: రుధిర తారలు;-అల్లాడి వేణుగోపాల్-కలం స్నేహం
నరరూప బకాసురుల ధృతరాష్ట్ర కౌగిళ్ళలో
నలిగి కనుమరుగవుతున్న కానలు...కొండలు
కరుణకు తావులేని ధనాంధుల దుశ్చర్యలతో
కరిగి నిర్వీర్యమవుతున్న శ్రామికుల కండలు

అంతరిక్షాన్ని దాటుతున్న అంతస్తులను చూసి
అదిరిపడి నోరెళ్ళబెడుతున్న జాబిలి..తారలు
కడలిలోని కష్టజీవి గాయాల కాయం నుండి
పుడమి తల్లిని అభిషేకిస్తున్న రుధిర ధారలు

నిట్ట నిలువునా దోచుకునే గుంటనక్కల మధ్య
పట్టు కోల్పోయి ముక్కలవుతున్న రెక్కలు
పొట్ట చేత పట్టుకుని దేబిరించే అభాగ్యునికి
పట్టపగలే కనిపిస్తూ వెక్కిరిస్తున్న చుక్కలు

పటిష్ఠత సంతరించుకున్న పునాదుల కొరకై
పిట్టలలా దారుణంగా రాలుతున్న అనాథలు
కీర్తి సౌరభాలను వినువీధులలో వెదజల్లుతూ
మట్టిపరిమళాలను ఆస్వాదించే సమాధులు

నింగిని తాకే మేడను సూక్ష్మదృష్టితో స్పృశిస్తే
మింగుడుపడని విషాద రాగాన్ని వినిపిస్తుంది
రంగుల హంగుల భవంతి గోడలను పరిశీలిస్తే
ఖంగుతిన్న కార్మికుని నీడ లీలగా కనిపిస్తుంది


కామెంట్‌లు