బ్లాక్ బాక్స్;-కంచనపల్లి వేంకట కృష్ణారావు93486 11445

 ఎక్కడైనా విమానం ప్రమాద వశాత్తు కూలిపోతే అధికారులు విమానంలో గల బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నట్టు మనం పత్రికలలో తరచు చదువుతుంటాం.అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? దీని ఉపయోగాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడుతెలుసుకుందాం.
        నిజానికి బ్లాక్ బాక్స్ నల్లగా ఉండదు ముదురు ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఎందుకంటే ఈ రంగు అయితే ఎంత దూరానికైనా కనబడుతుంది, సులభంగా గుర్తు పట్టవచ్చు.దీనినే 'కాక్ పిట్ వాయిస్ రికార్డర్' అని కూడా అంటారు.విమానం ప్రమాదానికి గురి అయి విమానం పూర్తిగా దెబ్బతిన్నా ఈ బ్లాక్ బాక్స్ మటుకు దెబ్బతినకుండా ఉండేటట్లు చేస్తారు.
       ఈ బ్లాక్ బాక్స్ లో టేప్ రికార్డర్ వంటి పరికరం ఉంటుంది.విమానం కూలిపోయేటపుడు పైలెట్లు మాట్లాడుకునే మాటల్ని ఇది రికార్డ్ చేస్తుంది.ఇది గాక విమానంలో పరికరాల పనితీరునుకూడా రికార్డ్ చేస్తుంది.తద్వారా ఏ కారణం వలన ప్రమాదం సంభవించిందో అధికారులకు తెలుస్తుంది. 1927 ఛార్లెస్ లిండ్బర్గ్ తన విమానంలో అంత ఆధునికం కాని బ్లాక్ బాక్స్ తో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటాడు! 
      ప్రపంచ విమాన రక్షణ సూచనల ప్రకారం ఈ బ్లాక్ బాక్స్ 3400 రెట్లు భూమ్యాకర్షణ శక్తిని తట్టుకునేట్టు ఉండాలి.1100 సెంటిగ్రేడుల ఉష్ణోగ్రత వద్ద కూడా కాలి పోకుండా ఉండాలి! ఆరువేల అడుగుల లోతున నీళ్ళలో పడిపోయినా చెడి పోకుండా ఉండాలి. ఇది నీళ్ళలో పడినా దీనికి ఉన్న 'పింజెర్స్' అనే పరికరం ద్వారా ఇది ఒక నెల భూమిమీదకు తరంగాలు పంపుతుంది.తద్వారా విమానం ఎక్కడ పడిందో గుర్తించవచ్చు. ఇంకా దీనిలోని 'ఫ్లైట్ డాటా రికార్డర్' వలన వివిధ పరికరాల పనితీరు,విమానం ఏ ఎత్తులోంచి పడింది,వేగం మున్నగు విషయాలు తెలుసుకోవచ్చు.విమానంలో ఏదైనా పరికరం సరిగ్గా పనిచేయకపోతే  ఎలా పనిచేయడంలేదో 'క్విక్ ఆక్సెస్ రికార్డర్'అనే పరికరం బ్లాక్ బాక్స్ లో రికార్డ్ చేస్తుంది. అందువలన విమాన ప్రమాదం ఎందువలన జరిగిందో తెలుస్తుంది.
       దీనివలన ఇంకా ఉపయోగం ఏమిటంటే భవిష్యత్తులో విమాన తయారీలో ఆయా లోపాలను సరిదిద్దవచ్చు.
    ప్రమాదంలో   చనిపోయిన వారి కుటుంబాలకు ఆయా ప్రభుత్వాలు,బీమా సంస్థలు న్యాయపరంగా డబ్బు చెల్లించడానికి ఎంతో ఉపయోగం ఉంది.శాస్త్రజ్ఞులు దీనిని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు.
             **********

కామెంట్‌లు