ఊసరవెల్లి ఊగిసలాట;- కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),చిట్యాల,నల్గొండ, 8555010108
గల్లీ గల్లీకో మద్యం దుకాణం 
బారులు తీరిన బీర్ బాబులతో
హౌస్ పుల్ కలెక్షన్ కామెడీ జంక్షన్!
ఓ చావు... ఓ పుట్టుక…
సందర్భ మేదైనా…. !
పగలూ రాత్రీ...తేడా లేని 
టైమ్ పాస్ కిక్క్ టానిక్ అంటూ  
ఊసరవెళ్ళి ఊగిసలాట                           
అతడో హిరో !ఎదుటోడు జీరో !!

ఆరిపోతున్న దీపం వదిలి 
ఆనంద క్రీడలాడుతూ
మద్యపానం మధుర పానీయంగా  
ఆఖరి చుక్క అమృతమని                   
మూడు ఫుల్ ఆరు ఆఫ్ బాటిళ్ళు..!

గుట గుట పీకల్లోతు దాకా 
నరనరం విషం నింపి                                                     
తమ రక్తం రుచి మరిగిన 
వ్యసన భూత కోరల్లో చిక్కి                       
ఎన్ని మాంగళ్యాలు తాకట్టుపెట్టారో!

కన్నీళ్ళు కానరాని 
నెత్తుటి బంధం గుర్తులేని 
మానవత్వం మరిచి మత్తిల్లిన మహర్లోకం!
పృఛ్ఛకులుండరు 
అందరూ అవధానులే!
మత్తులో మారణ హోమాలెన్నో !
మహిళలపై అరాచక ఆగడా లెన్నెన్నో!

తాగడం వ్యసనమని తెలిసినా
తాగి తందనాలాడేది కొందరు
మైకంలో వాహనం నడిపేది యింకొందరు
తాగడానికి బతుకుతారో
బతికేందుకు తాగుతారో తేల్చు కోలేని వైనం!

నేడు ఫోన్ కొడితే మద్యం డెలివరీ..! 
లోకం ఎటు పోతేనేమి...?
మద్యం ఏరులై పారితేనే
ప్రభుత్వం పంట పండేది!

రెండు మూడు చుక్కలు 
గొంతులో దిగితే చాలు
తానో నల్లకోటు లేని లాయర్!
కోర్టుల అవసరం రాని జడ్జీ! 
కాపురాలు చిచ్చుబుడ్లై పేలినా 
కానరాని నిశాలోకం!

వారిది తీరని ఆల్కహాల్ దాహం
కలల సౌధం కూలదోసి 
స్వేచ్చగా సరిహద్దు రేఖ దాటి
ఆనంద డోలికల్లో ఓలలాడే 
గతి తప్పిన యువకుల గ'మ్మత్తు లోకం!


కామెంట్‌లు