రాజరత్తినం పిళ్ళై "స్వరనాదం";-- యామిజాల జగదీశ్
 వాయిద్యాలలో నాదస్వరం ఒకటి. దీనినే తమిళంలో నాదసురం, నాగసురం, నాగస్వరం అనికూడా అంటారు. మరికొందరు నాయణం అనీ అంటారు. దక్షిణ భారతదేశంలోనూ, శ్రీలంకలోనూ, దక్షిణ భారతీయులు నివసించే మరికొన్ని ప్రదేశాలలోనూ ఈ నాదస్వర వాయిద్యాన్ని వాయించే కళాకారులుంటారు. కర్ణాటక సంగీతంలో దీనికి విశేష స్థానముంది. ఈ వాయిద్యాన్ని అత్యంత మంగళ ప్రదమైనదిగా భావిస్తారు. దేవాలయాలలోనూ, మత, సామాజికపరమైన కార్యక్రమాలలోనూ  తప్పనిసరిగా ఉండవలసిన వాయిద్యం -  నాదస్వరం. ఈ వాయిద్యాన్ని వాయించడానికంటూ ప్రత్యేక తెగ ఉంది. అయితే ఈ వాయిద్య కళాకారులలో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న రాజరత్తినం పిళ్ళై గురించి నేను నా కాలేజీ మిత్రుడు, వక్త సుకీశివం నుంచి ఒకటి రెండు విషయాలు తెలుసుకున్నాను. దాంతో రాజరత్తినం గురించి ఆరా తీయగా ఆసక్తికరమైన అంశాలు తెలిసొచ్చాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ చెప్తున్నాను. మనం తెలుగులో చెప్పుకునే రత్నం అనే మాటనే తమిళంలో రత్తినం అని రాస్తారు. పలుకుతారు. 
"అఖిల లోక నాదస్వర చక్రవర్తి" అని 
ఖ్యాతి పొందిన నాదస్వర విద్వాంసుడు టి.ఎన్. రాజరత్తినం పిళ్ళై తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుమరుగల్ అనే గ్రామంలో 1898 ఆగస్టు 27వ తేదీన జన్మించారు. 
ఆయన అసలు పేరు బాలసుబ్రమణ్యం. ఈయన పుట్టిన కొన్ని రోజులకే తండ్రి మరణించడంతో తల్లితో కలిసి నాదస్వర కళాకారుడైన దగ్గర బంధువు నటేశన్ పిళ్ళై ఇంటికి చేరారు. తనకు పిల్లలు లేకపోవడంతో నటేశన్ పిళ్ళై ఈయనను దత్తతు చేసుకుని రాజరత్తినం అని నామకరణం చేసి పెంచుకున్నారు.
బాబాయి కదిరేశన్ పిళ్ళై, తిరుక్కోడిక్కావల్ కృష్ణ అయ్యర్, కోనేరిరాజపురం వైద్యనాథ అయ్యర్, కన్నుసామి పిళ్ళై తదితరుల దగ్గర నాదస్వరం వాయించడం నేర్చుకున్న రాజరత్తినం అనతికాలంలోనే నాదస్వరం వాయించడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. తొలి రోజుల్లో తిరువాడుదురై ఆలయంలో ఆయన నాదస్వరం వాయించేవారు.
కాలక్రమంలో తిరువాడుదురై ఆధీన విద్వాంసుడిగానూ నియమితులయ్యారు.
ఆయన మద్రాసులో మొట్టమొదటిసారి నాదస్వర కచేరీ చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ తొలి కచేరీతో ఆయన పలువురి మనన్నలు అందుకున్నారు. ఆ తర్వాత మద్రాసుతోసహా తమిళనాడులోని పలు ప్రాంతాలలో ఆయన నాదస్వర కచేరీలు చేశారు.
సాధారణంగా నాదస్వర కళాకారులు ధరించే వస్త్రధారణకు భిన్నంగా రాజరత్తినం కోటు వేసుకునేవారు. షేర్వాణీ ధరించేవారు. షూ వేసుకునేవారు. మెడలో బంగారు గొలుసుండేది. వేళ్ళకు ఉంగరాలుండేవి. ఎక్కడికెళ్ళినా చేతికి స్వర్ణకంకణం ఉండేది.
నాదస్వర చక్రవర్తిగా పిలువబడే రాజరత్తినం పేరులోనే కాక నిజంగానే ఓ రాజులా జీవించారని చెప్పుకోవాలి.
నౌకలాటి పొడవాటి కారులో ప్రయాణం చేసేవారు. ఆయనకు ఆత్మగౌరవం మెండు.
చొక్కా వేసుకుని పైన శాలువ కప్పుకుని నాదస్వరం వాయించిన ఏకైక కళాకారుడీ యన.
శ్రీలంక, మలేసియా తదితర దేశాలలో నాదస్వర కచేరీలు చేశారు.
మిస్ కమల, కవి కాళమేఘం, తిరునీలకంఠర్ వంటి సినిమాలలో నటించిన రాజరత్తినం పొందిన అవార్డులకు రివార్డులకూ లెక్కే లేదు. వాటిలో సంగీత అకాడమీ అవార్డు, అఖిల ప్రపంచ నాదస్వర చక్రవర్తి వంటి పురస్కారాలు ప్రముఖ మైనవి. 
1947లో భారత దేశం స్వాతంత్ర్యం పొందిన రోజు అర్ధరాత్రి డిల్లీలో జరిగిన సంబరాలలో ఈయన నాదస్వరం కచేరీ అందరినీ అలరించింది. ఈ సంబరాలలో ఆయన ఓ సంస్థానాధీశుడిలాటి వస్త్రధారణతో పాల్గొనడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఆయనను చూసిన జవాహర్ లాల్ నెహ్రూ "ఓ సంస్థానాధీశుడిని చూసినట్టు అన్పించింది" అని అభివర్ణించారు.
కంచి పరమాచార్యులవారంటే ఆయనకు ఎనలేని భక్తి. 
రాజరత్తినం ఓమారు మాయవరం వెళ్తుం డగా పరమాచార్యులవారు పట్టణప్రవేశం చేసారని తెలియడంతోనే ఆయనను ప్రత్యక్షంగా చూసి వెంటనే కారు దిగి ఓ వీధి పక్కన నిలబడి నాదస్వరం వాయించారు.
ఆయన నాదస్వరం వినిపించడంతోనే పరమాచార్యులవారు "రాజరత్తినం వాయిస్తున్నట్టుందే" అని చెప్పి పల్లకీని ఆయన వైపు పోనివ్వండి" అన్నారు. వీధి పక్కనే రాజరత్తినం గంటన్నరపాటు నాదస్వరం వాయించగా మాయవరం నగరవాసులు భారీసంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. పరమాచార్యులవారు మైమరచిపోయి ఆ నాదాన్ని విని రాజరత్తినం పిళ్ళైని ఆశీర్వదించారు. ఆయన ఆశీస్సులతో తన జీవితం ధన్యమైందని, ఇంతకన్నా తనకేం కావాలని అన్నారు రాజరత్తినం!
ఎ.వి. ఎం. చెట్టియార్ కు రాజరత్తినం నాదస్వరమంటే చాలా ఇష్టం. రాజరత్తినం నాదస్వరంపై పలికించిన తోడి రాగాన్ని గ్రామఫోన్ రికార్డుగా విడుదల చేయగా ప్రపంచ వ్యాప్తంగా అది అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. 
అయిదుమార్లు పెళ్ళి చేసుకున్నప్పటికీ రాజరత్తినం పిళ్ళైకి పిల్లలు కలగలేదు. శివాజీ అనే అబ్బాయిని పెంచుకున్నారు.
ఆయన 1956 డిసెంబర్ 12వ తేదీన గుండెపోటుతో చెన్నైలో మరణించారు. ఆయన వయస్సు 58 ఏళ్ళు. 




కామెంట్‌లు