అడకత్తెరలో పోకచెక్కల్లా;- అల్లాడి వేణుగోపాల్--కలం స్నేహం
దోపిడీ విధానంతో అణగారిన విద్యావ్యవస్థ
చిమ్మచీకట్ల కష్టాల కడలిని తలపించగా
నేతి బీరకాయ వంటి వైద్యాలయ తీరు
పుడమి పై ప్రత్యక్ష నరకంగా అనిపించగా

అందని ద్రాక్షపళ్ళ లాంటి ఉద్యోగ ఫలాలు
ఎండమావుల వలె ఊరించి మదిని రగల్చగా
అన్నదాతలకు ఉద్దేశించబడిన పథకాలు
కుక్కలు చింపిన విస్తరిలా వేదనను మిగల్చగా

కని పెంచిన దైవాల వంటి తల్లిదండ్రులు
ఏటిని దాటిచ్చిన తెప్పల్లా ఆశ్రమాలకు చేరగా
దేవాలయాల్లా శోభిల్లే  ఉమ్మడి కుటుంబాలు
చెల్లాచెదరై దిక్కు లేని శవాలలా మారగా

నీతిమార్గాన్ని వీడని పరమహంసలను
చేతకాని దద్దమ్మలుగా జాతి చూడగా
చీకట్లో దివ్వెలలాంటి మానవతా విలువలకు
ఏనాడో జనులు చరమగీతం పాడగా ...

సామాన్య మానవులు విలవిలలాడుతున్నారు
అడకత్తెర మధ్యన ఇరుక్కున్న పోక చెక్కల్లా
అవకాశవాదులు నిత్యం దోచుకుంటున్నారు
అత్యంత చాకచక్యంగా గుంటనక్కల్లా

కామెంట్‌లు