మారని నాన్న;-- యామిజాల జగదీశ్
 పన్నెండేళ్ళ క్రితం ఇంజినీరింగ్ ముగించుకుని పని కోసం చెన్నై వచ్చాను. 
నాకు ఉద్యోగం దొరికి పొందిన మొదటి నెల జీతం ఎనిమిది వేల రూపాయలు.
మొదటి నెల జీతం ఏడో తేదీన బ్యాంకు ఖాతాలో జమైంది. ఈ మొదటి నెల జీతం బ్యాంకులో జమైనట్టు తెలియడంతోనే ఇంటికి ఫోన్ చేశాను.
నాన్నే ఫోన్ తీసారు. 
నాన్నతో నేను మాట్లాడటం తక్కువే. క్షేమ సమాచారం అడిగి "మీకేమైనా కావాలా?" అని అడిగను.
నాన్నేమీ చెప్పలేదు.
అమ్మతో మాట్లాడు అంటూ ఫోన్ నాన్న నీకిచ్చేశారు. చూసేవామ్మా ఆయనను....ఏమైనా కావాలని అడిగితే మరొక్క మాట మాటాడలేదు. ఈయన నాకు....." అంటూ నాన్నమీద ఒకింత కటువుగా ఓ నాలుగు మాటలు చెప్పేసాను నేను. నాన్న తీరుమీద తనకున్న ఫిర్యాదును ఇప్పటికే డెబ్బై ఎనిమిది సార్లు చెప్పిన నేను ఈరోజు మరొక్కమారు చెప్పినప్పటికీ అమ్మ దానికేమాత్రం స్పందించలేదు. అమ్మ తను చెప్పాలనుకున్నవి చెప్పి నేను చెప్పినవి విని ఫోన్ పెట్టేసింది.
ఒకటి రెండు రోజుల తర్వాత నా బ్యాంక్
అకౌంట్ చెక్ చేశాను. ఆ అకౌంట్ ఇప్పటిది కాదు. నా కాలేజీ రోజుల నుంచీ ఈ అకౌంట్ ఉంది. నాన్నే నా ఖర్చులకోసం అందులో డబ్బు కడుతుండేవారు. నేను ఉద్యోగంలో చేరడం, నా జీతం వివరాలువగైరా నాన్నకు తెలుసు. అందువల్ల ఇకమీదట నెల ఖర్చులకోసం నా అకౌంట్లో డబ్బులు కట్టరనే అనుకున్నాను. అంతేకాదు, ఇక నేనేమీ నాన్న డబ్బులకోసం చూడక్కర్లేదనే అహంకూడా తలకెక్కింది. అందువల్ల నా బ్యాంక్ అకౌంట్ లెక్కలను చూసుకోలేదు.
మొదటి నెల జీతం తీసుకుని అది తరిగిపోతున్న స్థితిలో నా ఖాతాలో ఏదన్నా పాత బ్యాలన్స్ ఉందాని ఈరోజు చెక్ చేశాను. అలా చూడగా ఎప్పట్లాగే ఆ నెల ముప్పయ్యో తేదీన అయిదు వేల రూపాయలను నాన్న ఎప్పట్లాగే నా ఖాతాలో కట్టారు. 
తర్వాతి నెలలలోనూ ఇలాగే కొనసాగింది. అంతేకాదు, ఆ సంవత్సరమూ ఎప్పట్లాగే దీపావళికి, సంక్రాంతికి, నా పుట్టింరోజుకి నేను ఇంటికి రావడానికి ముందరే బట్టలు ఇతరత్రా వంటివి కొనుక్కోవడం కోసం నాన్న డబ్బులు తన వంతుగా కడుతూ వచ్చారు. కానీ నేను...? చేతికి కాస్తంత జీతం డబ్బులు రావడంతోనే నా తీరు మారింది. కానీ, నాన్న అలానే ఉన్నారు.
నాన్న మారలేదు.
దేవుళ్ళందరూ ఓడిపోతారు నాన్న ప్రేమకు.
అమ్మ తన పరిధిలో చూడ్డానికి బయటకు బాగానే ఉంటుంది. ఇల్లంటే అలాగే ఉండాలి. కానీ ఆ ఇంటి పునాది నాన్న. ఆ పునాది బయటకు కనిపించదు. కానీ బలంగా ఉంటుంది. 
నేను వెళ్తున్న దారంతా మా నాన్న నాకు వేసిందే. నాకొచ్చే సంపదకు విత్తనం ఆయన తీరే.
చేతిలో నాలుగు డబ్బులాడేసరికి నేను మారిపోయాను.
కానీ నాన్న మారలేదు.
ఇలాటి నాన్నలు అనేకమంది. 
తమిళంలో చదివిన కథ ఇది. నేనా నాన్నలా లేను. ఎప్పటికప్పుడు వచ్చే జీతాన్ని ఇంటికి ఖర్చు పెట్టడంతోనే సరిపోయేది. కనుక సేవింగ్స్ అనేది లేకుండాపోయేది. ఇంట ప్రతి ఖర్చుకీ కొడుకే ఆధారం. కొడుకుని అడక్కూడదను కుంటూనే ఉంటాను. కానీ నేను నోరు విప్పి అడిగేలోపు వాడే ఇంటికి కావలసినవి తెచ్చిపెడుతున్నాడు. ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసి రిటైరైన నాకు ఇచ్చే పెన్షన్ అక్షరాలా 1338 రూపాయలు. అలాగే ఓ మాసపత్రికకు డిటిపి చేసి పెడుతుంటే వారిచ్చేది నెలకు వెయ్యి రూపాయలు. ఇక ఓ మాసపత్రికకు చిన్న పిల్లలకోసం రాసే కథకు వెయ్యి రూపాయలు ఇస్తారు. ఓ దినపత్రికలో ఓ నాలుగు వారాలు 220 మాటల చొప్పున రాస్తే ఓ రెండు వేలొస్తున్నాయి. ఎంత జాగర్తగా ఖర్చు చేసినా ఈ డబ్బులు ఇంటి అవసరాలకు సరిపోవు. ఉద్యోగ జీవితంలో అప్పు చేయకుండా ఎట్టాగో నెట్టుకొచ్చిన నేనిప్పుడు ఆ గీత దాటాను. నేనందుకే ఆ కథలోని నాన్నను కాను. కాలేను కూడా.

కామెంట్‌లు