బ్రతుకుబాట..!!>గురువులప్రేమ; -కోరాడ నరసింహరావు >విశాఖపట్నం

 -7-
రోజుకు అర్ధరూపాయి నుండి... 
ఇరవైయైదు రూపాయల పనివాడిని అయ్యే మధ్యలో... 
నాదంతా బజారు బ్రతుకై పోయింది... !
సరిగ్గా 13 నుండి 24 ఏళ్ల వయసంటే....శారీరకంగా, మానసికంగా చక్కని ఎదుగుదల జరగవలసిన వయసు !పరిసరాలు,పరిస్థితులు  విశేషంగా  జీవితాన్ని  ప్రభావితం చేసే వయసు...!   నాకు  మంచీ, చెడులు  రెండూ పరిచయమైన
రోజులవి ! ఓవైపు చదువు నాగరికత బాగాతెలిసిన గురువులు..., మాపెద్దగురువు ఏదో తెమ్మనో, చెయ్యమనో చెప్పేవారు నాకు సరిగ్గా వినపడేది కాదు... పెదాలకదలికను బట్టి అర్ధం చేసుకుని ఆ పనిచేసేవాడిని!
ఆపరిస్థితి నాకు ఎందుకొచ్చిందో అప్పట్లో నాకు బోధ పడలేదు !నాకు ప్రతీదీ అంతే... ఎవరైనా ఏదైనా నాకు సంబంధించి మంచిగానీ.... చెడుగానీ 
వెంటనే బోధ పడేది కాదు... తరువాత ఎప్పుడో బుర్రలో ఓ మెరుపులాగా ఆసంఘటనకు 
సంబంధించిన మంచి - చెడులు సినిమా లా కనిపించేవి !
నన్ను చిన్నప్పుడు  మామేనమామ" నేను వీడ్ని బొబ్బిలిలో చదివిస్తాను" అనిచెప్పి తీసుకెళ్లటం, అప్పుడే పెళ్ళైన  కొత్త జంట వాళ్ళు !
వాళ్ళు గదిలో... నేను గది బయట పడుకునేవాళ్ళం !
వాళ్ళ మాటలన్నీ నాకు వినపడేవి !ఓ రోజు మా అమ్మ నాన్నల గురించి మాట్లాడుకున్న మాటలు నేను విన్నట్టు మామేనమామ భార్య పసిగట్టింది ! స్నానం చేయిస్తానని పిలిచి... మా మాటలన్నీ నీకు వినిపిస్తున్నాయా...? ఇంక వినపడవులే అంది ! అప్పుడు నాకేమీ తెలియని వయసు... 
ఆమె చేసిన పనేమిటంటే... 
నారెండు చెవుల్లోనూనలుగు పిండి ముద్దలు కుక్కి... ఆమ్మో పూర్తిగావినపడక పొతే తెలిసిపోతుంది అనటం నాచెవులారావిన్నాను ఓ చెవికి చిన్న సందు విడిచిపెట్టింది అన్నీ తెలిసినా బోధపడని బుర్రనాది ! అందుకే ఈ వినిపించీ - వినిపించని సమస్య ! నన్ను బాగానే ఇబ్బంది పెట్టింది !!  మాచిన్నగురువమ్మగారు లక్ష్మీగారు నన్నో కొడుకులా చూసుకునే వారు... వారికి ఇద్దరు ఆడపిల్లలే, మొగపిల్లలు లేరు! ఏది వండుకున్నా వాళ్ళతో సమానం గా నాకూ పెట్టేవారు ! రోజూ ఉదయం 
చద్దన్నంవాళ్లింట్లోనే...ఆమూలంగా బ్రాహ్మణ భోజన రుచులన్నీ నాకు తెలిసొచ్చాయి !
ఇంక మా చిన్నగురువుగారు అప్పుడప్పుడూ మాఇంటికొచ్చే వారు... ఒరే నర్సింలు... మీది మట్టిల్లే ఐనా ఏంత నీటుగా... 
చక్కగా ఉంచుకుంటున్నార్రా అంటూ ముచ్చట పడేవారు !
ఎప్పుడైనా ఒంట్లో బాగాలేక స్టూడియోకి వెళ్లలేక పొతే ఇంటికి బియ్యము, పప్పు తెచ్చి డబ్బులుకూడా ఇచ్చేవారు... అంత మంచి మనసు ఆదంపతులది !
 మాపెద్దగురువు ఉమాగారు 
ఎప్పుడూ మద్రాస్ వెళుతుం డడం... రకరకాల కెమెరాలు కొని పట్టుకు రావటం...రెండువేలకి కొన్న కెమెరాను ఆరేడు వేల కమ్మడం 
మిత్రులైనాసరే... ఆయనకీ పాపభీతి లేదు... గానీ గొప్ప ఫోటోగ్రాఫర్ !ఫోటోగ్రఫీని గురించి ఎన్నెన్నో ఇంగ్లీష్ బుక్స్ తెప్పించి చదివేవారు !ఆయనో ఓషన్ అఫ్ నాలెడ్జి ఇన్ ఫోటోగ్రఫీ !
వే అఫ్ టేకింగ్...అరేంజ్మెంట్ 
అఫ్లైట్...పోసింగ్...కంపోసింగ్ 
వీటిలో మంచి ప్రతిభయే గాక 
ఫ్యాషన్ ఫోటోగ్రఫీ...ట్రిక్ ఫోటో గ్రఫీ... మోడల్... న్యూడ్ ఫోటోగ్రఫిల్లోనూ దిట్ట !ఔట్డోర్ గ్రూప్సైతే చెప్పనక్కరేలేదు !!
వచ్చిన కష్టమర్ల తో ఇంగిలీషు 
హిందీ... ఒరియాభాషల్లో కూడా మాట్లాడుతుంటే నాకు చాలాముచ్చటేసేది !
ఆసంస్కారం నామీదకూడా కొంత ప్రభావం చూపించిందనే 
చెప్పాలి !ఇదంతా స్టూడియో నుండి నాకబ్బితే... నాచేత్తో ఉన్నవాతావరణప్రభావానికి కూడా నేను అతీతుడను కాలేక పోయాను...... 
                    ****************
                      ...... సశేషం....
కామెంట్‌లు