:కర్షక కవినై;-లావణ్య గణేష్--కలం స్నేహం :
మనమంతా కనిపించని ఆ దేవుని బిడ్డలం 
భరతమాత పుత్రులమైన మనసున్న మనుషులం..
మరెందుకో తెలియని ఈ హెచ్చుతగ్గులు..
కలిమి లేములనెడి తారతమ్యాలు...
నిలువెల్లా స్వార్థపు విషంక్రక్కుతూ పడగలెత్తే నరులను చూసి విసిగి..
ఆణువణువూ అవినీతి వేళ్లూనుకొనియున్న సమాజమును కాంచి..
నరనరానా అక్రమాలు జీర్ణించుకున్న సిరిగలవారి అడుగులకు మడుగులొత్తుతుంటే
కళ్లుండీ చూడలేక చేతులుండీ అన్యాయాన్నెదిరించలేక 
పక్షవాతం వచ్చినట్లు పడిపోయాయి కాళ్ళు చేతులు..

ఇన్నాళ్లు నేనేమి చేయలేని అసమర్థురాలినని
భయంతో బిగుసుకుపోయే అబలనని ఆక్రోశించింది అంతరంగం..
కాని నేడు... నేను అన్నీ చేయగలనని 
ధైర్య స్థైర్య గుణములతో 
సత్తువ కల్గిన సబలనని
నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది
నా చదువుల తల్లి..
అదే నా జడత్వానికి ఔషధమై..

అందుకేగా ఇప్పుడు ఆవరిస్తున్నాయి ఆలోచనాభ్రములు ఎద గగనంపై
స్వార్థపు ఉప్పునీటిని ఆవిరిగామార్చి సమాజముపై నిస్వార్ధ మంచినీటి చినుకులుగా వర్షింపజేయ మేఘాన్నై...
ఇప్పుడు ప్రఫుల్లమౌతున్నాయి నా కర కమలములు 
కలము హలముతో లోకపు క్షేత్రంపై
పండించిన సజ్జన పంటలో అక్రమార్కులనే కలుపు మొక్కలను పెకిలించ కర్షక కవినై...


కామెంట్‌లు