గీతాంజలి ;-రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు


 19." కాంతికై పుడమి స్వగతం ” (భక్తుని విరహవేదనా భావన కొంత సంయమనంతో కూడి వున్నది.) నువ్వు పలుకకపోతే అందువల్ల ఏర్పడ్డ మౌనాన్నే, నామనస్సు నిండా నింపుకొని ఓర్పు వహిస్తాను. సూర్యోదయం కోసం ఎదురుతెన్నులు చూచే నిశ్చల నిశ్శబ్ద నక్షత్ర మిలమిలల రేయి లాగా నీకోసమే ఎదురు చూస్తూ వుంటాను. చీకటి విడిపోయి తప్పకుండా తెల్లవారి తీరుతుందనే విశ్వాసం నాకున్నది. బంగారు రంగుతో అలరారుతున్న గగన తలాన్ని చీల్చుకుంటూ దూసుకొస్తున్న నీ కిరణకాంతికి శబ్దతరంగాలతో మేలుకున్న పక్షులన్నీ, కిలకిలారావాలు చేస్తుంటే అడవి చెట్లకొమ్మలన్నీ, నీ రాగాల పూలతో విరబూసి ఆనంద హర్షాలను విరజిమ్ముతున్నాయి. ప్రత్యక్ష నారాయణా నీ ఆగమనమే భగవత్ సాక్షాత్కారం.

కామెంట్‌లు