పద్మిని ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 ప్రముఖ నటి, నర్తకి అయిన "నాట్యపేరొళి" గా వినుతికెక్కిన పద్మిని గురించి కొన్ని సంగతులు....
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పూజాపురం ప్రాంతంలో 1932 జూన్ నెలలో జన్మించారు. పద్మిని తల్లిదండ్రులు తంగప్పన్ పిళ్ళై, సరస్వతి అమ్మ.
పద్మిని పెద్దమ్మకు మలయాలో రబ్బర్ తోటలుండేవి. మరొక పెద్దమ్మ తిరువాంకూర్ మహారాణి సోదరుడి సతీమణి.
 
పద్మిని అక్కచెల్లెళ్ళకు ఓ సోదరుడు ఉన్నారు. పేరు చంద్రశేఖర్. 
పద్మిని వివాహం 1961లో డాక్టర్ రామచంద్రన్ తో జరిగింది.
అనంతరం 1977లో అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డ పద్మిని అక్కడే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే సంస్థను నెలకొల్పి నాట్యం నేర్పించారు.
పద్మినీ నాలుగో ఏట నుంచే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. తొలుత తిరువాంకూర్ నాట్యాచార్యులు గోపీనాథ్ దగ్గర శిక్షణ పొందారు. కథకళి, భరతనాట్యం, మణిపురి డ్యాన్స్ లోనూ పద్మిని తర్ఫీదు పొందారు.
17 వ ఏట సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు ఉదయశంకర్ వెండితెరకెక్కించిన "కల్పన" అనే హిందీ సినిమాలో పద్మినికి అవకాశమిచ్చారు.
అయితే అక్కచెల్లెళ్ళు లలిత, పద్మిని, రాగిణి నాట్యం చేసి విడుదలైన తొలి చిత్రం కన్నికా (1947). ఈ సినిమాలో శివమోహిని వేషధారణలో ఆమె నృత్యం చేశారు. అనంతరం వేదాళ ఉలగం సినిమాలో నాట్య సన్నివేశంలో అమోఘంగా నటించారు.
ఎన్. ఎస్. కృష్ణన్ రూపొందించిన మనమగళ్ చిత్రంలో నటించారు. అలాగే సిలోన్ థియేటర్స్ వారి " కబాడీ అరట్చకాయా " అనే సిన్హళ సినిమాలోనూ నటించిన పద్మిని శివాజీ గణేశన్, ఎంజిఆర్, జెమినిగణేశన్ల సరసన నటించారు 
మొత్తంమీద రెండు వందల యాభైకిపైగా చిత్రాలలో నటించిన పద్మిని థిల్లానా మోహనాంబాళ్ చిత్రంలో పోషించిన మోహనాంగి పాత్రలో జీవించారనడం అతిశయోక్తి కాదు.ఈ సినిమాలో శివాజీ సిక్కల్ షణ్ముగం పాత్ర పోషించారు.
1948 ఆగస్టు నెలలో విడుదలైన వేదాళ ఉలగం సినిమాలో అక్కచెల్లెళ్ళు లలిత  - పద్మినిల నాట్య సన్నివేశాలు. 
ఎంజిఆర్ తో కలిసి  పద్మిని నటించిన చిత్రాలలో మదురై వీరన్ ప్రముఖమైనది. ఇదే సినిమాలో భానుమతికూడా నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్.
పద్మిని వివాహం కేరళలోని గురువాయూర్ ఆలయంలో 1961 మే 25వ తేదీన జరిగింది. ఆమె భర్త డాక్టర్ రామచంద్రన్. 
కేరళలోని తలైచ్చేరికి చెందిన రామచంద్రన్ చెన్నై మెడికల్ కాలేజీలో చదువుకున్నారు.
ఆలప్పుయైలో ఆయనకు ఓ క్లినిక్ ఉండేది. పెళ్ళయిన తర్వాత నటించనని చెప్పినప్పటికీ పరిస్థితుల కారణంగా  పద్మిని కొన్ని సినిమాలలో నటించారు.
శివాజీతో కలిసి 59 సినిమాలలో నటించిన పద్మిని ఎంజిఆర్ తో డజన్ సినిమాలు, జెమినీగణేశన్ తోనూ డజన్ సినిమాలలో నటించారు.
ఎంజిఆర్ - మంజుల జంటగా నటించిన రిక్షాకారన్ సినిమాలో పద్మిని క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించారు.
అమెరికాలోని న్యూజెర్సీలో భర్త డాక్టర్ రామచంద్రన్ సొంతంగా ఓ ఆస్పత్రి నిర్వహించడంతో పద్మిని అక్కడే స్థిరపడవలసి వచ్చింది. ఆమె కూడా ఓ నాట్యాలయాన్ని ప్రారంభించి ఎందరికో నాట్యం నేర్పించారు. 1981 సెప్టెంబర్ 17వ తేదీన భర్త రామచంద్రన్ గుండెపోటుతో మరణించారు.
భర్త మరణానంతరం పద్మిని పట్టుదలతో కొడుకుని ఉన్నత చదువులు చదివించారు.
కొడుకు ప్రేమానంద్ అమెరికా నుంచి వెలువడే టైమ్ ఆంగ్ల పత్రికలో పని చేశారు.
ఇతనికి కేరళకు చెందిన డాక్టర్ తోనే పెళ్ళయింది. వీరికి ఓ కొడుకు. 
కేరళలో సుప్రసిద్ధ దర్శకుడు అయిన ఫాజిల్ 1985లో పూవే పూచ్చూడవా అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో 
హీరోయిన్ గా నదియా పరిచయమవగా నదియాకు బామ్మగా పద్మిని నటించారు. 
పద్మిని నటించిన చివరి సినిమా ఇది. నటి శోభన పద్మిని సోదరుడి కుమార్తె. పద్మిని భర్త రామచంద్రన్ సోదరులలో ఒకరి కుమారుడే నటుడు వినీత్.
1954లో విజయవంతమైన చిత్రాలలో ఒకటైన తూక్కుత్తూక్కి సినిమాలో శివాజీతో కలిసి అక్కచెల్లెళ్ళు ముగ్గురూ ( లలిత, పద్మిని, రాగిణి ) నటించడం విశేషం. ఈ సినిమాలో కురంగిల్ ఇరుందు పిరన్దవన్ మనిదన్ (కోతి నుంచి పుట్టాడు మానవుడు) అనే పాటకు శివాజీ, పద్మిని, రాగిణి కలిసి నటించారు.
పదో ఏట అరంగేట్రం చేసిన పద్మిని అక్కయ్య లలిత, చెల్లి రాగిణి కూడా నర్తకీమణులూ. నటీమణులు. ఈ ముగ్గురినీ తిరువాంకూర్ సోదరీమణులు అని పిలిచేవారు.
తమిళ సినిమాలలో మూవేందర్గళ్ గా ప్రసిద్ధి పాందిన ఎంజిఆర్, శివాజీ, జెమినీగణేశన్ లతో నటించి అందరి మన్ననలూ పొందారు పద్మిని. ఈ ముగ్గురు హీరోలతో నటించిన సినిమాలు 1953, 1956, 1957, 1958, 1960, 1971 సంవత్సరాలలో విడుదలై అన్ని వర్గాల మన్ననలు పొందారు పద్మిని.
హిందీ సినీ లోకంలో తన అందంతోనూ అద్భుత నాట్యంతోనూ కట్టిపడేసిన పద్మిని అశోక్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద, సంజీవ్ కుమార్ తదిత‌ర హీరోలతో నటించారు.
తమిళంలో వంజికోట్టయ్ వాలిబన్ సినిమాలో వైజయంతిమాలతో పోటీపడి చేసిన నాట్య సన్నివేశాన్ని ఇప్పటికీ ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటారు. ఆ నాట్య సన్నివేశంలో ఆమె మోకాలు నేలకు ఒరుసుకుపోయి రక్తం కారింది.  అయినప్పటికీ ఆ బాధను భరించి అలాగే నాట్యం చేసిన పద్మిని పట్టుదల అమోఘం.
నాట్యసుందరిగానూ మేటి నటిగానూ అభిమానుల హృదయాలలో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్న పద్మిని 2006లో కన్నుమూశారు. అప్పుడామె వయస్సు 74 ఏళ్ళు.కామెంట్‌లు