సాహిత్యరచన ఏం చేస్తుంది?:- యామిజాల జగదీశ్
 అది మద్రాసులో పుస్తక ప్రదర్శన జరుగుతున్న వేళ. 
ఓరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కొందరు యువకులు ఒక్కొక్క  దుకాణంలోకి వెళ్ళారు. ఏ పుస్తకం కొంటే బాగుంటుందని పరస్పరం  మాట్లాడుకుంటున్నారు. ఈ సన్నివేశం చూడటానికి ఎంతో ఆనందంగా అనిపించింది. కోలాహలంగా జరుగుతున్న పుస్తక ప్రదర్శన. ఆ యువకులు అడుగుపెట్టిన షాపు వంశీ పుస్తకప్రచురణాలయం వారిది. 
ఇది తమిళ రచయిత్రి కె.వి. శైలజ గారి పుస్తక దుకాణం.   
శైలజ గారు నాకెంతో ఇష్టమైన రచయిత్రులలో ఒకరు. ఆమె  అనువాద రచనలో  దిట్ట.  అందులోనూ మళయాలం నుంచి చేసిన అనువాదాలే అనేకం.... చిదంబర నినైవుగళ్ (చిదంబర జ్ఞాపకాలు), మూండ్రాం పిఱై, శూర్పణఖ వంటివి ఆమె అనువాద పుస్తకాలు. వీటిలో "చిందబర జ్ఞాపకాలు" పుస్తకం 2003లో వచ్చింది. ఇప్పటికి పద్దెనిమిదేళ్ళయినా ఆ పుస్తకానికి మంచి డిమాండ్ ఉంది. ఈ పుస్తకానికి పాఠకుల నుంచి విశేష ఆదరణ లభించడమే అందుకు కారణం.
మళయాలం నుంచీ ఎందుకు పుస్తకాలు అనువదిస్తున్నారనే ప్రశ్నకు ఆమె జవాబిస్తూ “నా మాతృభాష మళయాలం. అయితే తల్లిదండ్రులు ఎప్పుడో తమిళనాడుకు వలస వచ్చి స్థిరపడ్డారు. దాంతో నాకు మళయాలం బొత్తిగా రాకుండా పోయింది. కానీ ఇంట్లో అందరూ మళయాలం మాట్లాడటం వల్ల నాకూ మాట్లాడటం వరకూ వచ్చింది. కానీ నేను మళయాలీనని ఎవరికీ తెలీదు" అంటారు.  
ఆమె తమిళంలో అనువాదించే శైలి చదువుతుంటే అది అనువాదంలా అనిపించదు. తమిళంమీద మంచి పట్టున్న రచయిత్రి. 
ఆమె పుస్తకాలలో మొదటి అనువాద పుస్తకం - చిదంబర జ్ఞాపకాలు. ఈ పుస్తకం మాతృక మళయాలం. తమిళంలో  రాయడం కోసం మళయాలం భాషను పట్టుబట్టి నేర్చుకున్నారు.  
ఈ పుస్తకం మూల రచయిత బాలచంద్రన్ అంటే కేరళలో తెలియని వారుండరు. ఆయన పూర్తి పేరు చుల్లిక్కాడు బాలచంద్రన్.
నిజానికి మళయాలంలో ఈ పుస్తకం ఆమె చేతికొచ్చి చాలా కాలమే అయినప్పటికీ ఆ భాష చదవడం తెలీక పక్కన పెట్టేశారు. అయితే ఓరోజు ఎలాగైనా సరే ఆ పుస్తకం చదవాలన్న పట్టుదల కలిగింది. తన అక్కయ్య కూతురు సాయంతో మళయాలం నేర్చుకుని ఆ పుస్తకాన్ని చదివారు. అందులోని ప్రతి పేజీ ఆమెను ప్రభావితం చేసింది. ఆ పుస్తకంలో కొంత భాగాన్నయినా అనువదించా లనుకున్నారు. అలా అనుకున్న ఆమె మొత్తం పుస్తకం అనువదించి తామే ప్రచురించారు. ఆ పుస్తకం జనంలోకి వెళ్లిన తర్వాత ఆమెను అందరూ " చిదంబర జ్ఞాపకాల"  శైలజ అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ పుస్తకంలో మొత్తం 21 వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకం గురించి చెప్పుకోవడానికి ఒక్క రోజు సరిపోదంటారు శైలజగారు. 
ప్రతి వ్యాసంలోనూ ఓ పాత్ర పాఠకుడి మనసులో బలంగా నాటుకుపోతుందని ఆమె మాట. వాటిలో ముఖ్యమైన ఓ కథాపాత్రకు చెన్నై నుంచి ఓ మిత్రుడు తిరువణ్ణామలైలో ఉంటున్న శైలజకు డబ్బు పంపించి అందజేయమన్నారు. ఆ డబ్బులు పంపిన మిత్రుడు ఇప్పటికీ ఆ కవి కష్టాల్లో ఉన్నారంటే ఆయనకు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఉత్తరం రాశారు. 
ఆ మాటతో శైలజగారు వెంటనే బాలచంద్రన్ గారికి ఓ ఉత్తరం రాసారు. బాలచంద్రన్ గారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా "మాతృభూమి" అనే పత్రిక కార్యాలయానికి వెళ్ళి శైలజగారి మిత్రుడి విషయం చెప్పారు. అంతేకాదు, "మళయాల కవిని వెతుకుతున్న తమిళనాడు" అంటూ ఓ వ్యాసం రాయగా మాతృభూమి దానిని ప్రముఖంగా ప్రచురించింది. 
ఆ వ్యాసాన్ని చూసిన మళయాల కవి మాతృభూమి కార్యాలయానికి వెళ్ళి తనింకా కష్టాల్లోనే ఉన్నానన్నారు. 
 విషయాన్ని బాలచంద్రన్ గారు శైలజగారికి తెలుపగా ఆమె చెన్నైలో ఉంటున్న మిత్రుడికి ఆ కవి గురించి చెప్పారు. ఆ మిత్రుడు ఓ ఆయుర్వేద వైద్యుడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం సొంతిల్లు లేని మళయాల కవికి ఓ ఇల్లు కూడా కట్టించిచ్చారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఇల్లు కట్టించిచ్చిన డాక్టర్ మిత్రుడు తన పేరు ఎక్కడా ఎవరికీ చెప్పకూడదన్నారు. 
దీన్ని బట్టి సాహిత్యరచన ఏం చేస్తుందనే వారికి ఇదొక జవాబు అని శైలజగారు చెప్పారు. చిదంబర జ్ఞాపకాలు వల్ల  కవికి జరిగిన మేలు తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందంటారామె.
తమిళ సాహిత్యంలో మగవారి కన్నా మహిళా రచయిత్రులకు ఆదరణ పెరుగుతోందని శైలజగారి అభిప్రాయం. కానీ ఓ స్త్రీ రాస్తుండటం వల్లే మెచ్చుకోవాలన్న తీరు తనకిష్టం లేదంటారు. మహిళలు రాసే పుస్తకాలు, అందులోని అంశాలకు ఆదరణ లభిస్తే మరింత ఆనందిస్తానంటారు. 
రచన అనేది తానుగా రావాలని అంతేతప్ప పని కట్టుకుని బలవంతంగా రాయడం అనేది జరగకూడదని, అలా ఒకవేళ బలవంతంగా రాసినా అందులో జీవం ఉండదంటారు శైలజగారు. అప్పుడే ఆ రచన రాసినవారికి మంచి పేరు తెచ్చిపెడుతుందన్న ఆమె అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను.
శైలజగారు "ముత్తియమ్మా" అనే శీర్షికన ఓ వ్యాస సంపుటి వెలువరించారు. ఇదే ఆమె తొలి వ్యాస సంపుటి.
శైలజగారికి సొంతంగా ఓ ప్రచురణ సంస్థ ఉండటం తెలిసి కొందరు యువ రచయిత్రులు తాము రాసిన కవితలను తీసుకొచ్చి వాటిని పుస్తకంగా ప్రచురించమని అడుగుతుంటారు. అలాగని అందరి పుస్తకాలు ముద్రించడం సరి కాదంటారు. తమిళంలో పుదుమైపిత్తన్, సుందర రామస్వామి, అళగిరి సామి వంటి రచయితుల పుస్తకాల పక్కన మన పుస్తకం ఉండాలనే స్థాయిలో రచనలు చేసినప్పుడే అవి కలకాలం పాఠకుల మధ్యలో నిలుస్తుందంటారు శైలజగారు. ఏదో ఒక పుస్తకం రాసేసి తాము రచయిత్రి అయిపోయామనుకుని మిణుగురు పురుగుల్లా ఉండకూడదని, దీర్ఘకాలం పాఠకులు చెప్పుకునే రీతిలో రచనలు చేయాలంటారు. 
ఇది నిజమేగా. ఏదో రాసామని ఒకటి రెండు పుస్తకాలకే పరిమితమైపోకూడదు. తక్కువ రాసినా పాఠకుల హృదయాలను ఆకట్టుకునేలా రచనలు చేయడం ఏ రచయితకైనా ప్రధానం.
-కామెంట్‌లు