ఆలస్యం చేశాను!!;-- యామిజాల జగదీశ్
 నాకు శ్రీశా (శ్రీనివాస శాస్త్రి పురాణం) గారితో పరిచయం రెండు మూడు నెలలనుంచే. ఓ మూడు నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడి ఉంటాను. ఇంటికెళ్ళి ప్రత్యక్షంగా కలిసింది ఓ రెండంటే రెండుసార్లే. మొదటిసారి వారు తండ్రిగారైన ప్రముఖ రచయిత పురాణం సుబ్రహ్మణ్యంగారి గురించి తెలుసుకోవాలని కలిసాను. రెండవసారి కలయికలో బాలాంత్రపు రజనీకాంతరావుగారి సుపుత్రులు వెంకోబ రావుగారిని పరిచయం చేసుకోగలిగాను. తమ తండ్రిగారి గురించి వచ్చిన రెండు పుస్తకాలు, ఒక సిడి ఇచ్చారు వెంకోబరావుగారు. 
ఈ రెండు కలయికలలోనూ శ్రీశాగారు చెప్పారు  "ఈమారెప్పుడొస్తారో ముందుగా చెప్పండి...పాత్రికేయులు, రచయిత, కార్టూనిస్ట్, ఆర్టిస్ట్ మోహన్ గారి సోదరులైన పాత్రికేయుడుతాడి ప్రకాష్ గారిని పరిచయం చేస్తాను" అని గట్టిగానే చెప్పారు. అలాగే అన్న నేను ప్రకాష్ గారిని కలవనేలేదు. శ్రీశాగారు మాటను విన్నానేగానీ కార్యరూపమివ్వడంలో ఆలస్యం చేశాను. 
ఈమధ్యలో తల్లావజ్ఝల లలితాప్రసాద్ తాడి ప్రకాష్ గారి వ్యాసాలు కొన్ని పంపారు నాకు. ఆసక్తికరమైన ఆ వ్యాసాలు చదువుతుంటే ప్రకాష్ గారిని కలవాలనే ఆశ పుట్టింది. కానీ ఆయన రచనల ముందు నేను చాలా చిన్నవాడినవడంతో ముఖతా కలవడానికి ఒకింత వెనుకబడ్డాను. ఆ వెనుకబాటే ప్రకాష్ గారిని ఈరోజు వరకూ కలవనే లేదు. మా భేటీ అయ్యేలోపు శ్రీశాగారు ఇకలేరన్న దుర్వార్త పాత్రికేయులు గోవిందరాజు చక్రధర్ గారివల్ల తెలిసింది. దాంతో అనుకోని ఆలస్యాన్ని తలుచుకుంటుంటే ఇటీవల చదివిన ఓ రష్యన్ కథ గుర్తుకొచ్చింది. రచయిత ఎవరో తెలీదు. 
ఆర్మిలో పని చేస్తున్న తన అల్లుడిని కలవడానికి మామయ్య ఊరు నుంచి వస్తారు. ఆర్మీ క్యాంపుకొచ్చిన ఆ మామయ్యను కూర్చోమని చెప్పిన అల్లుడు పని ఒత్తిడిలో మునిగిపోయి మ మయ్య సంగతే మరచిపోయారు. చాలాసేపు నిరీక్షించిన మామయ్య ఊరుకెళ్ళిపోతారు. 
విధులు ముగించుకుని రాత్రి ఇంటికొచ్చిన ఆ అల్లుడికి అపపుడు గుర్తుకొస్తారు మామయ్యతో అసలు మాట్లాడనేలేదన్న విషయం. మరుసటి రోజు పొద్దున్నే అల్లుడు మామయ్యను చూడటానికి పొరుగూరుకి వెళ్తాడు. అయితే అతను మామయ్య ఇంటికి వెళ్ళేసరికే ఓ విషాదవార్త వినవలసి వచ్చింది. అక్కడున్న వారొకరు చెప్పారు "మిమ్మల్ని కలవడంకోసం వచ్చిన మీ మామయ్య అదే రోజు రాత్రి ఇంటికొచ్చిన కాస్సేపటికే మరణించారన్నదే ఆ విషాద వార్త"
అప్పుడా అల్లుడు ఎంతగానో బాధపడతాడు. మామయ్య తనను కలిసి చెప్పదలచుకున్న మాటేంటో తెలీలేదు, అయ్యో ఎంత తప్పు చేశానో తాను అని తెగ కలత చెందుతాడు. కానీ ఇప్పుడెంతనుకున్నా ఏం లాభం? జరిగిపోయిన క్షణాలు మళ్ళీ రావుగా.
ఇలాటివి నిజంగా బాధకరమే. దగ్గరున్నప్పుడేమో విలువ తెలీదు. అంతెందుకూ....ఇంట్లోనూ అంతే. మిత్రుల మధ్యా అంతే. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుని వస్తే వినేందుకు మనసుండదు. పెద్దలు చెప్పే మాటలు వినడానికి పిల్లలకు ఓపికుండదు. పిల్లలు చెప్తే మనమెందుకు వినాలనుకుంటారు పెద్దలు. ఈ వైఖరితో కథలు చెప్పేవారున్న వినేవారి కొరతతో కథలు వందలూ వేలూ లక్షలూ ఎక్కడికక్కడ దాగిపోతున్నాయి. అందుకే ఎప్పుడేమో కానీ ఆలస్యం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చలేం. ఓదార్చనూ లేం. ఆలస్యం ఆవేదనే. అనుకున్నదే తడవుగా చేసేయడమే మంచిది ఏపనైనా!! అంతేతప్ప మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే ఏదీ అవదు. 


కామెంట్‌లు