సాహసం*---(కథా మణి పూసలు)-బొమ్ము విమల మల్కాజి గిరి ,9989775161
ఒకానొక రాజ్యములోను
సోము నివసించుచుండెను
అతని యొక్క భార్యకు
ఒక రాచ పుండు పుట్టెను 

ఎన్ని మందులు వాడినను
పుండు తగ్గ లేకుండెను
భార్య బాధను చూసి
తట్టుకోలేక పోయెను. 

రాజ్యములో పేరొందిన
గొప్పనగు వైద్యునితోన
సంప్రదింపులను జరిపి
భార్య భాధనే చెప్పిన 

పెద్దవాళ్ళకొచ్చె జబ్బు
వింతకలిగినదీ జబ్బు
విరుగుడు మందు తయారు
చేసి తగ్గిస్తా జబ్బు  

మందులోనికి కావలెను
ఈనినట్టి పులి పాలును
అని చెప్పి వైద్యుండు
తన ఇంటికేను పోయెను 

ప్రక్కనున్న అడవిలోను
ఒక గుహలో పులి ఈనెను
దాని పాలు తెస్తానని
సోము అడవిలోకెళ్ళెను 

పెద్దలు వద్దని చెప్పెను
భార్య కూడ వద్దనెను
ఎవరి మాట వినకుండ
పాలకై బయలు దేరెను 

గుహ దగ్గరికెళ్ళినాడు
పులి మాతను పిలిచినాడు
నా భార్యకు బాగలేదు
మందుకి పాలనడిగాడు 

దానికా పులి మాతను
చానేండ్లకూ కలిగేను
ఒక్కగానొక్క బిడ్డ...
దానికే సరి పోవనెను 

ఇదేను మా రాజ్యము
అడవి మా ఆధీనము
మా మామనె ఆఫీసరు
తెలుసుకొని పాలివ్వుము

ఎవరైతే నాకేంటి
నీతో నాకు పనేంటి
అంటు కోరలతో గీకె
సోము తలచెను గతేంటి 

ఎలాగైన తేవాలని
మదిలో నిర్ణయించుకొని
మళ్ళీ బయలు దేరాడు
ధృడ సంకల్పంబు బూని

మొదటగ పులి పాదాలకు
ప్రణమిల్లెను పులి మాతకు
తన భార్య బాధనంత...
వివరరించెను పులి మాతకు 

కొన్ని పాలనిచ్చినచో
నా భార్యకు వాడినచో
పునర్జన్మ వచ్చి బ్రతుకు
శ్రేష్ఠ  పాలు వాడినచో 

సోము బ్రతిమిలాడాడు
వినయముతో వేడినాడు
పులి మనసు కరిగెటట్లు
భార్య వ్యధను తెలిపాడు 

సోము విశ్వాసము జూసి
భార్య మీద ప్రేమ జూసి
ఉగ్గిన్నెడు పాలనిచ్చె...
సోమడిగిన రీతి జూసి 

సోము సంతసించినాడు
కృతజ్ఞతలు తెలిపి నాడు
పులి పాలను తీసుకొని
వేగిరాన వెళ్ళినాడు  

మందు తయారయ్యినాది
భార్య జబ్బు తగ్గినాది
సోము యొక్క ధైర్యాన్నీ...
రాజ్య మంత పొగిడినాది 


కామెంట్‌లు