రాములవ్వ జీవితం;(కథా మణి పూసలు)---బొమ్ము విమల మల్కాజ్ గిరి,9989775161
రాములవ్వ ఇంటిముందు
ఆడుతుండె పిల్లలందు
కల్పననే అమ్మాయి...
ప్రేమ చూపు అవ్వ యందు. 

పేదదయిన కల్పనకు
డబ్బుకట్టు ఫీజునకు
రాములవ్వ సాయంను
చేసేడిది కల్పనకు. 

కల్పనెంతో ఎదిగినాది
పెళ్ళియీడు కొచ్చినాది
తగిన వరుడితోని.....
పెళ్ళి కూడ కుదిరినాది. 

ఊరి రామాలములోన
రామయ్య సన్నిధిలోన
పెళ్ళి నిశ్చయించినారు
దివ్య శుభముహూర్తమ్మున 

గుడిని అలంకరించారు
పందిరి తీర్చిదిద్దారు
శోభాయామానంగా
మంటపం ఏర్పరిచారు. 

పెళ్ళి పీటల మీదను
కల్పననే కూర్చునెను
దగ్గర్నించి చూచుటకు
ముందు కూర్చుంది అవ్వను. 

దంపతులు వస్తున్నారు
జంటలందరొస్తున్నరు
పట్టుబట్టలతోనీ....
కనువిందు చేస్తున్నారు. 

వెనుక కూర్చున్న రమణి
గునుగుతున్నదీ ఏమని
తగుదునమ్మ అంటు అవ్వ
ముందు వరుసల ఉన్నదని 

విధవరాలు ముసలిది
ముందున కూర్చున్నది
ఎలాగైన లేపాలని...
నిశ్చయించుకొన్నది. 

భర్తనే పిలిచింది
విషయమ్ము చెప్పింది
వెనుకకు పంపించమని
పతిని పురిగొల్పినది. 

నాయకులొస్తున్నారు
ఇక్కడ కూర్చుంటారు
బయట కూర్చోమంటూ...
అవ్వను లేపేసారు. 

వివాహం జరుగుతున్నది
కర్ర కావాల్సొంచింది
అవ్వ కర్రను తీస్కొని
పెళ్ళిలో వాడబడినది. 

రమణి భర్త వచ్చాడు
కర్ర తెచ్చి ఇచ్చాడు
కర్ర ఇచ్చా నవ్వాని.
 నోరు మెదుప పోయాడు 

నేను అవసరము లేదా
నా కర్రవసరముందా
ఏమి పెద్ద మనిషివయ్య..
నీ కస్సలు బుద్ధుందా. 

దురవాట్లను మానక
ఆరోగ్యం బాగలేక
చావు కొని తెచ్చుకొని
పోతే ఈ శిక్ష నాక 

మధ్యలోనే వచ్చాడు
మధ్యలోనే పోయాడు
మొదటి నుంచి లేడుగ
కాలం తీరి పోయాడు. 

నేనే బాధ పడాలా
అవమానం పొందాలా
జీవితాంతము కూడా...
కృశించి నే చావాలా. 

చెడ్డవగు ఆచారాలు
బూజగు సాంప్రదాయాలు
మానవత్వం నశించి
పెడుతుండ్రు అవమానాలు. 

మనుషులుగాను చూడండి
మానవత్వం చాటండి
బాధను కలిగించొద్దు...
అంటు విలవిలలాడింది. 

అవ్వ దగ్గరకెళ్ళాడు
చేతులు పట్టుకొన్నాడు
మన్నించని రమణి భర్త
అవ్వను వేడుకొన్నాడు. 

అవ్వను తీసు

కెళ్ళాడు
ముందు కూర్చోబెట్టాడు
మంచి భోజనము పెట్టి
కానుకలు ఇప్పించాడు. 

అవ్వ ఎంతో మురిసింది
దంపతుల దీవించింది
గర్వంగా రాములవ్వ
ఇల్లు తాను  చేరుకుంది. 

కామెంట్‌లు