మతి లేని రాజు (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
 ధర్మవరం సామ్రాజ్యానికి సురేంద్ర అనే అతను కొత్తగా రాజు అయ్యాడు. రాజ్యాధికారం చేపట్టగానే ఎవ్వరి సలహా తీసుకోకుండా వింత నిర్ణయాలు తీసుకునేవాడు. రాజ్యంలో జనాభా బాగా పెంచితే శత్రు రాజుల దాడిని ఎదుర్కొనవచ్చని ఎక్కువ మంది సంతానం ఉన్న వారికి ప్రోత్సాహకాలు ప్రకటించాడు‌. జనాభా పెరిగితే ఇళ్ళు పెరుగుతాయి, గ్రామాలు, నగరాలు మరింతగా విస్తరించాల్సి వస్తుందని ముందు చూపుతో చెట్లను, అడవులను విచక్షణా రహితంగా నరికించి వేస్తున్నాడు. మంత్రి సుధర్ముడు రాజుగారితో చెట్లను నరికి వేయడం వల్ల రాబోయే నష్టాలను వివరించాడు. రాజుగారు ఆ మాటలను పెడచెవిన పెట్టారు. పైగా ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇస్తే నాలుక కోయిస్తానని హెచ్చరించాడు‌. ఇలాంటి మూర్ఖులకు హితబోధ అనవసరం అని మంత్రి ఊరుకున్నాడు.
       మహారాజుకు మరో ఆలోచన వచ్చింది. మారువేషాలలో గూఢచారులుగా మంత్రితో సహా తాను తరచూ ఆయా రాజ్యాలలో తిరగడం. అక్కడి రాజుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయా రాజ్యాల బలహీనతలు కనిపెట్టి, బలహీనమైన రాజ్యాలపై దాడి చేసి, తన రాజ్యంలో కలపడం. మంత్రిగారికి ఇష్టం లేకపోయినా రాజు ఎలాంటి విచిత్రమైన శిక్షలు విధిస్తాడో అని భయపడి, రాజుతో కలిసి పొరుగు రాజ్యాలలో గూఢచర్యం చేస్తున్నాడు. 
      ఒకరోజు సింహపురి రాజ్యంలో ఒక గ్రామంలో వీరిద్దరూ మారువేషాలలో తిరుగుతున్నారు. దూరంగా ముగ్గురు మనుషులు గ్రామస్థులు మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నారు. "చూడు తాతా! నీ పేరు ఏమిటి? మన రాజుగారి పరిపాలనలో మీకు ఏమైనా అసౌకర్యాలు కలుగుతున్నాయా?" అని అడిగారు. "మన రాజుగారి పరిపాలన రామ రాజ్యాన్ని తలపింపజేస్తుంది. ఈ రాజు గారు వెయ్యేళ్ళు వర్థిల్లాలి." అన్నాడు పెద్ద మనిషి. అక్కడ ఉన్న నలుగురైదుగురు రాజుగారి పరిపాలనను వేనోళ్ళ పొగిడారు. దూరంగా మారువేషాల్లో ఉన్న సురేంద్రుని, సుధర్ముని చూశారు ముగ్గురు మనుషులు. రాజుగారి పరిపాలన గురించి అడిగారు. అప్పుడు సురేంద్ర మహారాజు అక్కడ ఉన్న అందరినీ పిలిపించి, "చూడండి! మన మహారాజు ఏమైనా శ్రీరాముడా? ధర్మరాజా! మన రాజుగారి పరిపాలన పైన పటాలం, లోన లొటాలం. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాజ్యంలో దోపిడీలు, దొంగతనాలు ఎక్కువైనాయి. స్త్రీలకు రక్షణ లేదు. మేము ఇద్దరం స్వయంగా రాజ్యమంతా కలియ తిరుగుతూ గమనించాం. కావాలంటే నా పక్కన ఉన్న మిత్రుని అడగండి." అన్నాడు. మంత్రికి పై ప్రాణాలు పైనే పోయాయి. మనసులో "చచ్చింది గొర్రె. వీడి బొంద! ప్రజలలో అసంతృప్తి కలిగించి, రాజుపై తిరగబడేలా చేయాలి. అప్పుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి. తానేమైనా చాణక్యుని తాతను అనుకుంటున్నాడా? ఈరోజుతో నా ఆయువు మూడినట్లే." అనుకున్నాడు.
       ఆ ముగ్గురిలో ఒకరు *సైన్యపాలా! ఈ ఇద్దరూ మన రాజ్యంలోని వారు కాదని అర్థం అయింది. తక్షణం వీరిద్దరినీ బంధించి, భూలోకంలోనే యమలోకం చూపిద్దాం. సలసలలాడే నూనెలో వేయించి చంపేద్దాం." అన్నాడు. ", అలాగే మహామంత్రి!" అన్నాడు. సురేంద్ర, సుధర్ములు ఇద్దరూ కాలికి బుద్ధి చెప్పారు. సుధర్ముడు మెరుపు వేగంతో పరుగెత్తాడు. సురేంద్ర మహారాజు పరుగెత్తీ పరుగెత్తీ ఒక మహా వృక్షం చాటున దాక్కున్నాడు. ఆ ముగ్గురూ వెనుదిరిగారు. "చూశారా మహారాజా! మీరు నరికేయించిన చెట్లే మనల్ని రక్షించాయి. ఇప్పటికైనా రాజ్యానికి వెళ్ళాక చెట్ల పెంపకం మీద శ్రద్ధ చూపండి." అన్నాడు అక్కడికి వచ్చిన మంత్రి. రాజు మంత్రిని గుర్రుగా చూశాడు. బాబోయ్! ఈ మూర్ఖునితో నాకు భవిష్యత్తులో ఎన్ని కష్టాలో అనుకున్నాడు. ఇద్దరూ రాజ్యానికి వెను తిరిగారు. 
       "మహారాజా! నాకు వృద్ధాప్యం సమీపించింది. అనారోగ్యం ఎక్కువ అవుతుంది. వైద్యులు జీవితాంతం విశ్రాంతి అవసరం అన్నారు. నేను ఈ మంత్రి పదవి నుంచి వైదొలగుతాను." అన్నాడు సుధర్ముడు. "సైన్యాధిపతి! ఈ మంత్రికి భూలోకంలోనే యమలోకం చూపిద్దాం. సల సలలాడే వేడి నూనెలో వేయించి చంపేద్దాం." అన్నాడు మహారాజు. "మహారాజా! శిక్షలలో పక్క వారిని అనుకరిస్తే మన ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి. నాకు విశ్రాంతి కన్నా జీవితాంతం మీ సుపరిపాలనలో మంత్రిగా చేయడమే ఇష్టం. ఆ మహాద్భాగ్యాన్ని ప్రసాదించండి." అన్నాడు మంత్రి. 
       "మహామంత్రి! మనం మన రాష్ట్రంలోనే గూఢచర్యం చేద్దాం. మన పరిపాలన గురించి ప్రజల అభిప్రాయం కొనుక్కుందాం. నా పరిపాలన గురించి గొప్పగా ప్రజలలో ప్రచారం చేద్దాం. ఎలా ఉంది నా ఆలోచన" అన్నాడు సురేంద్ర. "ఇంకెలా ఉంటుంది? మీ సుందర వదనంలా ఉంది." అన్నాడు సుధర్ముడు. "ఎందుకైనా మంచిది. సైన్యాన్ని కూడా తీసుకెళ్దాం. వారు ఎవరికి తెలియకుండా మనకు దూరంగా నిలబడుతారు." అన్నాడు మంత్రి. "మరీ ఇంత పిరికివాడిని నా మంత్రి అని చెప్పుకోవడం సిగ్గుచేటు." అన్నాడు రాజు. "అయితే నన్ను మంత్రి పదవి నుంచి తొలగించండి." అన్నాడు సుధర్ముడు. "సైన్యాధిపతి!......." "వద్దులే మహారాజా! మన రాజ్యం మీ పరిపాలనలో స్వర్గం కావాలి. యమలోకం కావద్దు." 
       ఒకరోజు మహారాజు మంత్రితో కలిసి మారువేషంలో ఒక గ్రామంలో రైతుల వద్దకు వెళ్ళి, "మన మహారాజు గారి పరిపాలన ఎలా ఉంది?" అని అడిగాడు. ఆ రైతులు సమస్యలు అన్నింటినీ ఏకరువు పెట్టి రాజుగారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. "నేనెవరిని అనుకున్నావు. సాక్షాత్తూ ఈ సామ్రాజ్యానికి మహారాజును. నన్నే నా ముందు తిడతారా? చూడండి! మిమ్మల్ని ఏం చేస్తానో!" ఆవేశంతో ఊగిపోతున్నాడు మహారాజు. "క్షమించండి మహారాజా! మీ గొప్పదనం మాకు తెలుసు. అయినా ఇంత మంచి పరిపాలకులు. మీ పరిపాలన గురించి విచారణ అవసరం లేదు. అలా అనవసరంగా విచారణ చేస్తున్నారనే కోపంతో తిక్కగా సమాధానం ఇచ్చాము. మీ సైన్యం ఏది మహారాజా!" అన్నాడు ఒక రైతు. "పిచ్చివాడా! నేను అజాతశత్రువునని లోకమంతా తెలుసు. నా తోక సైన్యం కూడా అవసరమా?" అన్నాడు. అందులో రామయ్య అనే రైతు "భీమయ్యా, సోమయ్యా, చలమయ్య రాజు ఒంటరిగా ఉన్నాడు. ఈ రాజు వల్ల మనకు కష్టాలే కానీ సుఖాలు ఉండవు. ఈ రాజు పాలన అంతం కావాలనే ప్రజలందరి కోరికను మనం తీరుద్దాం. వెంటనే వీళ్ళిద్దరినీ బంధించండి." అన్నారు. "రామయ్య! నేను మహామంత్రిని. నన్ను విడిచిపెట్టు." అన్నాడు. మంత్రి గారి మంచితనం ఏనాటి నుంచో చూస్తున్న ఆ జనం మంత్రిని వదిలి పెట్టి రాజు వెంట పడ్డారు. రాజు కాలికి బుద్ధి చెప్పాడు. ఎంత దూరం పరుగెత్తినా వాళ్ళ కళ్ళు గప్పి దాచుకోవడానికి ఒక్క చెట్టు కూడా దొరకడం లేదు. అడవులను విచక్షణా రహితంగా నరికివేయడం వల్ల ఆశ్రయం కోల్పోయి, దారి తప్పి తిరుగుతూ బాగా ఆకలితో ఉన్న చిరుతపులికి ఎదురై దానికి దొరికిపోయాడు సురేంద్ర మహారాజు. ధర్మవరం ప్రజల కష్టాలు తొలగిపోయాయి. ‌‌ 

కామెంట్‌లు