రాజుకు కనువిప్పు (కథ:) రచయిత సరికొండ శ్రీనివాసరాజు

 
       విజయనగరం సామ్రాజ్యాన్ని వీరసింహుడనే రాజు పరిపాలించేవాడు. అతను రాజు అయినప్పటి నుంచి విజయయాత్రల పేరుతో అనేక రాజ్యాలను జయించి, తన రాజ్యంలో కలుపుకొనేవాడు. అలా రాజ్య విస్తరణ పట్ల పెట్టిన శ్రద్ధ సుపరిపాలన మీద పెట్టలేదు. అప్పుడప్పుడు మాత్రం మారువేషాల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు. 
       ఒకరోజు రాజు మారువేషంలో ఒక గ్రామంలో తిరుగుతున్నాడు. ఒక ఇంట్లో అరుపులు వినిపిస్తున్నాయి. "మాటిమాటికీ అవి కావాలి, ఇవి కావాలి అంటే డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? మనం పేదవాళ్ళం. కోరికలను అదుపులో పెట్టుకోవాలి. మరీ అతిగా ప్రవర్తిస్తే రాజుగారికి ఫిర్యాదు చేస్తా‌‌." అన్నాడు భర్త. భార్య ఫక్కున నవ్వింది. "రాజు గారికి చెబుతావా? ఆ రాజుకే ఆశ ఎక్కువై ప్రపంచాన్ని మొత్తం ఏలాలని విజయయాత్రలు చేస్తున్నాడు‌. కానీ పరిపాలనపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా ప్రజలకు కష్టాలు ఎక్కువైనాయి. పాపం! ప్రజలకు ఏ కష్టం రాకుండా సుపరిపాలన చేస్తున్న రాజులు కూడా మన రాజు చేతిలో ఓడిపోయారు. ఇక ఆ ప్రజలకు కూడా కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడ రాజ్యాలను పాలించిన రాజులను ఎవరైనా గుర్తు పెట్టుకున్నారా? ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకున్న రాముడు వంటి వారిని, త్యాగ మూర్తులు అయిన రంతిదేవుడు, జీమూతవాహనుడు లాంటి వాళ్ళను కొన్ని వేల సంవత్సరాల పాటు జనం గుర్తు చేసుకుంటారు. వారి మార్గంలో నడవాలని వాళ్ళ పిల్లలకు బోధిస్తారు." అన్నది భార్య. అది విన్న మహారాజు సిగ్గుతో తల వంచుకున్నాను. తనకు పరోక్షంగా కనువిప్పు కలిగించిన వీళ్ళకు ఏదైనా గొప్ప ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని నిశ్చయించుకున్నాడు. తాను గెలిచిన రాజ్యాలను ఆ రాజులకే అప్పగించి, సుపరిపాలన చేయకపోతే మళ్ళీ ఆ రాజ్యాలను జయిస్తానని, ఆ రాజులను కఠినంగా శిక్షిస్తానని హెచ్చరించాడు. రామరాజ్యాన్ని తలపింపజేసేలా తన రాజ్యాన్ని పాలించాడు.

కామెంట్‌లు