వీణై ఎస్. బాలచందర్ ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 ఎస్. బాలచందర్ అనగానే స్ఫురించే మాట వీణై (వీణను తమిళంలో వీణై అంటారు) బాలచందర్ అనే! 
వీణ విద్వాంసుడు, సినిమా దర్శకుడు, తమిళ సినిమాలో ఉన్నత సంగీత దర్శకుడు, గాయకుడు అంటూ బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఎస్. బాలచందర్ (S.Balachander) గురించి కొన్ని సంగతులు....
ఆయన 1927 లో మైలాపూరు ( చెన్నై )లో జన్మించారు. సుందరం అయ్యర్, చెల్లమ్మాళ్ దంపతులకు ఈయన అయిదో సంతానం.
సంగీతం అంటేనూ, కళలంటేనూ ఎంతో ఆసక్తి ఉన్న ఈయన తండ్రి మైలాపూరులో ఉండేవారు. వీరింట సంగీత కార్యక్రమాల కోసం ఒక పెద్ద హాలుని కేటాయించారు.
 ఇక్కడ అరియకుడి రామానుజం అయ్యంగార్, మదురై మణి అయ్యర్, ముత్తయ్య భాగవతార్, పాపనాశం శివన్ వంటి ప్రముఖుల సంగీత కార్యక్రమాలు తరచూ జరుగుతుండేవి. ఈ వాతావరణంలో పుట్టి పెరిగిన బాలచందర్ తన అయిదో ఏటనే కర్నాటక సంగీతంపట్ల ఆకర్షితులయ్యారు. 
ఆయన తానుగానే కంజీరా వాయించడం నేర్చుకున్నారు. అంతేకాదు, అనతికాలంలోనే సభలలోనూ ఆలయాలలోనూ నిర్వహించే కచేరీలలో ఆయన కంజీరాపై సహకరించడం మొదలుపెట్టారు.
ఆయన పదో ఏట సినీ ప్రపంచంలోకి ప్రవేశించారు. 1933లో విడుదలైన సీతా కల్యాణం అనే సినిమాలో కంజీరా వాయించే కుర్రాడి పాత్రలో నటించారు. అనంతరం ఆరాయ్ చ్చి మణి, కామధేను, రుష్యశృంగర్, నారదన్ తదితర చిత్రాలలో బాలనటుడిగా నటించారు.
సీతా కళ్యాణం సినిమాకు ముందు ఆయనకు నటించే అవకాశం రావడం వెనుక ఓ కథ ఉంది. 1932లో ప్రముఖ బెంగాలీ దర్శకుడు శాంతారాం లో - బడ్జెట్ సినిమా రూపొందించాలనుకున్నారు. ఓ మిత్రుడి ద్వారా ఈయన తండ్రి సుందరం అయ్యర్ కి కబురుపెట్టారు. ఆ సినిమాలో సుందరం అయ్యర్ పెద్ద కొడుకు రాజం, అలాగే కుమార్తె నటించేందుకు మాటలు జరిగాయి. సీతా కల్యాణం సినిమాలో సుందరం అయ్యర్ కూడా ఓ పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగులకు కుర్రాడైన బాలచందర్ కూడా వెళ్తుండేవారు. ఓరోజు షూటింగ్ చూస్తున్న ఆయన పెద్ద గొంతేసుకుని ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకేడుస్తున్నావని అడగ్గా "నేనూ నటిస్తా"నని గోల చేశారు. 
అప్పుడు శాంతారాం  ఆయనను దగ్గరకు తీసుకుని "నీకేం తెలుసు?" అని అడగ్గా తనకు తెలిసినదల్లా చెప్పారు. ఆయన చెప్పినదంతా విన్న శాంతారాం "సరే, రావణుడి సభలో కంజీరా వాయించు" అని బాలచందర్ ని పది మందిలో ఒకడిగా కూర్చోపెట్టారు. అలా బాలచందర్ సినీ జీవితం మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణ ముగింపులో శాంతారాం ఆయనకు తబలా సెట్ ఇచ్చి దీవించారు.
వీణ‌, తబలా, మృదంగం వంటి వాయిద్యాలను తానుగానే వాయించడం నేర్చుకున్నారు.
పన్నెండో ఏటనే సితార్ సోలోగా కచేరీ చేసే స్థాయికి ఎదిగారు.
అయితే వీణలో ప్రత్యేక కృషి చేస్తూ వచ్చిన ఈయన రెండేళ్ళల్లోనే గురువుగారి సహకారం లేకుండానే వేదికలపై వీణానాదం పలికించడం మొదలుపెట్టారు. 
కర్నాటక సంగీతంలోనే కాక హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతంలోనూ నైపుణ్యం గడించిన బాలచందర్దేశ విదేశాలలో కచేరీలు చేస్తూ వచ్చారు. అలాగే ఆయన సంగీతంతో గ్రాంఫోన్ రికార్డులు వెలువడ్డాయి.
మేజిక్ మ్యూజిక్ ఆఫ్ ఇండియా, సౌండ్స్ ఆఫ్ వీణ వంటి ఆయన గ్రాంఫోన్ రికార్డులకు విశేష ఆదరణ లభించింది. ఇవి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయాయి. 
1948లో "ఇదు నిజమా" (ఇది నిజమా) అనే సినిమాలో ఆయన హీరోగా నటించారు. ఇది దయ్యాల సినిమా. ఆ తర్వాత వెంట వెంటనే సినిమా ఆఫర్లు వచ్చాయి. దేవకి, రాజాంబాళ్, రాణి, ఇన్ స్పెక్టర్, పెన్ (స్త్రీ), కోటీశ్వరన్, తదితర సినిమాలలో నటించారు.
1960లలో ఆయన దర్శకుడిగా మారారు.ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలకు ఆయనే సంగీతమూ సమకూర్చారు.
ఇదు నిజమా, ఎన్ కనవర్ (నా భర్త), డాక్టర్ సావిత్రి, భూలోక రంబై తదితర సినిమాలకు దర్శకత్వం వహించడమే కాక సంగీతమూ సమకూర్చారు. నటించారు.
ఆయన దర్శకత్వం వహించిన అంద నాళ్ (ఆ రోజు) సినిమా సూపర్ డూపర్ హిట్. 
అనంతరం, అమరన్, అవనా ఇవన్ (వాడా వీడు), బొమ్మై, నడు ఇరవిళ్ తదితర థ్రిల్లర్ సినిమాలకు దర్శకత్వం వహించారు.
సినిమాలలో నటుడిగా సంగీత దర్శకుడిగా నేపథ్యగాయకుడిగా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన ఎస్. బాలచందర్ పొందిన అవార్డులూ రివార్డులూ అనేకం. వాటిలో పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ పురస్కారం, సంగీత కళాశిఖామణి, ఫైన్ ఆర్ట్స్ సొసైటీ పురస్కారం వంటివి కొన్ని.
తమిళ సినీ జగత్తులో దాదాపు అయిదు దశాబ్దాలు కొనసాగిన ఎస్. బాలచందర్ 1990 లో " కాలం చేశారు " . అప్పుడాయన వయస్సు అరవై మూడేళ్ళు.కామెంట్‌లు