గొంగట్ల దినుకుంట….;- రామ్మోహన్ రావు తుమ్మూరి

 శానొద్దులైంది
రాసుడులేక
తీర్పాటం దొర్కుతలేదు
పొద్దెట్ల గడుస్తాందో
ఎర్కైతలేదు
చేసేటియేమన్న రాసకార్యాలాంటె
అస్సలేగాదు
పొద్దట్సుంది నడిరాత్రిదాన్క
అయ్తె ఫేస్బుక్జూసుడు
లేకుంటె వాట్సప్జూసుడు
దీనికగ్గిదల్గ
దిక్కువానె సెల్ఫోను బుట్టినకాడ్నించి
వఖ్తంత బర్బాద్
వో తిండి యాల్లకు దినుడులేదు
వో నిర్ద యాల్లకువోవుడ్లేదు
అరె ఎవ్వన్ని జూడు
చెవ్వు కాడ సెల్ఫోనే
లేదంటె టిక్కుటిక్కు మని 
ఏల్లతోటి ఒత్తుకుంటు మెసేజులువెట్టుడు
రికామి లేనే లేకపాయె
పెద్దోల్లకె అంటురోగంబట్టినట్టుంటె
యిక పోరగాన్లనేమదిలిస్తరు
ఇంట్ల ఇద్దరుంటె ఇద్దరు 
పదిమందుంటె పదిమంది
ఎవని జాగల ఆడు లేకుంటె అది
ఫోన్లతోనే జచ్చుడు
ఈ…..పురాంగ అద్వాన్నమైతాన్నయి
బత్కులు
ఇదివరకు జర బ్యాంకుకువోవుడో
కరంటు బిల్లుగట్టనీకి వోవుడో
లేదంటె బజాట్ల సామాన్దెచ్చుకునుడో
వుంటుండె
యిప్పుడన్ని గండ్లనేనాయె
ఇది సుకమో దెల్వదు
ఎందుకు బన్కిరాకపోవుడో దెల్వదు
అమ్మ తానికవోవుడ్లేదు
అయ్యతానికివోవుడ్లేదు
ఈడియోల మాట్లాడిత్తయిపాయె
ఏందో పోన్రి యింకెన్ని జూడాల్నో
కాల్రెక్కలాడకుండ 
కట్టమెర్కల్కుండవోతె
ఇగ ఓసత్ యాడ్నించస్తది
బతుకులెట్ల తెల్లార్తయి
పన్లేకపోయినాకొద్ది
పన్కిరాని ముచ్చట్లెక్కువాయె
ఇగ తెలువులుగాదు నాయిన్నా
గయన్ని ఫేస్బుక్ల నిండ ఆట్సప్ల నిండ
పొంగి పొర్లుతాన్నయి
నేను సుత లేకంతోటి లొటలొటన్నట్లు
నా తెలివి నేను చూయించుకోక తప్పుతలేదు
గిదీన్నె అంటరు 
గొంగట్ల దినుకుంట …
గదేందో యాదికత్తలేదు పోండ్రి
కామెంట్‌లు