17 ఏళ్ళకే సంపాదకుడైన కణ్ణదాసన్!!;-- యామిజాల జగదీశ్
 పుదుకోట్టయ్ నుంచి "తిరుమగళ్" ,అనే సాహిత్య పత్రిక వస్తుండేది. నెలకు రెండుసార్లు వెలువడే ఈ పత్రికకు సంపాదకుడిగా ఉండిన వారు, పదిహేడేళ్ళ యువకుడు! 
ఆయన ఆ పత్రికకు సంపాదకుడైన తీరే ఓ ఆసక్తికరమైన కథ!
ఆ పత్రికకు ప్రకటనలు తీసుకొచ్చే పనిలో చేరారాయన. 
ఓరోజు పత్రిక సంపాదకుడు సెలవులో ఉన్నారు.
యజమాని ప్రకటనల ప్రతినిధిని పిలిచి ఏదైనా రాయమని పురమాయించారు.
రాయడంపై ఆసక్తి ఉన్న ఆ ప్రకటనల యువ ప్రతినిధి ఆ అవకాశాన్ని అందిపుచ్చు కున్నారు. ఐఎన్ఎ పుట్టుక గురించి ఆ యువకుడు ఓ వ్యాసం రాశారు.
 అది ఆ పత్రిక యజమానికి ఎంతగానో నచ్చింది.
అంతే, ఆ క్షణంలోనే ఆ యువకుడిని ఆ పత్రికకు సంపాదకుడిగా నియమించేసారు.
ఆ యువకుడి పేరు ముత్తయ్య. ఇంతకూ ముత్తయ్య అంటే ఎవరో కాదు! ముత్తయ్యే కణ్ణదాసన్!!
రామనాథపురం జిల్లాలోని సిరుకూడల్ పట్టిలో ఓ కుటుంబంలో ఎనిమిదో బిడ్డగా జన్మించిన ముత్తయ్య ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నారు. ఆయన తోడపుట్టినవారు ఆరుగురు సోదరీమణులు. ముగ్గురు సోదరులు.
ఎనిమిదో తరగతి తర్వాత స్కూలుకెళ్ళడం మానేసిన కణ్ణదాసన్ అజాక్స్ వర్క్స్ లో డెస్పాచ్ బాయిగా పని చేసారు. వారానికి అయిదు రూపాయలు ఇచ్చేవారు.
ఆయన అన్నయ్య ఎ.ఎల్. శ్రీనివాసన్ అక్కడ క్యాషియర్.
చిన్నవయస్సు నుంచే రాయడంమీద మక్కువెక్కువ కణ్ణదాసన్ కి!
అజాక్స్ వర్క్స్ లో పని చేస్తున్నప్పుడే  ఆయన కథ రాస్తుండేవారు. గృహలక్ష్మి అనే పత్రికలో "నిలవొలియిలే" అనే శీర్షికతో ఆయన రాసిన కథ అచ్చయింది. అదే ఆయన రాసిన మొదటి కథ.
కొంత కాలానికి అజాక్స్ లో పని చేయడం నచ్చక మానేసిన కణ్ణదాసన్ కొన్నిరోజులపాటు ఎక్కడా పని చేయలేదు.
పట్టినత్తార్ అనే సాధువు సమాధి దగ్గర కూర్చునేవారు. ఆ సమాధి దగ్గరే నిద్రపోతుండేవారు. ఆ తర్వాతే తిరుమగళ్ పత్రికలో సంపాదకుడయ్యారు.
కానీ ఈ పత్రికలోనూ ఓ ఏడాది పాటే ఉన్నారు. అనంతరం చెన్నైకి వెళ్ళి "తిరై ఒళి" అనే పత్రికలో కొంత కాలం పని చేశారు.
ఆ తర్వాత మోడ్రన్ థియేటర్స్ వారి ఆధ్వర్యంలో వస్తున్న చండమారుతం అనే పత్రికలో చేరారు. కానీ ఆ పత్రిక సరిగ్గా వచ్చేది కాదు. అంతేకాక ఆ పత్రిక రావడం ఆగిపోయింది. అయితే మోడ్రన్ థియేటర్స్ వారు కణ్ణదాసన్ ని తమ కథా విభాగంలోకి తీసుకున్నారు. ఈ విధంగానే ఆయన సాహిత్య జగత్తు నుంచి సినిమా ప్రపంచానికి వచ్చారు.
తర్వాతి రోజుల్లో తమిళనాడులో ప్రముఖ కవిగా పేరుప్రఖ్యాతులు గడించిన కణ్ణదాసన్ ఆ రోజుల్లో ఎక్కువగా రాసినవి కథలే. కవితలెప్పుడో అప్పుడు రాసేవారు. కథలకే అధిక ప్రాధాన్యమిచ్చేవారు. 
దర్శకుడు రామనాథ్ ఆయనను చేరదీసి అవకాశమిచ్చారు. జ్యుపిటర్స్ వారి కన్నియిన్ కాదలి సినిమాలో ఏకంగా ఆరు పాటలు కణ్ణదాసన్ వే.
"కలంగాదిరు మనమే...
ఉన్ కనవెల్లాం ననవాగుం ఒరు దినమే" (కలత చెందకు మనసా, కల నిజమవుతుంది ఏదో రోజు) అనే పాటే కణ్ణదాసన్ సినిమా కోసం రాసిన తొలి పాట.
కణ్ణదాసన్ అనే పేరు బస్సులో ఉన్నప్పుడే పుట్టింది. 
అవును! తిరుమగళ్ పత్రికకు ఓ ఉత్తరం తీసుకెళ్తున్నప్పుడు తమను ఎలా పరిచయం చేసుకోవాలో అని ఆలోచించారు.
ముత్తయ్యా అని పరిచయం చేసుకుంటే చాలదనుకున్న ఆయన కవి అనుకునే వాడికి ఓ ప్రత్యేకమైన పేరు ఉండాలనుకుని "కవితాత్మక పేరు" కోసం ఆలోచించారు. ఈ ఆలోచన ఆయన బస్సులో ప్రయాణిస్తుండగా వచ్చింది. ఇంట ఎనిమిదో బిడ్డగా తాను పుట్టడం, కృష్ణుడు కూడా ఎనిమిదో సంతానం. అటువంటప్పుడు కణ్ణన్ అని ఎందుకు పేరు పెట్టుకోకూడదనుకున్నారు కణ్ణదాసన్. ఆ పేరు బాగుందనుకున్నారు. కానీ కణ్ణన్ అనే పేరేం సరిపోతుంది? అని మళ్ళీ ఆలోచించారు. ఆరోజుల్లో ప్రముఖ కవులందరూ దేనికో దానికి దాసులుగా ఉండేవారు. భారతిదాసన్, కంబదాసన్....ఇలా! అంతే ఆ క్షణమే ఆయన తన పేరు కణ్ణదాసన్ గా మార్చేసుకున్నారు. ఇలా ఆయన పేరైన కణ్ణదాసన్ నాటి బస్సు ప్రయాణంలో పుట్టిందే.
ఓ ఉద్యమంలో పాల్గొని అరెస్టయి జైల్లో ఉన్నప్పుడే ఓ సినిమా కోసం ఓ కథ రాసిచ్చారు కణ్ణదాసన్. అలా ఆయన రాసిన ఓ కథ ఆధారంగా ఇల్లరజోతి సినిమా తీశారు.
1954 వరకూ కవిగానూ రాజకీయవాదిగానూ ఉండిన ఆయన ఆ తర్వాత తెండ్రల్ పత్రికకు పూర్తిస్థాయిలో సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు.. 
కణ్ణదాసన్ రాసిన పాటలలో చాలా వరకు ఆయన అనుభవాల నుంచి పుట్టినవే. ఈరోజుకీ పలువురికి ఆయన పాటలు జోలపాటగానూ, పలువురికి కష్టాలలో ఓదార్పునిచ్చే పాటలుగానూ, నలిగిన మనసులకు ఉత్తేజపరిచే పాటలుగానూ ఉంటున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

కామెంట్‌లు