నాతో నేను;-సావిత్రి రవి దేశాయ్--కలం స్నేహం
మాట్లాడాలని ఉంది ....
 ఈ మధ్య కాలం లో మాట్లాడలేదు కదా ...
హితులతోనో, సన్నిహితులతోనో
బంధువులతోనో, చుట్టాల్లతోనో కాదు
నాతో నేను నాలో నేను మాట్లాడుకోవాలి 

వరుస విజయాలతో, అహంకారపు మొలక
మదిలో నాటుకొని, మహా వృక్షం కాకముందే
ఒకసారి మాట్లాడి, ఆ చిరుమొలకను
వేలి కొనగోటితో గిల్లయ్యాలి, మరొకరు
గొడ్డలితో వచ్చే అవకాశం ఇవ్వకుండా........

పక్కవాళ్లు ఎదిగిపోతుంటే,
ఏనాడో ఎండిపోయిందనుకున్న
అసూయా వృక్షం లేచిగుళ్ళు వేస్తుంటే,
ఒకసారి మాట్లాడి ఎదగానీకుండా 
పెంచి పోషించే కుళ్ళు కు అడ్డుకట్ట వేసి
ఎలాగోలా నశింపజేయాలి....

అకారణ ద్వేషంతో రగిలిపోయే 
మనసును ఒకసారి పలకరించి బుజ్జగించి
మదిని బీటలు వారకుండా 
ప్రేమామృతాన్ని కురిపించి
శాంతితో స్వాంతన పరిచి
నాతో నేను మాట్లాడి,
ప్రశాంతంగా పవళించాలని  ఉంది......


కామెంట్‌లు