తేనె నీళ్ళు - బాలల కథానిక :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

  ఒక అడవిలో ఒక ఎలుకా దాని మూడు పిల్లలు ఉండేవి. పొద్దున్నే లేచి ఆహారం కోసం అడివిలో తిరిగి ఏదోకటి తెచ్చి పెడుతూ వుండేది తల్లి. అది తిని చెట్లమీద గంతులేస్తూ ఆడుకునేవి ఎలుక పిల్లలు. వానాకాలం రావడం తో అవి కలుగులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆకలితో అల్లాడుతూ ఉన్నాయ్. లోపల దాచిన ఆహారపదార్థాలు అన్నీ అయిపోయాయి.అంతలో వాన వెలిసింది.ఎలుక పిల్లలతో బైట కొచ్చి చుట్టుపక్కల ఏదైనా ఆహారం దొరుకుతుంది ఏమో అని చూసింది. ఏమి దొరకడం లేదు. పిల్లలు కీచు కీచు మని ఏడవడం మొదలెట్టాయి.అది చూసి తల్లికి కూడా దుఃఖం వచ్చింది. వీళ్ళ ఏడుపులు చూసి, అడవి మొక్కలు జాలి పడ్డాయి. ఒక మొక్క ఇలా అంది."మేము మీకు ఆహారం ఇవ్వలేం కానీ పైనున్న తేనెపట్టు నుండి కొంత జారి నా ఆకుగొట్టాల్లో నిల్వ ఉంది.కావాలంటే గిన్నె తెచ్చుకో పోస్తాను." అని. 
   పెద్ద ఎలుక వెళ్లి ఒక ఆకు దొన్నెతెచ్చింది. ఆకు గొట్టం ముందు తేనె బొట్లు దొన్నెలోకి జారవిడిచింది.పిల్లలు అది చప్పరించి కాసిని లేత దుంపలు కొరికి తృప్తి పడ్డాయి. 
మొక్కకు కృతజ్ఞతలు చెప్పుకున్న తల్లి ఎలుక పిల్లలతో "చూశారా !మీరు అస్తమాను కొరికిపోగులు పెట్టే మొక్కలు మీ ఆకలి తీర్చాయి.ఇక ఎప్పుడూ కనపడ్డవన్నీ కొరికిముక్కలు చేయక బుద్ధిగా ఉండండి. "అని మందలించింది. 
నీతి - ఒక్కోసారి అలవాటు తప్పక మార్చుకోవాలి. 
   
   ( సమాప్తం )

కామెంట్‌లు