’
పిల్లలు పెద్దగా అయిన తరువాత ఎక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడు ఇరుకు రేపు ఇదే ఫ్లాట్ విశాలం అవుతుందని అన్నాను. ఇంకా ఇలా అన్నాను-
‘ఇరుకైనా పర్వాలేదు
మరీ విశాలం కావొద్దనే
నా కోర్కె’
పిల్లలు ఎగిరి వెళ్లిన తరువాత ఇల్లు విశాలం అవుతుంది. అప్పుడప్పుడు వాళ్లు వచ్చి ఇల్లుని ఇరుకు చేయాలి.
ఇల్లు ఇరుకైనా ఫర్వాలేదు. హృదయాలు విశాలంగా ఉంటే చాలు. అలా వుండాలన్నది అందరి తండ్రుల ఆకాంక్ష 
           
కామెంట్‌లు