సహాయంలో సంతోషం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 ఎక్కడైనా వరదలు సంభవించినా,ఏదైనా ప్రమాదం సంభవించినా ప్రభుత్వ సహాయం సరే, స్వచ్ఛంద సంస్థలు, కొందరు డబ్బు గల వాళ్ళు చేసే సహాయం చెప్పుకో తగిన అంశం.ఎందుకంటే వారు చేసే సహాయం నిస్వార్థమైనది,వారికి ఎంతో తృప్తినిస్తుంది.
       ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తే ఆ సహాయం మనం సంపాదించినదానికంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది!
       సహాయం చెయ్యడం అనే ప్రక్రియ మనలో ఒక విధమైన సంతోషాన్ని కలుగచేస్తుంది ఇదొక ఆరోగ్య హేతువు!సహాయం చేయడం వలన మనలో ఆశావహదృక్పథం (positive attitude) పెరుగుతుంది!ఉత్తమమైన మానసిక ఆలోచనలు పెరుగుతాయి!రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
        స్టీఫెన్ పోస్ట్ అనే ప్రొఫెసర్ అనేక రకాలుగా సహాయంచేసేవారిని పరిశీలించి పరిశోధించి why good things happen to good people అనే పుస్తకంలో సహాయం చేసే వాళ్ళకి శారీరకంగా మానసికంగా జరిగే మంచిని గురించి వివరంగా వ్రాశాడు.
      స్వార్థం లేకుండా ఇతరులకు చేసే సహాయాన్ని ఆంగ్లంలో Altruism అంటారు.
      సహాయం చేసినప్పుడు పొందే ఆనందం ప్రతి ఒక్కరి అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు. ఓ గుడ్డి వ్యక్తిని రోడ్డు దాటించినా, ఓ నిండు గర్భిణీ స్త్రీకి బస్సులో మీరుకూర్చున్న సీటును ఆమెకు ఇచ్చినా,రోడ్డు మీద ఒంటరిగా నిలబడి ఏడుస్తున్న పిల్లవాడిని వాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చినపుడు వచ్చే ఆనందం గూర్చి చెప్పవలసిన పనిలేదు. సహాయం చేస్తే వచ్చే ఆనందం వలన మన మెదడులో ఆనందానికి కారణమయ్యే డోపమైన్ అనే న్యూరో ట్రాన్సిమీటర్ ఉత్పత్తి అయి ఆనందం,ఆరోగ్యం కలుగుతాయి! ఈ విషయాలను ఆలన్ లుక్స్ మానసిక శాస్త్రవేత్త తన పుస్తకం 'ది హీలింగ్ పవర్ ఆఫ్ డూయింగ్ గుడ్' అనే పుస్తకంలో వివరించాడు.
       నాకు తెలిసిన టీచర్ మిత్రుడు తన ప్రతి పుట్టిన రోజున ఒక బియ్యం బస్తాకొని తన పిల్లతో సహా మానసిక వికలాంగుల హాస్టల్లో ఇచ్చి అక్కడ ఓ గంట గడిపివస్తాడు!ఎంత మంచి మనసోకదా! అదిగాక తన సొంత డబ్బుతో పిల్లలకు బుక్స్,కథల పుస్తకాలు కొని ఇస్తున్నాడు.
       కేవలం ఎవరికైనా కష్టమొచ్చినపుడే కాదు ఓ ఆదివారమో లేక మీకు టైం కుదిరినప్పుడు ఓ వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆ వృద్ధులతో కొంత సమయం గడిపి కబుర్లు చెప్పండి.మీరు చదివేసిన పత్రికలు,పండ్లు పంచండి.దేవాలయాలముందు అడుక్కునే వికలాంగులకి ఒక రూపాయి వేసే బదులు మీ పుట్టిన రోజున గానీ, మీ పిల్లల పుట్టిన రోజునగానీ మంచి టిఫెన్ గానీ, అన్నంగానీ పొట్లాలుగా కట్టించి పంచండి.సహాయంలో ఆనందం పొందండి.
              *****************

కామెంట్‌లు