మానసవీణ- మధుగీతం;-ఇందిరా తుంగ;-కలం స్నేహం
నిదురపోయే నదులన్నీ
ఒక్కసారిగా కదిలిన మాదిరి..
వయసు చిగురించే వసంతంలా...
వలపు పొంగెను ఉప్పెనలా....
ఈ ముద్దుగుమ్మలిద్దరి 
మానసవీణ మధుగీతం పాడుతోంది....

మరుమల్లెలు పూసేకాలం,
పండు వెన్నల కాసేవేళ 
ఈడు నిదురపోనీయదుగా!?
తొలకరి కోరికలు తొందర పెడుతున్నాయి...
సొగసరి కానుకలు గుసగుసలాడుతున్నాయి...
తనువు తహ తహ లాడగా
ఈడు- జోడైన తమ వాడికోసం
ఊహలోకంలో పడిగాపులు
కాస్తున్నారు....

సందెగాలులు సరిగమలు పలుకగా
ఎదకోయిల రాగాలుతీసి పాడుతోంది... 
పాటవిన్న మల్లెలన్నీ తుళ్లిపడి నవ్వగా...
యవ్వనం అందని పొందులో విందుచేసుకుంటోంది...

కానరాని కలల రాకుమారుడు
కన్నుల కాటుకవ్వాలని...
వెన్నలకు జాబిలిలా తోడవ్వాలని..
ఆశల అందాల బృందావనంలో
పూలు పూయించాలని....
హృది పలికే గీతికకు
జీవన రాగామవ్వాలని..
మనసున మమతై ముడిపడాలని..
గుండె గుడిలో ఆరాధ్య దైవంగా
వెలుగొందాలని....
సుందర స్వప్నాల తీరంలో
విహరిస్తున్నారు....
హృదయ సేద తీరగా.


కామెంట్‌లు