కథా మణి పూసలు(మొదటికే మోసం);--బొమ్ము విమలమల్కాజ్ గిరి,,,,9989775161
ముసలిదైనట్టి చిరుతను
ముసలిదైన సింహమును
కలిసి మెలిసి ఉండేవి
పెద్ద అరణ్యములోను.

వయసు మీద పడినందున
వేటాడుట లేనందున
ఉన్నదాంట్లో సర్దుకొని
బతుక సాగెనానడవిన 

ఓసారియు నారెంటికి
వరుసగ వారము నాటికి
తినుటకు ఏమి దొరకక
కృశించె నాకలి దాటికి 

అదె సమయాన వాటికి
పరుగులెత్తుతు వాటికి
జింక పిల్ల కనిపించగ
సంతసం కలిగె వాటికి 

ఆకలి బాధను యెరిగి
దగ్గరగానవి జరిగి
మాట్లాడుకోసాగెను
చెట్టు చెంతకవి చేరి

సింహము చిరుతతోను
వృద్ధాప్యము వల్లను
పారిపోతున్నావవి
మనకు దొరుక కుండను 

అందుకే నా మిత్రమా
నా మాటను నీ వినుమా
ఇద్దరము కలిసి మనము
దానిని వేటాడుదామా 

నీవో వైపు నుండి
నేనో వైపు నుండి
దాడినే చేద్దాము
చెరో వైపున నుండి 

అనీ చిరుతతోని ననగ
చిరుత కూడ సరేయనగ
రెండు తెలివితోన కూడ
జింకపిల్ల పట్టుకోగ 

జింకపిల్ల దొరకగాను
సింగముకి ఆశరేగెను
వేటాడే ఆలోచన
ముందుగ నాకే వచ్చెను. 

నేను తిన్న తరువాత
నీవు తినుము తరువాత
అని చిరుతతో పలికెను
ఆకలనె బాధ చేత 

ఆ మాటలు వినగానె
చిరుత కోపమ్ముతోనె
అది చిన్న జింక పిల్ల
నివ్వు తినగ మిగులదనె 

ఇద్దరము వేటాడాము
మనమిద్దరము తిందాము
చిరుత సింహముతో ననగ
ఒప్పు కోలేదు సింహము 

మాట మాట పెరిగెను
వాదులాట జరిగెను
నీకు వాటానివ్వనని
చెప్పిందా సింహము 

ఈ రెండిటి గొడవను
చెట్టు చాటు నుండిను
మాయదారి నక్క యొకటి
గమనిస్తూ వుండెను 

అసలే ముదుసలి తనమును
ఆపై నాకలి బాధను
అందుచే రెండు కూడ
వెను వెంటనె కూలబడెను

అది గాంచినట్టి నక్క
నాకది దొరుకును పక్క
అనుచు జింకను లాక్కొని
పారిపోయె నెంచక్క. 

తొందరెంతో పడితిమి
వాదులాటల మునిగితిమి
దొరికిన ఆహారాన్నీ
చేతులార పోగొడితిమి. 

అనుచు రెండు బాధ పడెను
ఆకలితో బాధ పడెను
అయ్యో! నేస్తమా ! యని
రెండు కూడ బాధ పడెను 

నీతి
.......

వాదులాటలు నాడవద్దు
అత్యాశయు నుండ వద్దు
ఉన్న దాంట్లో సంతృప్తి
చెందుటెంతైనా ముద్దు 


కామెంట్‌లు