కణ్ణదాసన్ ఇల్లు కొన్నదెలా?;-- యామిజాల జగదీశ్
 తమిళ సినీ చరిత్రలో
"నేను శాశ్వతమైనవాడిని. నాకు నాశం లేదు" వంటి చిరస్థాయిగా నిలిచిపోయే పాటలను రాసిన కవిచక్రవర్తి కణ్ణదాసన్.
మద్రాసులోని త్యాగరాయనగరుకీ కణ్ణదాసన్ కీ మధ్య ఉన్న బంధం గాఢమైంది. విడదీయలేనిది.
కణ్ణదాసన్ నివసించిన వీధికి తమిళనాడు ప్రభుత్వం "కణ్ణదాసన్ వీధి" అని పేరు పెట్టింది.
మద్రాసుకొచ్చిన తొలి రోజుల్లో కణ్ణదాసన్ మ్యూజిక్ అకాడమీ సమీపంలో అద్దెకుండేవారు.
అక్కడి నుంచి ఆయన అడయారుకి మారారు. 
అనంతరం టీ. నగర్లో క్రెసంట్ పార్క్ వీధిలో అద్దెకు ఇల్లు తీసుకున్నారు.
ఆ సమయంలో ఎంజీఆర్, శివాజీ నటించిన పలు సినిమాలకు కణ్ణదాసనే ఎక్కువ పాటలు రాసి సినీకవిగా అగ్రస్థానంలో ఉన్నారు.
ఎక్కడైనా కణ్ణదాసన్ పాటలే వినిపిస్తుండేవి.
ఆయనతో పాటలు రాయించుకోవడం కోసం నిర్మాతలు కార్లలో వచ్చి నిరీక్షించేవారు. అయితే కణ్ణదాసన్ ఏ కారెక్కితే ఆ నిర్మాతకు పాటలు రాయడానికి పోతున్నట్టు అర్థం.
 
మిగిలిన నిర్మాతలు వెనక్కు వెళ్ళి మళ్ళా మరుసటిరోజు ఉదయం ఆయన ఇంటి ముందుర నిరీక్షించేవారు.
అప్పుడొకరోజు కణ్ణదాసన్ మిత్రుడు, భారతి పబ్లికేషన్ యజమాని చిదంబరం చెట్టియార్ "పిల్లాపీచులతో ఉన్నవాడివి. ఇంకెంత కాలం అద్దె ఇంట ఉంటావు" అని అడిగారు. అక్కడితో ఊరుకోక కణ్ణదాసన్ కి ఇల్లు కొనిపెట్టడంకోసం ఆయన దగ్గర నుంచే అప్పుడప్పుడూ కొంచెం కొంచెంగా డబ్బులు తీసుకుని ఆ డబ్బులతోనే ఓ ఇల్లు కొనిచ్చారు.
"చిదంబరం చెట్టియార్ గారి పుణ్యమాని మాకీ ఇల్లు దక్కింది. ఆయనకు మేం రుణపడి ఉన్నాం. ఈ ఇల్లు అందరికీ సరిపోదనే మా నాన్న ఇంట్లో కొన్ని మార్పులూ చేర్పులూ చేశారు" అని కణ్ణదాసన్ కుమారుడైన గాంధీ కణ్ణదాసన్ చెప్పారు.
"అప్పట్లో టి.ఆర్. రామణ్ణా సినీ సంస్థ తదితర సంస్థలు టీ. నగర్లోనే ఉండేవి. దాంతో పాటల కంపోజింగ్ కి వెళ్ళడానికి మా నాన్నగారికి సులువుగా ఉండేది. మా ఇంటి ఎదురుగా ఉన్న క్రెసంట్  పార్కులోనే మా నాన్న గారు రిలాక్స్ అయ్యేవారు. అన్నాదురై, కళైంజ్ఞర్ కరుణానిధి, వంటి ప్రముఖులు మా నాన్నగారిని కలిసి మాట్లాడుకోవడానికి ఇంటికి వచ్చేవారు. ప్రత్యేకించి పొంగల్ పండుగ రోజుల్లో మా నాన్నగారిని కలవడానికి కామరాజర్, ఎంజీఇర్, శివాజీ తదితరులు వచ్చేవారు. అప్పట్లో ఇటువంటి ప్రముఖులు మా ఇంటి మేడమీది డైనింగ్ హాల్లో భోంచేసేవారు. ఆ డైనింగ్ హాల్ ఒకప్పుడు యాభై మంది కలిసి భోజనం చేయడానికి వీలుగా ఉండేది. ఈ టీనగర్ ఇల్లు మా రక్తంలో కలిసిపోయింది. ఇప్పటికీ నేను మా కుటుంబంతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను. మేడమీద కణ్ణదాసన్ పబ్లికేషన్ ఆఫీసు నిర్వహిస్తున్నాం. ఏ ఊరుకి వెళ్ళినా టీనగర్ ఇంటికి ఎప్పుడు తిరిగెళ్తామనే ఉంటుంది మనసులో" అన్నారు గాంధీ కణ్ణదాసన్. 
ఈ ప్రచురణ సంస్థకు తరచూ వెళ్ళి వస్తుండేవాడిని. అలా వెళ్ళినప్పుడల్లా గాంధీ కణ్ణదాసన్ ని చూసేవాడిని. అంతేకాకుండా ఒకటి రెండుసార్లు ఓ పుస్తకం గురించి ఆయనతో మాట్లాడాను. ఓషో పుస్తకాలను తమిళంలో అనువదింప చేసి ప్రచురించిన సంస్థలలో ఈయన సారథ్యంలోని కణ్ణదాసన్ పదిప్పగం ఒకటి. ఓషో పుస్తకాలలో ఒకటైన "ఎ కఫ్ ఆఫ్ టీ" పుస్తకాన్ని తమిళంలో పువియరసు అనువదించగా కణ్ణదాసన్ పదిప్పగం "ఒరు కోప్పయ్ తేనీర్" శీర్షికన ప్రచురించగా కొని ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. ఈ పుస్తకంలో కొంత భాగం తెలుగులో అనువదించి గాంధీ కణ్ణదాసన్ గారిని కలిసాను. తెలుగులో మొత్తం అనువదించి ఇస్తాను...ప్రచురిస్తారా అని అడిగాను. అప్పుడాయన  "మాకు తెలుగు మార్కెటింగు గురించి తెలీదండి. అయినా తెలుగులో పుస్తకాలు ప్రచురించే ఆలోచన లేదండి" అని చెప్పారు. దాంతో ఆ పుస్తకానువాదం ఆపేశాను. 


కామెంట్‌లు