నిజాయితీ (చిట్టికథ);-- డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్.

 అక్కడొక చెరుకుతోట. పక్కనే దుర్గాలయం.
అక్కడెఃతో ప్రశాంతంగా ఉంది. ఆలయ మండపంలో ఒక సాధువు కళ్ళుమూసుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా అక్కడికి దగ్గరలోనే ఉన్న చెట్టు పైనున్న కాకులు గోల చేశాయి. 
ఏమిటా అని సాధువు కళ్ళుతెరిచి చూశాడు.ఒకవ్యక్తి చేతిలో ఒక మూటతో నడిచివస్తూ కనిపించాడు. అతడు ఈ సాధువు ముందుకువచ్చి నమస్కరించి "మహాత్మా! నాపేరు రాఘవయ్య ఈపక్కనే ఉన్న ఊరిలో ఉంటాను. ఒక పనిబడి పొరుగూరికి వెళుతున్నాను.దారిలో ఒక పూరిగుడిసె ముందు ఈమూట కనబడింది పైగా ఎవరో హడావుడిగా పరుగెత్తుతూ కనిపించారు.నేను పిలిచినా పలకలేదు.గుడిసెలో చూస్తే ఎవరూలేరు.ఏంచేయాలో తెలియక ఇలా వచ్చాను.ఇంతలో మీరు కనిపించారు.మీరు దీనిని దయచేసి దీని స్వంతదారుకు ఇవ్వండి. నేను వెళ్ళిపోతాను" అన్నాడు.
అప్పుడు సాధువు"నాయనా ఈమూటలో ఏముంది?" అని అడిగాడు. "స్వామీ నేను దీనిని తెరిచి చూడలేదు"అని రాఘవయ్య బదులిచ్చాడు. "అయితే తెరిచిచూడు అందులో ఏమున్నాయో చూద్దాం" అన్నాడు సాధువు.
రాఘవయ్య ఆమూటను తెరిచాడు.అందులో డబ్బులున్నాయి. వాటినిచూసిన సాధువు "నాయనా ఈ డబ్బులమూట ను తీసుకెళ్ళి ఈ దేశాన్నిఏలే రాజుగారి భార్య రాణీ సుమిత్రాదేవి గారికి అందజెయ్యి. అంతేగాని ఇంకెవరికీ ఇవ్వకు.ఆవిడ మంచిమనిషి,ధర్మాత్మురాలు, అందరికీ న్యాయం చేస్తుంది. రాజోద్యోగులలో ఎక్కువమంది గుంటనక్కలు ఉన్నారు. వారిదగ్గర న్యాయం జరగదు. భద్రంగా ఆమూటను తీసుకెళ్ళు.నీకు శుభం జరుగుతుంది" అన్నాడాయన.
రాఘవయ్య రాణీగారి దర్శనం చేసుకుని జరిగింది చెప్పి ఆ డబ్బులమూటను అప్పగించాడు.రాణీగారు రాఘవయ్య నిజాయితీకి ఎంతో సంతోషించింది. అప్పటికే రాజభటులు ఒకదొంగను అక్కడ ప్రవేశపెట్టారు.ఆదొంగ తన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు.డబ్బులు ఒక మూటలో కట్టి తీసుకెళ్ళానన్నాడు. కాని ఆమూట ఎక్కడో జారిపోయిందన్నాడు. అది నిజమని తేలింది. అందుకే దొంగను కటకటాలలోకి పంపించి రాఘవయ్యకు బహుమతి ఇచ్చి సత్కరించింది.

కామెంట్‌లు