మఱ్ఱి చెట్టు;-వ్యాసకర్త--రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
 ప్రాణులకి అత్యధిక నీడను , ఆశ్రయాన్ని ఇచ్చే చెట్లలో మఱ్ఱి చెట్టు ఒకటి. ఊడలతో ఉండే ఈ చెట్టు మహావృక్షము.  “విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత” అంటూ వర్ణించబడిన ఈ చెట్టు "తన నీడను మరొక చెట్టును పెరగనివ్వదు" అనే నిందను పొందింది.  
దాని పైన నివసించే చిన్న చిన్న జంతువులు, పక్షులు, ఎన్నో ....  దాని కింద ఆవాసాన్ని ఏర్పరుచుకునే  పేద కుటుంబాలు ఎన్నో.. దానికుండే తొర్రలోను నివసించే ప్రాణులెన్నో ఉంటాయి.అలాంటి ప్రాణులకు సంబంధించిన. కథలెన్నో మనం పంచతంత్ర కథల్లో చదువుతాం కదా.
ఈ చెట్టు క్రింద ఓ బాటసారి పడుకుని ఎంతో చిన్న చెట్టుకు ఎంతో పెద్ద కాయలుంటాయి. కాని ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న చిన్న కాయలా. సృష్టి ఎంత విచిత్రం అనుకుని నిద్రపోయి, మరుసటి రోజు ఉదయాన్నే లేచి తనని కప్పేసిన మఱ్ఱి కాయలను చూచి దీని కాయలు పెద్దవై ఉంటే నేనీపాటికి చనిపోయి వుండేవాడిని కదా అని అనుకుని ఈ సృష్టి రహస్యం ఎంత అద్భుతమైంది ..ఎంత నిగూఢమైంది అని అనుకున్నాడట. 
ఇలా ఆత్మ జ్ఞానాన్ని, సృష్టి రహస్యాన్ని తెలిపే ఈ మఱ్ఱి చెట్టును అవరోహి,క్షీర వృక్షము, క్షీరి, జటాలము, పాదహోహణము, బహు పాదము, భూకేశము, భృంగి, మహాచ్ఛాయము, యక్షతరువు, యక్షావాసము, యమప్రియము,  రక్తఫలము, వటము, వై శ్రవణాలయము అనే పేర్లతోను పిలుస్తారు.  
మఱ్ఱి ఊడలను అవరోహము , జ ట,శింబు వంటి పేర్లతో  పిలుస్తారు.
పాలు గారే చెట్టు కనుక క్షీర వృక్షము – అని చాలా ఊడలు కలది కాబట్టి బహుపాదము  - అని, యక్షుడు నివసించు చెట్టు కాబట్టి యక్ష వాసము – అని మఱ్ఱి చెట్టును పిలుస్తారు. ఎండినా ఆకులుతో  ఉన్నా  పగలెంతో కళాత్మకంగా ఉండే  ఈ చెట్టు రాత్రిపూట జడలు విరబోసుకున్న దయ్యంలా భయం గొల్పుతుంది. 
మఱ్ఱి ఆకు చాలా అందంగా వుంటుంది. . దానిపైన పడుకున్న కృష్ణుణ్ణి వటపత్రసాయి అని “వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి” అంటూ ప్రార్థన చెప్పబడింది. 
ప్రతి దేవాలయంలోనూ స్థానమేర్పరచుకుని పూజలందుకునే ఈ చెట్టు ఆకులను ప్రసాదం పెట్టటానికి కూడా ఉపయోగిస్తారు. “పట్నమంత మర్రి పడితే మరి లేవదు,  బహు పాదాలుంటాయి కాని నడవలేదు” – అని, 
ఆకుల్దాన్ని కాను ఆకులుంటాయి. 
పోకల్దాన్ని కాను పోకలుంటాయి
బాతలెంతను గాను పాలుంటాయి
సన్నాసోణ్ణి గాదు జడలుంటాయి – అని  మఱ్ఱి చెట్టు గురించి ఎన్నో పొడుపు కథలు చెప్పబడ్డాయి. మన తెలుగు భాషలో. ఇంక పిల్లల కోసం –
మఱ్ఱి చెట్టు కింద బఱ్ఱె – మిఱ్ఱి మిఱ్ఱి చూచింది
గుఱ్ఱు గుఱ్ఱుమంటు తాత – గురక పెట్టి నిదరోయె
మఱ్ఱి తొఱ్ఱ నుండేమొ – కఱ్ఱు కఱ్ఱు చప్పుడాయె
ముల్లుగఱ్ఱ తాత తీసె – బఱ్ఱె చూసి పరుగు తీసె
- వంటి చిన్న గేయాలు వచ్చాయి.


కామెంట్‌లు