"రాణి గారి కథలు"; -రచయిత:-ఆర్.సి.కృష్ణస్వామి రాజు;-పుస్తకసమీక్ష:-డి గాయత్రి,టి.జి.టి.తెలుగు, (పరిశోధక విద్యార్థి), కల్వకుర్తి.


 లేలేత మనసులున్న చిన్నారుల చిరుప్రాయంలోనే వారి చురుకైన మస్తిష్కంలో మానవీయ బంధాలను, లోకం పోకడలను, యాంత్రిక పోకడలను, శకునాలను అతిగా నమ్మడం వల్ల ఎదురయ్యే కష్టాలను,చదువు వల్ల లాభాలను, వృత్తి విద్యలను, అన్య భాషలు ఆదరించడం వంటి ఎన్నో అంశాలను ఇతివృత్తంగా తీసుకొని పలుకుబడులు ,నానుడులు, సామెతలు ,జాతీయాలను సందర్భానుసారంగా ప్రయోగిస్తూ ఆర్.సి. కృష్ణ స్వామి రాజుగారు ఎన్నో నీతి కథలు "రాణి గారి కథలు" పుస్తకం ద్వారా పాదుకొల్ప టానికి ఎంతో విశేషమైన కృషి చేశారు.
          "ఆనంద రహస్యం" కథ ద్వారా ఎన్ని అష్ట ఐశ్వర్యాలు సంపాదించిన కూడా పొందని తృప్తి ఎవరికైనా ఏదైనా నా ఇవ్వడం లోనే పొందవచ్చనే విషయాన్ని తెలిపారు. "వెదురు కర్ర" కథ ద్వారా చేసే పని ఏదైనా మీది  మిక్కిలి గా ఉండకుండా అణిగి మణిగి వ్యవహరిస్తూ పనినే దైవ స్వరూపంగా భావించినప్పుడే మనం చేసే పనిలో విజయం సాధిస్తామని తెలిపాడు. అనుకోకుండా ఎదురయ్యే సంఘటనలను తెలివితో ఎలా అధిగమించాలో "పచ్చ ఇడ్లీ"  కథ ద్వారా చక్కగా తెలిపారు. "రాత్రి బడి" కథ ద్వారా ఎవరైనా నా నమ్మకం కలిగిన ఆ విషయం పట్ల ఎంత దూరమైనా ఆలోచిస్తారు, కానీ నమ్మకం లేని విషయంపై ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. అనే విషయాన్ని తెలుపుతూనే ఈ కథలో రైతులకు చదువుపై ఉన్న అయిష్టతను పోగొట్టి చదువుకుంటే ఎన్ని అభివృద్ధి ఫలాలను పొందవచ్చు సవినయంగా తెలుపుతూ రైతులు మార్పు ఏవిధంగా తెచ్చారో తెలిపాడు. 
"మావటి మాట" ఈ కథ ద్వారా రచయిత సమస్యలను చూసి  పారిపోకుండా కాలంలో మార్పు వచ్చినట్లే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపాడు. "నీటి అద్దె"కథలో అత్యాశకు వెళ్ళడం సరికాదని వక్రబుద్ధి తో ఆలోచిస్తే కుక్కకాటుకు చెప్పుదెబ్బ లాంటి సమాధానమే దొరుకుతుందని తెలియజేశారు."బుద్ధిమాటలు" కథలు పనీపాటా లేకుండా కొందరు యువకులు పండితుని పాండిత్యానికి పెట్టిన పరీక్షలో లౌక్యంగా సమాధానమిచ్చిన పండితుని పాండిత్యానికి తార్కాణమే కాకుండా యువతలో మార్పు కు కారణం అవుతుంది. "గంప కింద పిల్లి" ఈ కథ ద్వారా సాంప్రదాయాలు ఏంటో తెలుసుకొని మసలాలి ఒకరు ఏదో చేశారని మనం కూడా అదే విధంగా చేయాలని ,మక్కీకి మక్కీ తరహాగా చేయాలని అనుకోవడం తప్పని సున్నితంగా తెలిపారు.
        "ప్రాణవాయువు" అనే కథలో వృక్షో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని తెలియజేస్తూ "చెట్లు లేని చేను, చుట్టాలు లేని ఊరు "అని తెలుపుతూనే చెట్లు లేకపోతే ప్రాణవాయువు కొరవడి ఎలాంటి ఆపదలు వస్తాయో చక్కగా తెలియజేశారు ."ఇడ్లీ చట్నీ" కథలో వంతులు వేసుకుని పని చేయడం కాదు కలిసి పని చేసుకోవాలి అనే విషయాన్ని తెలిపారు." రాణి గారి కథ"ద్వారా రాజు ప్రజల బాగోగులు చూస్తూ రాణి గారిని పట్టించుకోకపోవడంతో రాణిలో పేర్కొన్న కోపాన్ని ,ప్రేమను బయటకు రప్పించి రాణిలో ఆస్థాన వైద్యుడు ఎలాంటి మార్పు తీసుకువచ్చాడో చక్కగా తెలియజేశాడు."చీపురు పుల్ల" కథలు రాజు యువరాజును విద్య కోసం ఆశ్రమానికి పంపించకుండా రాజప్రసాదంలోనే విద్య నేర్పమనగా పండితుడు అందుకు అంగీకరించకుండా యువరాజు భవిష్యత్తులో కాబోయే మహారాజు కావున ఎన్నో పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది అని రాజుకు సున్నితంగా వివరిస్తూనే రాజకుమారుని లోని సౌకుమార్యాన్ని చీపురుపుల్ల ను ఉపయోగిస్తూ రాజు కళ్లకు కట్టినట్లుగా వివరించాడు. తద్వారా యువరాజులో ఎలాంటి మార్పు తీసుకురావాలో రాజుకు కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూనే నేటి విద్యార్థి లోకానికి కూడా సందేశమిచ్చాడు.
       "వేళ్ళు బలంగా ఉంటేనే మహా వృక్షం"అనే కథ ద్వారా పరీక్షల్లో కాపీ  జరగటం వల్ల మంచిగా చదివే పిల్లల్లో ఎలాంటి సంఘర్షణలు ఏర్పడతాయో వాటిని ఏవిధంగా అధిగమింపచేయాలో చక్కటి ఉదాహరణల ద్వారా తెలిపారు." "కలసి తింటే కలదు సుఖం "అనే  కథ ద్వారా నేటి సమాజంలో జరుగుతున్న విషయాలలో ఒకటైన యాంత్రిక జీవితం ఇంకా ధనార్జన కోసం పరిగెత్తుతూ అనుబంధాలను ఎలా కోల్పోతున్నారో వివరిస్తూనే దానికి పరిష్కార మార్గాన్ని తెలిపారు. పాత కాలంలో అందరూ కలిసి తినే విషయాన్ని గుర్తు చేశారు. "పులి -గిలి" ఈ కథ ద్వారా అన్యభాషలను నేర్చుకోవడం వల్ల భాషాపరమైన ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని తెలిపారు. "యోగా ఒక యోగం" ఈ కథ ద్వారా పిల్లలకు విద్యాభ్యాసంతో పాటు యోగాభ్యాసం కూడా అవసరమని తెలిపాడు."పిల్లనగ్రోవి" కథ ద్వారా నిజమైన కళాకారులు ఎవరి మెప్పు ఆశించరని, అవకాశాలే కళాకారులను వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు." కుక్క చెవులు" అనే కథ ద్వారా రాజు గారికి ఉన్న విపరీత శకునాల నమ్మకం కారణంగా రాజ్యంలోని ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో కుక్కల చెవులపై విధించిన ఆంక్షల కారణంగా కుక్కలు ఇబ్బందిపడుతూ తమ చెవులను కాపాడుకునే దిశగా రాజ్యాన్ని కాపాడి రాజు కళ్ళు తెరిపించాయి.
           "మంచి గురువు ఉండాలి" అనే కథ ద్వారా విద్యార్థి లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి మెళకువలు అవసరమో, కోచింగ్ తీసుకోవడం ద్వారా ఎలా ప్రతిభను మెరుగు పట్టుకొని లక్ష్యాన్ని సాధించవచ్చో చక్కగా తెలిపాడు." రాణి నవ్వు" కథలో చేతివృత్తులకు సంబంధించిన విద్యలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తే కళలు దిన దిన ప్రవర్ధమానం చెందుతూ గొప్ప గొప్ప కళాకృతులను వెలికి తీయవచ్చనే  విషయాన్ని తెలియజేశారు. "నమ్మకానికి చిరునామా నాన్న" కథలో ఒక ఎద్దుల బండిలో ఎత్తైన ప్రదేశానికి వెళ్లి ప్రమాదంలో  చిక్కుకున్న సందర్భంలో బండి లో ఉన్న పిల్లలందరూ ఎంతో కంగారు పడతారు.కానీ,అందులో ఉన్న ఒక అమ్మాయి మాత్రం తొణకకుండా, బెదరకుండా అ బండి నడిపేది తన నాన్నే కాబట్టి ఎలాగైనా కాపాడతాడని నమ్మకంతో కూర్చుంటుంది .ఈ సంఘటన ద్వారా నాన్న యొక్క ప్రేమను అమ్మాయికి నాన్నపై ఉన్న నమ్మకాన్ని కళ్ళకు కట్టినట్లుగా మన ముందుంచాడు రచయిత.
          ఇలా ఎన్నో విషయాలను మొలక ప్రాయంలోనే కథల ద్వారా వివరిస్తూ బాలల్లో  నైతికతను పెంపొందించడంలో తన పాత్రను నిర్వహించారని భావిస్తున్నాను.
కామెంట్‌లు