తొణుకులు ;-చంద్రకళ. దీకొండమేడ్చల్-మల్కాజిగిరి జిల్లా

మనసులోని భావనలేగా

చేతలలో తేటతెల్లమయ్యేది

మనసులోని కల్మషమే

లోకమంతా వెదజల్లబడేది...!


మనసులో మాలిన్యం తొలగించు

మానవత్వ సుగంధం వెదజల్లు

మహిలో మనీషిగా జీవించు

ఆయురారోగ్యాలతో వర్ధిల్లు...!


పరదేశంలో గౌరవం తెచ్చేది

సంస్కారం ఉన్నప్పుడే రాణిస్తుంది

పరులు  దొంగిలించలేనిది

వినయంతోనే విద్య శోభిస్తుంది...!


ఆసక్తికి తగ్గ చదువు

వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది

ఆత్మవిశ్వాసం పెంచే చదువు

మేలైన భావికి బాట వేస్తుంది...!


ఆత్మనూన్యతను కలిగించకు

ఇతర పిల్లలతో పోల్చవద్దు

ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేయాలి

మార్కులే కొలమానం కావద్దు...!


అందరూ మేధావులే కాలేరు

ఎవరి ప్రతిభ వారిదే

అందరికీ మొదటి స్థానం రాదు

ప్రత్యేకత ఎవరిది వారిదే...!


ఆహారమేగా ఔషధము

లేనివారికి తిండే దొరకదు

ఆడంబరాలకై వృథా తగదు

ఉన్నవారికి తింటే అరగదు...!


అన్ని దానముల కన్న మిన్న

వృథా చేయకుము ఆహారం

అన్నదాత శ్రమఫలమది

అన్నార్తులకు పంచితే ఆనందం...!

************************************* 

కామెంట్‌లు