"దక్షిణ భారత చార్లీ చాప్లిన్"చంద్రబాబు:-- యామిజాల జగదీశ్
 ఓ నటుడి అవయవ కదలికలు, చూపులు, మాటతీరు, హావభావాలు ఏ ప్రేక్షకుడినైనా నవ్విస్తాయి. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. కళ్ళల్లో నీరొచ్చేలా నవ్విస్తాయి.
అదేసమయంలో ఆ మనిషి జీవితమూ, జీవితంలో చవిచూసిన శోకాలు గుర్తుకొస్తే కన్నీళ్ళు రాకమానవు. ఇంతకూ ఈ మాటలకు అచ్చంగా సరిపోయేవారు మరెవరో కాదు "దక్షిణభారత చార్లీ చాప్లిన్" గా పేరు ప్రఖ్యాతులు గడించిన తమిళ హాస్యనటుడు చంద్రబాబు.
గంతేస్తారు....చురుగ్గా కనిపిస్తారు. లేనిపోని చేష్టలన్నీ చేస్తారు. ఆయన చేసే మాటలన్నీ అటు పెడితే స్క్రీన్ మీద ఆయన కనిపించడంతోనే నవ్వులు రాకమానవు.  ఆ నటుడే చంద్రబాబు.
తమిళనాడులోని తూత్తుకుడిలో జన్మించిన వెండితెర ముత్యం చంద్రబాబు.
ఆయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధులు.
ఆయనేమో చిత్రపరిశ్రమలోకి రావడానికి ఎన్ని పోరాటాలు చేసారో చెప్పలేం.
చంద్రబాబు అనగానే ఏం చెప్పాలి? నటుడు అంటాం. కామెడీ నటుడు అంటాం. క్యారక్టర్ నటుడు అంటాం. అన్నింటినీ మించి పాటలు పాడేవాడు అనొచ్చు. 
చంద్రబాబు బాగా పాడుతారు ....అనే మాటే ఆయనకు లభించిన తొలి ప్రశంస. 
గాయకుడిగానే ఆయన ఊళ్ళో వాళ్ళందరికీ పరిచయం.
1927లో పుట్టిన చుద్రబాబుకు 47లో సినిమాలో నటించే అవకాశం దక్కింది.
అమరావతి అనే సినిమాలో నటించారు.
అయితే వెంట వెంటనే ఆయనకేమీ అవకాశాలు రాలేదు.
ఆ కాలంలో నటించే వారే పాటలూ పాడేవారు. చంద్రబాబూ కూడా అలాటివారే. నటించగలరు. పాడగలరు అనే పేరు గడించారు. అయితే ఆయన స్వరం మిగిలిన గాయకులకు కాస్త భిన్నంగా ఉండేది.
మాటలు చెప్పడంలోనూ అంతే. ప్రత్యేకించి చెప్పుకోవాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ఫాస్టు ఫాస్టుగా ఎలా మాట్లాడుతారో చంద్రబాబు మాటతీరు అలాగే ఫాస్టుగా ఉండేది. 
లూస్ మోహన్, తేంగాయ్ శ్రీనివాసన్, కమల్ హాసన్ వంటివారు మద్రాసు భాష మాట్లాడుతారని ప్రతీతి. వీరందరినీ తలదన్నినవారు చంద్రబాబు. అదేంటి మద్రాసు భాష అంటే మదురై, తంజావూరు వంటి ప్రాంతాలవారు మాట్లాడే తమిళ భాషకూ మద్రాసులో వారు మాట్లాడే తమిళ భాషకూ ఎంతో తేడా ఉంటుంది. మద్రాసు తమిళాన్ని అసలది తమిళమేనా అని వెటకారం చేసేవారున్నారు.
రత్తకన్నీర్ (తెలుగులో రక్తకన్నీరు) సినిమా అనగానే ఎం.ఆర్. రాధా, ఎం.ఎన్. రాజం, ఎస్.ఎస్.ఆర్ తదితరులతో పోటీపడి నటించారు చంద్రబాబు. 
వైణిక విద్వాంసుడు ఎస్. బాలచంద్రుడికోసం ఓ సినిమాలో కళ్యాణం...ఆహా కళ్యాణం అనే పాట పాడింది చంద్రబాబే.
ఇటు ఎంజీఆర్ తోనూ నటించారు. అటు శివాజీ గణేశన్ తోనూ నటించారు చంద్రబాబు.
రాజా అనే సినిమాలో శివాజీ ఒకే ఒక్క పాత్రలో నటిస్తే చంద్రబాబు మూడు పాత్రలు పోషించి ఔరా అన్పించుకున్నారు.
జీవితంలో ఎదురీదుతూ పురోగతి సాధించిన చంద్రబాబు తీరా తాగుడు లోకం నుంచి ఇవతలకు రాలేకపోయారు.
ఆయన తీరిక లేనంతగా నటించారు. లెక్కాపత్రం లేనంతగా సంపాదించారు. అయితే అంత డబ్బు పోగొట్టుకుని అప్పులపాలయ్యారు.
సినిమాలో ఆయన నటించి సంపాదించిన డబ్బులతో కట్టుకున్న బంగళా గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. కారు తిన్నగా ఇంట్లోకే పోనిచ్చి ఆపేలా ఇంటిని విశాలంగా కట్టుకున్నారని అంటారు. కానీ జీవితానికి అవసరమైన బ్రేకులను సరిగ్గా ఉపయోగించలేక దెబ్బతిన్నారన్నది బాధాకరం.
వెండితెరపై నటించారు. తీరా ఆయన వైవాహిక జీవితమూ ఓ సినిమాగా తీసేలా మలుపులతో సాగింది.
"నానొరు ముట్టాళుంగ...." అనే పాట, "ఒణ్ణుమే పురియల ఉలగత్తిలే" అనే పాట, "బుద్ధియుల్ల మనిదరెల్లాం వెట్రి కాన్బదిల్లయ్ ...వెట్రి పెట్ర మనిదరెల్లాం బుద్ధిసాలి ఇల్లయ్" ...అనే పాట ఆయా సినిమాలో చంద్రబాబు  క్యారక్టర్లకోసం ప్రత్యేకించి రాయించబడిన పాటలు. ఈ పాటలను ఆయనే పాడారు. ఈ పాటలన్నీ పాపులరయ్యాయి. 
తమిళ సినిమాలో మొదటిసారిగా కోటు సూటు ధరించి తన సహజ ధోరణిలో నటించిన నటుడు చంద్రబాబు.
ఆయన వేసుకునే బట్టల తీరే వేరు. ఆయన డ్రెస్ తీరు ఆధునికంగా ఉండేది. ఆ స్టయిల్ ఇతరులు ఫాలో అయ్యారంటే అది అతిశయం కాదు.
ఆయనకు తెలుపు రంగు బట్టలంటే ఎంతో ఇష్టం. తెలుపు రంగు చొక్కా, నలుపు రంగా ప్యాంటు, ఫుల్ హ్యాండ్ చొక్కా చేతులను మడతపెట్టి వేసుకునే వారు. ప్యాంట్ ప్యాకెట్టులోంచి బయటకు కనిపించేలా ఖర్చీఫ్ ఉంచుకునేవారు.
రేడియో గ్రామ్ లో విదేశాల నుంచి తెప్పించుకున్న అమెరికా, స్పానిష్, మెక్సికన్ గ్రామఫోన్ రికార్డులను ప్లే చేసి పక్కన ఎవరున్నాసరే వారిని తనతో కలిసి నాట్యమాడేందుకు పిలిచేవారు. నాట్యమాడేందుకు ఇష్టపడ్డవారిని పాశ్చాత్య బాణీలో వాటేసుకుని రిథమ్ కి తగినట్టు ఆడేవారు.  తనతో ఆడేందుకు ఒప్పుకోనివారిని ముద్దుగా తిట్టేవారు.
షూటింగ్ అప్పుడు ముక్కలు చేసిన క్యారట్ వంటివి తినేవారు.
ఎవరికి ఫోన్ చేసినా, బయటి నుంచి ఫోన్ కాల్ వచ్చినా హలో అనకుండా చంద్రబాబు అని తన పేరుని చెప్పుకుని సంభాషణ కొనసాగించేవారు.
ఇంట్లో ఆయనే గోధుమపిండి కలిపి చపాతీ కాల్చి సైడ్ డిష్ కూడా తానే చేసుకునేవారు. అనంతరం స్నానం చేసి డైనింగ్ టేబుల్ లో కూర్చుని ఒక గ్లాసులో విష్కీ పోసుకుని చపాతీని కత్తితో అందంగా కోసి స్టయిల్ గా తినేవారు.
కారు నడపడంలోనూ ఆయనదో ప్రత్యేక స్టయిల్. ఆయనకో ఫియట్ కారు ఉండేది. ఆయన కారు నడుపుతున్నప్పుడు చూసినవారు భయపడేవారు లేదా నవ్వేవారు. కారణం, తన మోకాళ్ళతో స్టీరింగుని పట్టుకుని కారుని నడిపేవారు. ఎలా అలా నడిపేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఇలా నడపడం వల్ల ఆయన ప్రమాదాలకు గురైన సందర్భాలు లేకపోలేదు.
ఓ హాస్యనటుడు పాడిన శోకగీతాలకు విశేష ఆదరణ లభించాయంటే అ ఘనత చంద్రబాబు పాడిన పాటలకే దక్కింది.
చెన్నై సినిమా అభిమానుల సంఘం  ఏటా సినీ కళాకారులకు అవార్డులిచ్చేది.  అయితే 1957లో ఉత్తమ హాస్యనటుడు, నటి అంటూ అవార్డులు ప్రవేశపెట్టినప్పుడు  మొదటి ఏడాదే ఆ అవార్డు చంద్రబాబుకి దక్కింది.
ఆయన 1974లో చెన్నైలో మరణించారు. 

కామెంట్‌లు