వెతకకు;-కాకరపర్తి పద్మజ- కలం స్నేహం
కలల నింగిన వెలుగు చుక్క లా 
నీడై వెంటాడుతావు
కనుమరుగు లేని తలపుల వింజామరలతో సేద తీరుస్తావు
ఆవిష్కరించలేని మనో ఊహల తల్పం పై శయనిస్తూ
ఊసుల ఉద్రేకాలతో నను ప్రేరేపిస్తావు

ప్రేమ విత్తువై కనుల కమతాన అంకురించి
మది హలంతో  వయసు నీటిని రంగరిస్తూ
పరవశాల ఎరువుతో  వలపు పంట పండిస్తావు
ముద్దుల కాసుల ఒప్పందంతో…
సొగసు దళారి చేతిలో ఓడి పొమ్మంటావు

వాడని వసంతమల్లే…
చిగురించే

సిగ్గులకు పగ్గమేస్తూ
మధురపు ఊటల మత్తులో
అధరాల చిరు నగవులను దోచేస్తావు

మూసిన రెప్పల కౌగిలిలో నలిగిపోకలా
ఊపిరి ఉనికిని వెతికే క్రమంలో…
కురుల గుహలో అన్వేషిస్తూ…
నిన్ను నాలో దాచిపెట్టి… నన్ను నీలో వెతకకు.

కామెంట్‌లు