మెల్లిసై మన్నర్ఎంఎస్. విశ్వనాథన్:-- యామిజాల జగదీశ్


 కాలం చెరపలేని పలు పాటలకు సంగీతం స్వరపరచిన ఎం.ఎస్. విశ్వనాథన్ ను సంగీత ప్రపంచంలో హిమాలయమంతటివాడని తమిళులు చెప్పుకుంటారు.
ఆయన స్వస్థలం పాలక్కాడు. సుబ్రమణి నాయర్ దంపతులకు పుట్టిన ఎంఎస్వీ 
మనిషి తపస్సు చేస్తే మానవశిశువే జన్మిస్తే భగవంతుడు తపస్సు చేస్తే దైవబిడ్డ అవతరిస్తాడు. మెల్లిసై మన్నర్ ఎం.ఎస్.వీ.దైవబిడ్డ. యాభై ఏళ్ళకుపైగా లలితమైన సంగీతామృతాన్ని వీనులవిందుగా ప్రసాదించిన ఎంఎస్వీ తొమ్మిది వందల చిత్రాలకు పైగా సంగీతదర్శకత్వం వహించారు.
అన్బేవా, ఇరు మలర్గల్, ఊట్టివరై ఉరవు, కుడి ఇరున్ద కోవిల్, తవప్పుదల్వన్ వంటి చిత్రాలకు ఆయన సంగీతం సమకూర్చిన చెప్పుకోదగ్గవి.
 1987 నుంచి 2012 వరకు 25 ఏళ్ళు ఆయన దగ్గరే ఉంటూ పలు పాటలు రాసిన కామకోడియన్ జ్ఞాపకాలలోంచీ కొన్ని సంగతులివి...
ఆయన సంగీత ప్రయాణంలో ఎన్నో విషయాలు కామకోడియన్ తో పంచుకున్నారు.
కోయంబత్తూరులో సంగీతదర్శకుడు సుబ్బయ్య నాయుడు దగ్గర కుర్రాడిగా ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ ఆయన ఆదరణతో హార్మోనియం వాయించడంతోపాటు సంగీత దర్శకుడిగా ఎదిగారు ఎం.ఎస్.వి.
హిందీ సంగీత దర్శకుడు నౌషాద్ ని మానసిక గురువుగా భావించిన ఎంఎస్వీ కోయంబత్తూరులో ఆరోజుల్లో ఊరు బయట ఉన్న టూరింగ్ టాకీసులో హిందీ సినిమాలు ప్రదర్శించే వారు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో ప్రదర్శించిన సినిమాలను కుర్రాడిగా ఉన్నప్పుడు ఎంఎస్వీ రెండు మూడుసార్లు చూసేవారు. నౌషద్ పాటలను వినడంకోసం నైట్ షోను టూరింగ్ టాకీసుకి బయట కూర్చుని రాత్రి 1.30 గంటల వరకు విని ఆ పాటలను ఆస్వాదించి కాలినడకన జ్యూపిటర్ స్టూడియోకి వెళ్ళారొకమారు.
 ఓమారు వంతెన మీద కూర్చుని పాటలు వింటూ లీనమైనప్పుడు ఓ కారు ఆయనను  దాటుకుంటూ పోయింది. వెళ్ళిన ఆ కారు మళ్ళీ వెనక్క వచ్చి ఆయన దగ్గర ఆగింది. ఆ కారులో నటి టి.ఆర్ రాజకుమారి ఉన్నారు. ఆమెను చూసిన ఎంఎస్వీ వంతెన మీద నుంచి దిగి నమస్కరించారు.
 "ఒరేయ్, నువ్వు సుబ్బయ్య అన్న దగ్గర పని చేస్తున్నావు కదూ...ఇంత అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు?" అని అడిగారు టి.ఆర్. రాజకుమారి.
ఎంఎస్వీ విషయం చెప్పారు.
 "నీ దగ్గర గ్రాంఫోన్ పెట్టె లేదా?" అని రాజకుమారి అడగ్గా లేదమ్మా అన్నారు ఎంఎస్వీ.
అలాగా అంటూ రాజకుమారి తన దగ్గరున్న డబ్బులో ఓ వంద రూపాయలు ఎంఎస్వీకి ఇచ్చారు.
"నువ్వు రేపే ఓ గ్రాంఫోన్ పెట్టె కొనుక్కో" అం
టూనే ఎంఎస్వీని కార్లో ఎక్కమని చెప్పి స్టూడియో దగ్గర దింపేస్తానన్నారు రాజకుమారి. 
1942 - 43 ప్రాంతాలలో నూరు రూపాయల విలువ ఎంతో ఊహించుకోవచ్చు.
రాసిన పాటకు పల్లవి, చరణాలకు ఇరవై నీముషాల్లో సంగీతం స్వరపరిచేవారు ఎంఎస్వీ. ఆయనకెలా అంతటి ప్రజ్ఞ వచ్చిందో తెలీదు? అని ఆయనను దగ్గరుండి చూసిన వారు చెప్పే మాట.

హార్మోనియం పెట్టె వాయించడం మొదలుపెడితే ఇక కాఫీ, టీ, అన్నం ఇవేవీ గుర్తుకురావు ఆయనకు. 
 
కవి కణ్ణదాసన్ స్వంతంగా " మాలయిట్ట మంగై " సినిమా తీస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్వీ సంగీతం. కణ్ణదాసన్ ఎంఎస్వీతో "ఇదిగో చూడు విశు, ఈ సినిమాలో మొత్తం పది పాటలు. మీరు ట్యూన్ వేసి నన్ను రాయమని ఇబ్బంది పెట్టకూడదు. నేను రాసిచ్చే పది పాటలకూ మీరు సంగీతం సమకూర్చాలి" అన్నారు.
అప్పుడు ఎంఎస్వీ "అలాగేనండి. మీరు పాటలు రాసివ్వండి. ట్యూన్ సంగతి నేను చూసుకుంటాను" అన్నారు కణ్ణదాసన్ తో.
 మెల్లిసై మన్నన్ ఎంఎస్వీ సంగీతంలో కణ్ణదాసన్ రాసిచ్చిన పది పాటలూ అద్భుతంగా రూపొందాయి. అరవై దాటినా టి.ఆర్ మహాలింగం పాడిన పాట "అవళ్ సెందమిళ్ తేన్ మొయియాళ్" అనే పాట ఇప్పటికీ యవ్వనంగానే శ్రోతల మధ్య వినిపిస్తుంటుంది. అందుకు కారణం ఎంఎస్వీ సమకూర్చిన సంగీత బాణి అని చెప్పుకోవచ్చు. కణ్ణదాసన్ తో కలిసి 1960 నుంచి 1980 వరకూ అద్భుతమైన పాటలెన్నింటినో తమిళ సినీ ప్రపంచానికి అందించారాయన.
కాలక్రమంలో వీరి స్నేహం ఏదో నోటి మాటగా కాక గాఢమైన బంధంగా మారింది.
ఊట్టివరై ఉరవు అనే సినిమాలో తేడినేన్ వన్దదు అనే పాటకు మరొక బాణీలో సంగీతం సమకూర్చారు. ఆ బాణీ అందరికీ నచ్చినా దర్శకుడు శ్రీధర్ కి నచ్చలేదు. ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చి గోళ్ళు కొరుక్కుంటూ నిల్చున్నారు. ఎంఎస్వీ ఆయన వద్దకు వెళ్ళి "రండి శ్రీ..." థియేటర్లోకి అని చెప్పగా "ఇదిగో చూడండి విశు....మీ అందరికీ నచ్చినప్పటికీ నాకది నచ్చలేదు" అని అసహనాన్ని ప్రదర్శించారు శ్రీధర్.
శ్రీ, కవి (కణ్ణదిసన్)ని ఇప్పుడెక్కడ వెతకనూ...సరేకానీ లోపలికి రండి...మాటలు మార్చకుండా మరొక ట్యూన. వినిపిస్తాను" అంటూ పియానో ముందు కూర్చుని మార్చిన ట్యూన్ వినిపించారు ఎంఎస్వీ.
 
శ్రీధర్ కి ఆ ట్యూన్ సూపర్ అనిపించి ఎంఎస్వీని ప్రశంసించారు. ఆ మార్చిన ట్యూనే ఊట్టివరై ఉరవు సినిమాలోని "తేడినేన్ వన్దదు..." అనే పాట.
ఓమారు ఎంఎస్వీ, కణ్ణదాసన్ పాట కంపోజింగులో ఉన్నారు. ఎప్పట్లాగే కణ్ణదాసన్ కి సూప్ తీసుకొచ్చారు. హార్మోనియం వాయిస్తున్న ఎంఎస్వీ "కవీ, నాకూ కాస్త సూప్ ఇవ్వండి" అని అడిగారు.
కవి కణ్ణదాసన్ తాను తాగకుండానే ఆ సూప్ ని ఎంఎస్వీకి ఇచ్చేసారు. ఎంఎస్వీ ఏదో ఆలోచనలో ఉండి కాస్త తాగారు. 
 
రుచి ఓలాగా ఉండటంతో "ఇది ఏం సూపు?" అని ఎంఎస్వీ అడగ్గా "ఇది నాన్ వెజ్ సూప్" అని కణ్ణదాసన్ జవాబిచ్చారు.
 "ఒరేయ్ పాపాత్ముడా! వచ్చే వారం నేను కొండకు వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడిలా నాన్ వెజ్ సూప్ తాగించి భంగం కలిగించావు" అంటూ పక్కన ఉమ్మేసొచ్చి ఎంఎస్వీ మళ్ళీ హార్మోనియం పెట్టె ముందర కూర్చున్నారు.
  
ఎంఎస్వీ లలితమైన సంగీతంలో జీవం పోసుకున్న పాటలు అరవై ఏళ్ళుగా పంచభూతాలలోనూ, మన పంచేంద్రియాలలోనూ కలిసిపోయి తమిళుల హృదయాల్లో  ప్రతిధ్వనించడం అపూర్వం. అమోఘం.
మన దేశంలోనే మొదటీసారిగా పూర్తి ఆర్కెష్ట్రానూ వేదిక ఎక్కించి సంగీత విభావరి నిర్వహించి ఎంఎస్వీ "ఔరా!" అనిపించుకున్నారు. తమిళనాడులోని సేలంలో ఈ కార్యక్రమం జరిగింది.
పియానో, హార్మోనియం, కీబోర్డు - ఈ మూడింటినీ గొప్పగా వాయించే ఎంఎస్వీ తీరికవేళల్లో ఇంట్లో పియానో నాదం వింటుండేవారు.
సినీ సంగీతం నుంచి దూరంగా ఉండిన ఎంఎల్ వసంతకుమారి, బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం‌, బాంబే జయశ్రీ వంటివారు ఎంఎస్వీమీది ఆభిమానంతో అప్పుడప్పుడూ సినిమా పాటలు పాడిన సందర్భాలున్నాయి.
వి.కుమార్, ఇళయరాజా, రహ్మాన్, గంగై అమరన్, దేవా, యువన్ శంకర్ రాజా, జి.వి. ప్రకాశ్ వంటి సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడిన ఎంఎస్వీ స్వరపరిచిన అత్తాన్....ఎన్నత్తాన్....అనే పాట విని ఇటువంటి పాటలు పాడే అవకాశం ఇస్తే చెన్నైకొచ్చి ఉండేదాన్ని అని ఓమారు లతా మంగేష్కర్ ఓ వేదికపైన చెప్పారు. అప్పుడు సభాప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.

కామెంట్‌లు