పత్ని వ్రతుడు ;-సావిత్రి కోవూరు;-కలంస్నేహం
 కోడికూత కూయ బట్టే కొత్త రోజు మొదలయ్యే బావయ్యో - ముగ్గులేసి కాఫీ పెట్ట రావయ్యో 
మల్లె పూల చెట్టు కింద మంచమేసి వేచి ఉన్నా బావయ్య - అంట్లు తోమి, ఇల్లు ఊడ్చ రావయ్యో 
కొమ్మ మీద కోకిలమ్మ తొంగి తొంగి సూత్త ఉన్నది బావయ్యో - కోక రవిక తెల్లగుతక రావయ్యో 
సీతాకోకచిలుక లేమో పూల వాల వచ్చినాయి బావయ్యో - నీళ్లు బట్టి, టిఫిన్ వండ రావయ్యో 
చిరుజల్లుల చినుకు లేమో చిటపటగా రాల బట్టె బావయ్యో - చీరలన్ని ఆరవేయ రావయ్యో 
గాలివాన కురియ బట్టే ఎండుటాకులు కదల బట్టే బావయ్యో - దుమ్ము దులిపి ఇల్లు సర్దా రావయ్యో 
కొత్త సీరియల్ మొదలాయే కొత్త పాటలు రాబట్టే బావయ్యో - కొత్త వంటలు చేసి నాకు కోరిపెట్ట రావయ్యో 
మబ్బులోని చందమామ మనను చూడ పరుగు నచ్చే బావయ్యో - పిల్లలేమొ ఏడ్వబట్టిరి కథలు చెప్పి ఊరడించ రావయ్యో.
కొత్త సినిమా వచ్చెనంట కోరి నేను చూసి వస్తా బావయ్యో - ఇంటి పనులు అన్నీ చేసి ఇంటి కాపలా ఉండవయ్యా బావయ్యా.

కామెంట్‌లు