జాతి లక్షణం-(కథా మణి పూసలు)--బొమ్ము విమల మల్కాజ్ గిరి,9989775161
అందమైన అడవినందు
ఓ నక్క దంపతులందు
జీవనం చేస్తుండెను.....
 సుందరమగు తావునందు

వివాహమయ్యినది కాని
సంతానం కాలేదని
విచారమెంతో పొంది
ఆశలన్నీ వదులుకొని

నక్కబావ దంపతులు
జీవిస్తుండె వారలు
ఒకానొక తరుణమందు
ఫలించే వారి కళలు

సంతు ఒకడు పుట్టెను
సంతసాన్ని తెచ్చెను
రాము అని పేరు బెట్టి
పెంచిరి ముద్దుగాను

అతి గారాబంగాను
ఏలోటు లేకుండను
రామును పెరుగ వట్టె
అమ్మనాన్నల వద్దను

ఆ అరణ్యమునందును
వీరి సమీపములోను
కోతిబావ దంపతులు
కూడ జీవిస్తుండెను

కోతి బావ దంపతులకు
కూడ ఉండెనొక్క కొడుకు
వేణు అనే పేరు వారు....
పెట్టినారు ప్రియ సుంతకు

రాము వేణు ఇద్దరును
ఒకే ఈడు పిల్లలును
చెలిమి కుదిరి ఇద్దరు
ఆడుచుందురాటలను

వేణు చెట్లనెక్కుతూ
పల్టీలనె కొట్టుతూ
చూపరులకాహ్లాదాన్ని
పంచెవాడు ఎగురుతూ

రాము ప్రయత్నించె వాడు
విఫలము పొందెండివాడు
ఎగురుడము నేర్పమని
వేణుని బ్రతిమాలె వాడు

ఒకరు నేర్పితే రాదు
ఒకరు చెప్పితే రాదు
జన్మతహా వచ్చునది
చూపినా నీకు రాదు

అని వేణు చెప్పగానే
రాము కోపమ్ముతోనే
ఫటఫటమని పళ్ళు కొరికి
పొంగె దుఃఖమ్ముతోనే

ఓర్వ లేని వాడివి
మేలు ఎంచ నోడివి
నేర్పుట ఇష్టం లేక
మాటలనె చెప్పితివి

నా చేత కాద అంటూ
నేను ఎగురుతా నంటూ
కొమ్మనెక్కి దుంకినాడు
వేణునే తిట్టుకుంటూ

కాలు జారి పడ్డాడు
లబోదిబో అన్నాడు
కాలు విరిగి బాధతో
కట్టు కట్టుకున్నాడు

అమ్మకు చెప్పినాడు
నాన్నకు చెప్పినాడు
ఇద్దరిని తీసుకొని
వేణింటికెళ్ళాడు

కోపంతోన ముగ్గురు
చితకచితక బాదారు
కోతిబావ దంపతులు
కొడుకు వైపు చూసారు

నా తప్పు ఏమి లేదు
నేనేమి చేయలేదు
వద్దని చెప్పిన కానీ
నా మాటలు విన లేదు

తప్పు తెలుసుకొన్నారు
మన్నించమనడిగారు
నక్కబావ దంపతులు
కొడుకు తప్పు తెలిపారు

సామర్థ్యములు అన్నవి
కొందరికి కొన్నుంటవి
వాటంతటవే ప్రతిభ
వారికి తెచ్చి పెడతవి

అసూయనేమి పడవద్దు
ద్వేషం పెంచుకోవద్దు
వారి ప్రతిభను చూసి
మెచ్చుకొనుట మరువవద్దు

ప్రతి ఒక్కరికేదో ఒక
ప్రతిభ ఉంటుంది తప్పక
సమయం వచ్చినప్పుడే
నిరూపించు కోవాలిక

హిత బోధ చేసారు
మనస్సునే మర్చారు
నక్కబావ దంపతులు
కోపం తగదన్నారు

రాము తప్పు తెలుసుకొని
వేణు చెలిమి చేసుకొని
కలిసి మెలిసి ఉన్నారు
అరమరికలను మానుకొనికామెంట్‌లు