విచిత్రమైన రాజు (కథ): రచయిత సరికొండ శ్రీనివాసరాజు


 శ్రీపురం రాజ్యానికి విజయేంద్రుడు అనే అతడు కొత్తగా రాజు అయ్యాడు. రాజు కావడంతోనే చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. రాజ్యంలో బిచ్చగాళ్ళకు అందరికీ సన్మానం చేస్తానని ప్రకటించాడు. బిచ్చగాళ్ళు అందరూ వచ్చారు. వారిని తగిన విధంగా సన్మానించి కానుకలు ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత రాజ్యంలో అత్యంత సోమరిపోతులను సన్మానించాలని ఉందని, వారిని అందరినీ రమ్మని పిలిచాడు. వాళ్ళను బాగా సన్మానించి, వారి చిరునామా సేకరించి, వారికి భారీగా కానుకలు ఇచ్చాడు. ఆ తరువాత రాజ్యంలో లంచగొండులు, అవినీతి పరులు, దోపిడీదారులు, దుర్మార్గులు, స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారు అందరినీ రమ్మన్నాడు. తాము చేసిన దుర్మార్గాలను ఋజువులతో చూపిస్తే వారి నిజాయితీకి మెచ్చి, వారు కలలో కూడా ఊహించని అంతులేని బహుమానాలను ఇస్తానని ప్రకటించారు. రాజుగారి వాలకాన్ని కనిపెట్టిన ఎంతోమంది దుర్మార్గులు బారులు తీరి, తాము చేసిన దుర్మార్గాలను ఋజువులతో సహా చూపించారు. రాజుగారు వారిని బంధించడానికి ముందే చుట్టూ మారువేషాలలో ఉన్న సైన్యాలను ఉంచాడు. వారిని అందరినీ బంధించి, వారు చేసిన నేర తీవ్రతను బట్టి శిక్షను విధించాడు. వారికి శిక్షా కాలమంతా నైతిక విలువలను పెంపొందించే ఏర్పాటు చేశాడు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారికి అత్యంత కఠినమైన యావజ్జీవ కారాగార శిక్షను విధించాడువిధించాడు. రాజ్యంలో బిచ్చం అడుక్కోవడం, సోమరితనంతో బ్రతకడాన్ని నేరంగా ప్రకటించాడు. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని, అలా చేయడానికి ఆరోగ్యం సహకరించని అనాథలను మాత్రం తాము పోషిస్తారని ప్రకటించాడు. దుర్మార్గులను ఏరి వేయడానికి రాజుగారు పన్నిన వ్యూహాన్ని ప్రజలంతా ప్రశంసించారు. ప్రజలకు సంతోషం వేసింది. 


కామెంట్‌లు