మనసున కురిసిన వర్షం ;-జటావత్ మునినాయక్ 7659888655జాల్ తండా (నల్గొండ)

 నిశ్శబ్ధ పచ్చని  పైరు ఆహ్వానం తో
మట్టి పంపిన సందేశం తో
చల్లని గాలుల వింజామరాలతో
ఒక నేస్తం వచ్చింది ఉత్సాహం తో
ఆనందాన్ని ఇవ్వడానికి వర్షం అనే పేరు తో రాత్రంతా కురిసిన వర్షం
తడి జ్ఞాపకాలను మిగిల్చివెళ్ళింది
చివికిపోయిన కన్నులచూరు నుండి
చుక్కలుగా తరలిపోతున్న దుఃఖం
కాలప్రవాహంలో జారి కరిగిపోతోంది
విరహ ఝంఝ ఉధృతవడిలో
శాఖలు తరిగిన శిథిల తరువునై
శోకనిశీధిలో చిక్కి ఉన్నాను
విచ్చుకుంటున్న వెల్గురేఖవై నన్నక్కున చేర్చుకొని
శుష్కించిన నా చైతన్యానికి స్వస్థత  చేకూర్చవూ
 నీ తలపులతోనే తలారస్నానం చేసి
ఆరుబయట కురులారబెట్టుకున్నాను
విభాతకాంతుల దువ్వెనతో  
తడిసిన కురుల కరిమబ్బులని
తాపీగా దువ్వుకుంటున్న వియత్సుందరిని చూస్తూ నిల్చున్నాను
వెచ్చని నీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు వీవెనలా వీతెంచి
ముచ్చెమటల ముత్యాలహారాలు నా మెడవంపులో కూర్చాయి
 నీకు తెలుసో లేదో
తొలిసారి నా పై జారిన నీ తుంటరి చూపులు
తొలకరిజల్లులై నన్నింకా తబ్బిబ్బు చేస్తున్నాయి
ఆల్చిప్పల్లాంటి నా కన్రెప్పల్లో
అందమైన నీ ముఖబింబాన్ని ముత్యంలా పొదువుకున్నాను
అరవిచ్చిన పెదవులతో నువ్వు రువ్విన  ప్రతి నవ్వూ
మల్లెలుగా  ఏరుకొని మదిసీమలో నాటుకొన్నాను 
గుభాళించిన చిలిపి ఊహలన్నీ గిలిగింతలు రేపితే
గగనవీధులలో తేలి గాంధర్వ గీతాలు పాడాను
 పరిచయాల పృథ్విపై  ప్రభవించిన మన ప్రేమ
భావాల కలయికతో బహుశాఖలు తొడిగి పెద్దల అనుమతితో పరిణయమై 
పొదరిల్లై మారినప్పుడు
ఫలించిన ఆశలన్నీ ప్రకాశించే తారలై
స్మరించిన నీ రూపం సుధాకరునిలా నన్నల్లుకున్నపుడు
చెలువములన్నీ చెంగలువలై
చలనములన్నీ కవనములై
తటాకమై నా మేను తాదాత్మ్యత చెందిన క్షణాలని
ఘనీభవించిన కాలానికి గుర్తుగా
గుండెపొరలలో నిక్షిప్తం చేసుకున్నాను. 

కామెంట్‌లు
Unknown చెప్పారు…
శబ్ద బంధురత కవితా ధార రెండూ అమోఘం...👌👌👍