భారతియార్ ......;-- యామిజాల జగదీశ్
 జాతీయ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతియార్ కుటుంబం పేదరికంలో కూరుకుపోయినప్పుడు ఆయన చుట్టూ ఉన్న సమాజం చూసీచూడనట్టు మిన్నకుండిపోయింది.
భార్య చెల్లమ్మాళ్ భుజం మీద చేయేసి భారతియార్ నడిచివెళ్తుంటే "ఇదిగో పిచ్చోడు పోతున్నాడు" ఆని చెల్లమ్మాళ్ కు వినిపించేటట్లుగా మాటలంటూ హేళనగా నవ్వుకునేవారు.
భారతియార్ భోజనం చేసే పద్ధతి విచిత్రంగా ఉండేది. తినడంకోసం కూర్చునేటప్పుడుకూడా ఓ మహారాజులా నేలమీద కూర్చునేవారు.
బొటనువేలు, మధ్యవేలు, ఉంగరం వేలు మాత్రమే తినేటప్పుడు ఉపయోగించేవారు.
ఆయనకెంతో ఇష్టం నిప్పుమీద కాల్చిన అప్పడం.
పేదరికంలో మగ్గుతుండటం వల్ల నెలలో పది రోజులే ఏదైనా కూరంటూ చేసుకుని తినేవారు. మిగిలి రోజుల్లో నిప్పులో కాల్చిన అప్పడమే అన్నంలోకి.
భారతియార్ పార్థసారథి ఆలయ ఏనుగు దాడిలో గాయపడి ఆరోగ్యం క్షీణించి మరణించినట్టు చాలా కాలం పాఠ్యపుస్తకాలలో తప్పుగా ఉండేది.
ఏనుగు దాడిలో గాయపడిన రోజున భారతియార్ కొబ్బరికాయ, పళ్ళు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కొందరు ఏనుగు దగ్గరకు వెళ్ళవద్దంటూ ఆయనను హెచ్చరించారు.
కానీ భారతి వారి హెచ్చరికను పట్టించుకోక ఏనుగు దగ్గరకు వెళ్ళినప్పుడు మొదట అది ప్రశాంతంగానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఏనుగు తన తొండంతో భారతియార్ నడుంపైన చుట్టి తన కాళ్ళకిందకు విసిరేసింది.
అయితే రెప్పపాటు కాలంలో కువళైకణ్ణన్  (భారతియార్ స్నేహితుడు, పుణ్యాత్ముడు) ప్రాణాలకు తెగించి ఏనుగు కాళ్ళ మధ్యకెళ్ళి భారతియారుని భుజంమీద వేసుకున్నారు. ఏనుగు తలచుకునుంటే కాళ్ళమధ్య ఉన్న ఇద్దరినీ తొక్కి పచ్చడి చేసేదే. కానీ తాను చేసింది తప్పని తెలుసుకుందో ఏమో గానీ ఏనుగులో ఏ చలనమూ లేదు. అటూ ఇటూ కదలక నిల్చుండిపోయింది ఏనుగు.
కింద పడిపోతున్నప్పుడు తలపాగా ఉండటంవల్ల తల వెనుక భాగాన అంతగా గాయమవలేదు. కానీ గరుకు నేలమీద పడటంతో ముఖమూ ముఖానికి భుజానికి మోచేతికి మోకాళ్ళకూ బలమైన గాయాలై రక్తం కారి స్పృహకోల్పోయారు భారతియార్.
గాయపడిన కవిని రాయపేట ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు ఆయన మిత్రుడు శ్రీనివాసాచార్య.
పగవాడినైనా ప్రేమించు అని చెప్పిన భారతియార్ తనపై దాడి చేసిన ఏనుగుపై పగ పెంచుకున్నారా? అంటే లేదనే చెప్పాలి? 
ఆస్పత్రిలో చికిత్సానంతరం స్పృహలోకొచ్చిన ఆయన "ఏనుగు చిరునామా తెలియక నాపై పొరపాటున దాడి చేసింది. ఏదేమైనా దానికి నా పట్ల జాలి ఒకింత ఎక్కువగానే ఉంది. లేకుంటే నన్ను ప్రాణాలతో విడిచిపెట్టేదా?" అని అన్నారు.
క్రమేణా అవయవాల గాయాలు తగ్గడం మొదలైంది. భారతియార్ అయిదారు నెలలు సుదేశమిత్రన్ ఆఫీసుకి వెళ్ళి పని చేశారు.
గాయాలు తగ్గినప్పటికీ కొత్త జబ్బు తలెత్తి అవస్థపడ్డారు భారతియార్. విరేచనాలు మొదలై మనిషి నీరసించిపోయారు. మళ్ళీ అదే రాయపేట ఆస్పత్రిలో చేరారు. 

సెప్టెంబర్ 11న అర్ధరాత్రి దాటక రెండు గంటల ప్రాంతలో ఆయన కాలధర్మం చెందారు.
కువళై కణ్ణన్, లక్ష్మణ అయ్యర్, హరిహర శర్మ, సురేంద్రనాథ్ ఆర్యా, బరువెక్కిన హృదయంతో  నెల్లయప్పర్ ఆ జ్ఞానసూర్యుడి భౌతికకాయాన్ని మోసుకుపోయి కృష్ణమాపేట శ్మశానవాటికకు చేరుకున్నారు. అంతిమయాత్రలో మరో పదకొండు మంది పాల్గొన్నారు. కొరివిపెట్టడానికి కొన్ని క్షణాల ముందర అక్కడే ఓ నివాళి కార్యక్రమం సాగింది. భారతియార్ కీర్తిని సురేంద్రనాథ్ ఆర్యా జ్ఞాపకం చేసుకోగా హరిహర శర్మ చితికి నిప్పంటించారు.


కామెంట్‌లు