వ్యాపార విజయం ;-నందగిరి రామశేషు-కలం స్నేహం
 చేపలకెరవేసి బ్రతుకు తెరువు సాగించు నొకడు
అత్యంత దారిద్ర్యము ననుభవించు బడుగు వాడు
వాడిని మోసపుచ్చుట జీవన భృతిగా ఉన్న వాడొకడు
తలదన్నిన వాని తాడిని దన్నువాడు ఉండి తీరుగా
వాడిని తలదన్నే దళారీ వాడిని మోస గిస్తాడుగా
ఒకరినొకరు మోసగించుటయే జీవిత పరమార్థంగా
ఎవరిది తప్పని, ఎవరిని నిలదీయాలి మోసం చేసారని 
చేప అంటుంది, తనకి ఎర వేసిన జాలరిది మోసమని
జాలరి భావన తనని మోసగించిన మనిషిదే తప్పని
దళారి అనేది, ఇది తన వ్యాపార సరళిలో భాగమని
తెలుసుకోలేరు జనం మోసపోయిన పిదప గాని
భావింతురు కొందరు వ్యపారమనిన మోసమేనని
ఒకరిని మించి మరొకరు మోసగాళ్ళు తరచి‌ చూసిన
మంచితనంతో నిలకడగా నిలుచును ఏ వ్యాపారమైన.
చూపాలి బేహారులు ముందు తరాలకు సరైన దారి
అవగాహన లేని కొత్తవారు పట్టెదరు మోసగించే ముళ్ళదారి
గడిచిన పిదప కొంతకాలం కళవెళపడుదురు లేక ఏదారి
విని ముందుగనే పెద్దలమాట సాగవలె ధర్మ మార్గాన
వదలరాదు నమ్మిన దారిని ఇడుములెన్ని కలిగినా 
నమ్మకమే పెట్టుబడి యని మరువరాదు ఎటువంటి వ్యాపారికైనా 
అలజడులెన్ని ఉన్నా, కడకు జయించేది ధర్మమేనన్నా
విజయం వరించును న్యాయమైన వ్యాపారిని ఎన్నటికైనా.

కామెంట్‌లు