మనసు! అచ్యుతుని రాజ్యశ్రీ

 యశోపురరాజు  ధర్మాత్ముడు  ప్రజారంజకుడు.కానీ దేశం కరువుకాటకాలతో అల్లాడి  ఆర్ధికంగా చితికిపోయింది.ప్ర జలుపన్నులు కట్ట లేకపోయినా  చూసి చూడ నట్లుగా ఊరుకున్నాడు. జనం రాజు కి అండగా ఉన్నా ప్రకృతి భీభత్సం తో వేరే రాజ్యాలకి తరలిపోసాగారు.పొరుగు రాజు  అదే అదునుగా తీసుకుని  దండెత్తాడు.సరైన తిండి తిప్పలు లేక సైనికులు పోరాడి బందీలుగా చిక్కారు.తన వల్ల చాలా మంది హతం కావటం ఇష్టం లేని రాజు  కొంత మంది  అంగరక్షకులను తీసుకుని ఒక అడవిలో తలదాచుకున్నాడు.తను బతికి ఉంటేనే కదా తిరిగి రాజ్యం దక్కించుకుని తన జనాలను పోషించుకోగలడు.సైనికులను సమీకరించి శత్రువు అంతం చూడాలి అని అజ్ఞాతవాసం లో ఉన్నాడు.సాయంసంధ్యాసమయం!ఒక పూరిగుడిసె ముందు ఆగాడు. అతని పరివారం తలా ఒక చోట తలదాచుకుంది. ఆపూరిపాకలో వృద్దదంపతులున్నారు."ఎవరునాయనా!బాగా అలసిపోయి నట్లుగా ఉన్నావు?లోపలికి రా!"ఆప్యాయంగా ఆహ్వానించారు. అవ్వరొట్టెలు చేస్తోంది. "తాతా!ఈరాత్రికి ఇక్కడ పడుకోనిస్తావా?"సామాన్య దుస్తులలో ఉన్న అతను రాజు అని గ్రహించలేదువారు."దానిదేంభాగ్యం నాయనా!బైట చిన్న చితక పుల్లలు ఏరుకొస్తాను.పొద్దుటే గంజి కాచటానికి కావాలి. నాకొడుకు రాజు సైన్యంలో చేరాడు.అబ్బాయి కి రెండు రొట్టెలుపెట్టు"తాత భార్య తో అన్నాడు. "నాయనా తిను.నాకొడుకు వచ్చాడనుకుంటాను."అవ్వ తమకోసం చేసిన రొట్టెలు అతని ముందు పెట్టి చింత చిగురు చట్నీ వేసింది."అవ్వా!మరిమీకో?" "నాయనా!మేము రాలిపోయే పండుటాకులం.తిన్నా తినకపోయినా ఫర్వాలేదు.నీవు  వయసులో ఉన్న వాడివి.మన రాజ్యరక్షణభారం నీలాంటి యువకులమీదే ఉంది. మన రాజు ధర్మాత్ముడు. ఆయనను కాపాడమని దేవుడిని వేడుకుంటున్నాము" "నాకు రెండు రొట్టెలు చాలు అవ్వా!" "ఫర్వాలేదు బాబూ!మళ్ళీ చేస్తాను.ఈరొట్టెలు వత్తిపెట్టాను.పెనంపైన కాల్చు.బైట మేకపాలు పిండితెస్తాను.వేడిచేశాక తాగుదువుగాని"అని అవ్వ ముంతతీసుకుని మేకలదగ్గరకు వెళ్లింది.తనకు పాలు పితకటంరాదు.పెనంపైన రొట్టె కాల్చటం తేలిక అనుకున్నాడు.తాను రొట్టె తింటూ భవిష్యత్తుని గూర్చి ఆలోచిస్తూ రొట్టె పెనంపైన మాడటం గమనించలేదు. ఇంతలో  అవ్వ పాలముంతతో లోపలికి వచ్చి "అయ్యో నాయనా!రొట్టెమాడ్చావు.నేను తాత  ఏంతింటాము?"అని అరిచింది. ఉలిక్కిపడినరాజు పెనంపై మాడిన రొట్టెలనుచూసి సిగ్గు పడ్డాడు. ఆకలితో నకనకలాడుతూ  ఆదంపతుల రొట్టెలు మాడ్చి మసిచేశాడు."అవ్వా!పళ్లు దొరుకుతాయా ఇక్కడ?""ఈచీకట్లో  ఎక్కడ వెతుకుతావు?మాఇంట్లో రొట్టెపిండి కూడా ఐపోయింది.సర్లే!పాలు కాచి ఇస్తాను.తాగు""వద్దు  అవ్వా!తాత ఇంకా రాలేదు."అని రాజు  బైట  చితుకులు పోగుచేసి పాలుకాచి అవ్వ కిచ్చాడు.ఇంతలో తాత కూడా వచ్చాడు."తాతా!ఈపూటమీకు పస్తే!ఇంద ఈపాలు తాగు.నేనే స్వయంగా కాచాను"రాజు ఇచ్చిన పాలగ్లాసు అందుకుంటాడు తాత. "నాయనా!నీలో మాకొడుకుని చూసుకుంటున్నాం.నీవు రాజు సైన్యంలో చేరి మనదేశం ని కాపాడాలి.రాజు ని మళ్లీ గద్దెపై కూచోపెట్టాల్సిన  బాధ్యత నీలాంటి యువకులపైనే ఉంది."వారి రాజభక్తికి మురిసి పోయాడు. తెల్లారుతూనే తన భటులను కలుసుకుని  రెట్టించిన ఉత్సాహం తో  ఏమరుపాటు గా ఉన్న శత్రువు పై దెబ్బతీశాడు.ఆవృద్ధదంపతులను తన రాజప్రాసాదంలో ఉంచుకున్నాడు.ఇలాంటి స్ఫూర్తి  దేశభక్తి మనందరం కలిగి ఉం డాలి. ఆనాటి రాజులు స్వార్ధం తో తమలోతాము కొట్లాడుకుని పరాయి పాలనకి భారత దేశం ని బలిచేశారు.అందుకే  మనం ఇప్పుడు ఇరుగుపొరుగు దేశాల టెర్రరిష్టులనించి  మనదేశంలో తలెత్తుతున్న దుండగులనించి కాపాడుకుంటూ సైన్యం పోలీసులకి అండదండగా ఉండాలి.రాజకీయాలు స్వార్ధం దేశం ని ముక్క చెక్కలు చేస్తాయి.అందుకే భవిష్యత్తు ని గూర్చి ఆలోచిస్తూ ముందు కి అడుగేద్దాం.


కామెంట్‌లు