నేను ప్రయోజకుడినయ్యేనా - కణ్ణదాసన్;-- యామిజాల జగదీశ్
 జీవితంలో ఎంతెత్తుకు ఎదిగినా తమ గురువుల పట్ల విద్యార్థులు తగు మర్యాదతో ప్రవర్తిస్తూ అణకువతో ఉంటారనడానికి ఇదొక ఉదాహరణ. అదీనూ తమిళనాడులో కవిచక్రవర్తిగా వినుతికెక్కిన కణ్ణదాసన్ జీవితంలోని వాస్తవ సంఘటన ఇది.
కణ్ణదాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రఖ్యాతులు గడించి ఉచ్ఛస్థితిలో ఉంటున్న రోజులవి.
ఓ చెట్టినాడు గ్రామంలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రసంగించడానికి కణ్ణదాసన్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. అందుకు కణ్ణదాసన్ సమ్మతించారు. మద్రాసు నుంచి కారులో బయలుదేరారు.
అయితే ఆ చెట్టినాడు గ్రామానికి పోవాలంటే అమరావతిపుదూర్ అనే గ్రామం గుండానే వెళ్ళాలి.
ఈ గ్రామంలోని గురుకులంలోనే కణ్ణదాసన్ చిన్నతనంలో చదువుకున్నారు.
మహాత్మాగాంధీ ఈ గురుకులాన్ని సందర్శించి ఆశీర్వదించిన చరిత్ర ఉంది. అందుకే ఆ గురుకులం గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.
కణ్ణదాసన్ ప్రయాణిస్తున్న కారు ఆ గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ ఆయనకు తాను చదువుకున్న స్కూలు కనిపించింది. కణ్ణదాసన్ వెంటనే  కారును ఆపమన్నారు.
కారులోంచి కిందకు దిగిన కణ్ణదాసన్ ఆ స్కూలు గుమ్మం ఎదురుగా నడిరోడ్డుమీద కూర్చుండిపోయారు.
అక్కడున్న వారందరికీ ఆయనెందుకలా కూర్చున్నారో అర్థం కాలేదు.
స్కూల్లో ఉన్నవారు, ఆ వీధిలో వెళ్తున్న వారు కణ్ణదాసన్ ని చూసి విస్తుపోయారు, ఆయనెందుకు రోడ్డుమీద కూర్చున్నారోఎవరికీ తెలీక!!
ఆయన పాల్గొనవలసిన కార్యక్రమానికి టైమవుతోంది.
వెంట ఉన్నవారు ఒకింత ధైర్యం తెచ్చుకుని అడిగారు "ఏమైందండి? ఎందుకిలా కూర్చుండిపోయారు?" అని
అప్పుడు కణ్ణదాసన్ "ఏమీ లేదు ...నేనిక్కడ చదువుకుంటున్నప్పుడు మా గురువుగారు "నువ్వెందుకూ పనికిరావురా ! నువ్వసలు
పనికిరావు అని నన్నెప్పుడు చూసినా అంటుండేవారు. ఇంతకూ నేను ప్రయోజకుడినయ్యానా? లేదా? నాకు తెలీడం లేదు" అన్నారు.
ఆయన ఏదో కావాలనే ఆటపట్టించడానికి అలా అంటున్నారనుకున్నారే తప్ప ఎవరికేం చెప్పాలో తెలీలేదు.
అయితే కణ్ణదాసన్ మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తూ వచ్చారు - " నేను ప్రయోజకుడినయ్యానో లేదో తెలీడం లేదు" అని!
ఇంతలో అక్కడికి దగ్గర్లోనే ఉన్న టీ కొట్లోంచి ఓ పాట వినిపించింది. ఆ పాట రాసింది కణ్ణదాసనే.
వెంటనే కణ్ణదాసన్ "చూసేరా....నా పాట రేడియోలో వస్తోంది. అంటే నేను ప్రయోజకుడునైనట్టేనే? మరి మా గురువుగారు మరి నన్నెలా అలా అనొచ్చు" అని ప్రశ్నించారు.
కాస్సేపటికే కణ్ణదాసన్ తీరు ఆ
ఊరంతా తెలిసిపోయింది. కొందరు పరుగెత్తుకు వెళ్ళి కణ్ణదాసన్ గురువుగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు.
వెంటనే ఆయన కణ్ణదాసన్ దగ్గరకు బయలుదేరారు.
ఆయన వచ్చేంతసేపూ కణ్ణదాసన్ రోడ్డుమీదే కూర్చుని తమ గురువుగారి గురించే మాట్లాడారు.
ఇంతలో గురువుగారు వస్తుండటాన్ని గమనించిన కణ్ణదాసన్ లేచి నిలబడ్డారు.
గురువుగారు సమీపిస్తున్న కొద్దీ కణ్ణదాసన్ కు చెమటలు పట్టాయి. 
గురువు దగ్గరకు రావడంతోనే ఆయనకు నమస్కరించారు.
గురువుగారు కణ్ణదాసన్ చేతులు పట్టుకుని
 "ఏంటి ముత్తూ (కణ్ణదాసన్ అసలు పేరు ముత్తయ్య)....ఏంటలా రోడ్డుమీదే కూర్చున్నావని తెలిసొచ్చాను. ఏమిటి చిన్న పిల్లాడిలా?"అని అడిగారు.
కణ్ణదాసన్ "ఏమీ లేదండి" అన్నారు.
అంతట గురువుగారు "నువ్వు వచ్చావని తెలిసింది. నువ్వు రోడ్డు మీద కూర్చోవడం మొదలుకుని నువ్వన్న మాటలన్నీ చెప్పారు.
నిన్ను చిన్నప్పుడు నేనన్న మాటలతో నీకు కోపం వచ్చినట్టుంది. సరేగానీ అప్పట్లో ఏదో అలా అన్నాను. ఆ మాటే పదే పదే  అన్నావటగా. నీ గురువుగారిని నేను. ఆ హక్కుతోనే ఆరోజుల్లో అలా అన్నాను. మరెవరైనా నిన్నలా అనగలరా?  మాష్టారు తిట్టినా, తల్లిదండ్రులు తిట్టినా అవేవీ అయిపోవు. ఆ మాటలన్నీ లోపల నుంచి వచ్చేవి కావు. అయినా మీ మంచి కోసమే
చెప్తామే తప్ప మరి దేనికోసమూ కాదు. నిన్ను తలవని రోజంటూ ఉండదు. రోజూ నిన్ననుకుని  ఎంత గొప్పగా చెప్తానో నలుగురికీ తెలుసా. నా శిష్యుడు ఎంత పెద్ద వాడయ్యాడో చూశారా అని గర్వంగా అంటుంటాను.... అదిగో చూడు. నువ్విక్కడి కార్యక్రమానికి వస్తున్నావని తెలిసి ఊరు ఊరంతా నీకు స్వాగతం చెప్తూ పోస్టర్లు అతికించారు. నువ్వేం మాట్లాడుతావోనని ఎంతమంది తరలివెళ్తున్నారో తెలుసా. అటు చూడు. ముందు కార్యక్రమానికి పదా. నేనూ నీ మాటలు వినడం కోసం నీ వెనకే వస్తాను. పదా...." అన్నారు.
మాష్టారుగారి మాటలు విన్న కణ్ణదాసన్ కు నోటంట ఒక్క మాటా రాలేదు. మౌనంగా చేతులు కట్టుకుని వింటూ నిల్చుండిపోయారు.
కణ్ణదాసన్ గురువుగారు కనిపించనంతవరకూ వేసిన ప్రశ్నలన్నింటినీ పక్కనపెట్టి ఆయనను చూడటంతోనే మౌనంగా ప్రవర్తించిన తీరును చూసాక అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. 
అప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్న కణ్ణదాసన్ గురువుగారు మాట్లాడుతున్నంతసేపూ ఎదురు ఒక్క మాటా చెప్పలేకపోయారు.
అనంతరం కణ్ణదాసన్  గురువుగారి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు పొంది తాను పాల్గొనవలసి ఉన్న కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళారు.
నిజానికి గురువులూ విద్యార్థులకు ఓ తల్లీ తండ్రీ వంటివారేగా!!


కామెంట్‌లు