గీతాంజలి ;--రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 16. "ప్రపంచోత్సవ అతిధిని "
సృష్టి అందాన్ని అనుభవించగలిగే విధంగా, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగే విధంగా, మిగతా జీవులకు భిన్నంగా జ్ఞాననేత్రాన్ని యిచ్చి మనిషిని పుట్టించావు భగవాన్.
నేనూ ఈ అనంతప్రపంచ మహోత్సవానికి అతిధిగా ఆహ్వానించబడ్డవాణ్ణి. నీ ఆహ్వానంతో జన్మించి నా కళ్ళతో నీ సృష్టి అందాలన్నీ చూశాను. నీ సృష్టి ఔన్నత్యాన్ని పెద్దలు చెబుతుంటే నా చెవులతో విన్నాను. అద్భుతమైన మీ సృష్టి మహోత్సవంలో నువ్వు నాకు అనుగ్రహించిన జ్ఞానంతో ఆడాను, పాడాను, నా పాత్రను నేను నిర్వహించాను. అలా నా జీవితఉత్సవం సఫలమైంది. ఇప్పుడు నీ సృష్టి గురించి కాకుండా, 'నిన్ను' గురించి యోచిస్తూ, నీ అసలు శోభను నా మనోనేత్రంతో దర్శించి మరే కోరికలు లేని మౌనప్రణామాన్ని నీకు చేసుకోగలిగే భాగ్యానికై వేడుకొంటున్నాను ప్రభూ....
              

కామెంట్‌లు